లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 78


78వ ప్రకరణము

1832, మార్చి 1న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఆ రోజు, ప్రవక్త మరియు ఇతర నాయకులు సంఘ కార్యకలాపాల గురించి చర్చించడానికి సమావేశమయ్యారు. మిస్సోరికి ప్రయాణించి, సంఘ వాణిజ్య మరియు ప్రచురణ ప్రయత్నాలను ఏర్పాటు చేయమని ఈ బయల్పాటు మొట్టమొదట ప్రవక్త, సిడ్నీ రిగ్డన్ మరియు న్యూయెల్ కె. విట్నీలకు సూచించెను. ఈ ప్రయత్నాలను పర్యవేక్షించి, సీయోను సంస్థాపనకు మరియు బీదల ప్రయోజనము కొరకు విరాళాలను సేకరించే ఒక “సంస్థను” సృష్టించుట ద్వారా దానిని నెలకొల్పాలని సూచించెను. ఐక్య సంస్థగా పిలువబడు ఈ సంస్థ, 1832 ఏప్రిల్‌లో ఏర్పరచబడి, 1834లో రద్దు చేయబడింది (82వ ప్రకరణము చూడుము). ఇది రద్దు చేయబడిన తరువాత, జోసెఫ్ స్మిత్ నిర్దేశకత్వములో, “వాణిజ్య మరియు ప్రచురణ సంస్థాపనలు” అనే పదము ఈ బయల్పాటులో “బీదల కొరకు గిడ్డంగి యొక్క లావాదేవీలు” అనే పదముతో, “సంస్థ” అనే పదము “క్రమము” అనే పదముతో భర్తీ చేయబడినవి.

1–4, పరిశుద్ధులు ఒక గిడ్డంగిని ఏర్పాటుచేసి, స్థాపించవలెను; 5–12, వారి ఆస్థులను తెలివిగా ఉపయోగించుట రక్షణకు నడిపించును; 13–14, సంఘము భూలోక శక్తులపైన ఆధారపడకయుండవలెను; 15–16, మిఖాయేలు (ఆదాము), పరిశుద్ధుని (యేసు క్రీస్తు) నిర్దేశములో పనిచేయును; 17–22, విశ్వాసులు ధన్యులు, వారు అన్నింటిని స్వాస్థ్యముగా పొందుదురు.

1 ప్రభువు జోసెఫ్ స్మిత్ జూ. తో ఇలా చెప్పుచు మాట్లాడెను: నా సంఘపు ప్రధాన యాజకత్వమునకు నియమించబడి, మీయంతట మీరు కూడివచ్చిన వారలారా, నన్ను ఆలకించుడని దేవుడైన మీ ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

2 ఉన్నతస్థలము నుండి మిమ్ములను నియమించిన ఆయన ఉపదేశమును ఆలకించుడి, ఆయన మీ చెవులలో జ్ఞానము గల వాక్యములను పలుకును, తద్వారా మీరు నా యెదుట సమర్పించిన విషయమందు మీకు రక్షణ కలుగును అని దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

3 ఏలయనగా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, సమయము ఆసన్నమైనది, ఇప్పుడది సమీపములోనున్నది; ఇదిగో, ఈ ప్రాంతములోను, సీయోను ప్రదేశములోను నా జనులలోనున్న బీదల కొరకైన గిడ్డంగి కార్యకలాపములను నియంత్రించుటకు, స్థిరపరచుటకు నా జనుల యొక్క ఒక వ్యవస్థ ఉండుట ఆవశ్యకమైయున్నది—

4 నా సంఘమునకు చిరకాలముండు, శాశ్వతమైన సంస్థాపన మరియు వ్యవస్థ కొరకు, నరుని రక్షణకు, పరలోకమందున్న మీ తండ్రి మహిమ కొరకు మీరు అవలంబించుచున్న హేతువును ముందుకు తీసుకొనిపోవుటకు;

5 తద్వారా పరలోక విషయముల బంధములందును, పరలోక విషయములను పొందుటకు లోక విషయములందు కూడా సమానమగుదురు.

6 ఏలయనగా మీరు లోక విషయములందు సమానముగానుండని యెడల పరలోక సంగతులను పొందుటలో మీరు సమానముగా నుండలేరు;

7 ఏలయనగా సిలెస్టియల్ లోకములో నేను మీకు ఒక స్థలమును ఇవ్వాలని మీరు కోరిన యెడల, నేను మీకాజ్ఞాపించిన సంగతులను, మీ నుండి కోరిన వాటిని చేయుట ద్వారా మిమ్ములను మీరు సిద్ధపరచుకొనవలెను.

8 ఇప్పుడు ప్రభువు నిశ్చయముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ క్రమములో చేరిన మీ వలన ఈ వ్యవస్థలో అన్నిసంగతులు నా మహిమార్థమై జరుగుట యుక్తము;

9 లేదా, మరియొక మాటలలో, నా సేవకుడు న్యూయెల్ కె. విట్నీ, నా సేవకుడు జోసెఫ్ స్మిత్ జూ., నా సేవకుడు సిడ్నీ రిగ్డన్ సీయోనులోనున్న పరిశుద్ధులతో సలహామండలిలో కూర్చొనవలెను;

10 లేనియెడల సత్యమునుండి వారి హృదయాలను సాతాను త్రిప్పివేయును, తద్వారా వారు గ్రుడ్డివారై, వారి కొరకు సిద్ధపరచిన సంగతులను గ్రహింపకుందురు.

11 కాబట్టి, మీరలేని ఒక ఒప్పందము లేదా ఒక నిత్య నిబంధన చేత మీకు మీరు సిద్ధపడి, ఏర్పాటు చేసుకొనవలెనని నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను.

12 దీనిని అతిక్రమించువాడు సంఘమునందు అతని స్థానమును, అధికారమును కోల్పోవును, విమోచన దినము వరకు సాతాను దెబ్బలకు అప్పగించబడును.

13 మీకు ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు నెరవేర్చుటకు మిమ్ములను సిద్ధపరచు సిద్ధపాటు, నేను మీకిచ్చు పునాది, మాదిరి ఇదియే, తద్వారా మీకు ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు నెరవేర్చగలరు;

14 నా ముందు చూపు వలన, మీపైకి రాబోవు శ్రమ ఉన్నప్పటికిని, సిలెస్టియల్ లోకము క్రిందనున్న ఇతర జీవులన్నింటికి పైగా సంఘము స్వతంత్రముగా నిలుచును;

15 తద్వారా మీకు సిద్ధపరచిన కిరీటము యొద్దకు వచ్చి, నా రాజ్యములకు అధిపతులుగా చేయబడుదురని ఆడమ్-ఓన్డై-అహ్‌మన్ పునాదులను స్థాపించిన ప్రభువైన దేవుడు సెలవిచ్చుచున్నాడు.

16 ఆయన మిఖాయేలును మీ అధిపతిగా నియమించి, అతని పాదములను స్థిరపరచి, ఉన్నతముగా హెచ్చించి, జీవితకాలమునకు ఆదియైనను, జీవమునకు అంతమైనను లేనివాడునైయున్న పరిశుద్ధుని ఉపదేశము, నిర్దేశకత్వములో అతనికి రక్షణ తాళపుచెవులను ఇచ్చెను.

17 మీరు చిన్నపిల్లలు, తండ్రి ఎంత గొప్ప దీవెనలను తన స్వహస్తములలో కలిగియుండి, మీ కొరకు సిద్ధపరచెనో మీరింకను గ్రహింపలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;

18 అన్ని సంగతులను మీరిప్పుడు సహించలేరు; అయినప్పటికీ, సంతోషించుడి, నేను మిమ్ములను నడిపించెదను. పరలోకరాజ్యము, దాని దీవెనలు, నిత్యత్వపు ఐశ్వర్యములు మీవైయున్నవి.

19 అన్ని విషయములను కృతజ్ఞతాభావముతో స్వీకరించువాడు మహిమకరముగా చేయబడును; వానికి భూమి యొక్క శ్రేష్ఠమైనవి నూరంతలు గాను, ఇంకా అధికముగాను అనుగ్రహించబడును.

20 కాబట్టి, నేను మీకాజ్ఞాపించిన వాటిని చేయుడని మీ విమోచకుడు, అహ్‌మన్ కుమారుడు సెలవిచ్చుచున్నాడు, ఆయన మిమ్ములను తీసుకొని వెళ్ళకముందు అన్నింటిని సిద్ధపరచును;

21 ఏలయనగా మీరు జ్యేష్ఠుల సంఘము వారు, ఆయన మేఘములో మిమ్ములను పైకి తీసుకొనిపోయి, ప్రతి మనుష్యునికి వాని పాలు నియమించును.

22 నమ్మకమైన, తెలివైన గృహనిర్వాహకుడు అన్నింటిని స్వాస్థ్యముగా పొందును. ఆమేన్.