లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 47


47వ ప్రకరణము

1831 మార్చి 8న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ప్రవక్తకు గుమాస్తాగా పనిచేసియున్న జాన్ విట్మర్, ఆలీవర్ కౌడరీకి బదులుగా సంఘ చరిత్రకారుడు మరియు లేఖరిగా సేవచేయుటకు అడుగబడినప్పుడు మొదట సందేహించెను. ఆయన ఇలా వ్రాసెను, “దానిని నేను చేయకూడదని అనుకున్నాను, కానీ ప్రభువు చిత్తము నెరవేరాలని తెలుసుకున్నాను మరియు ఆయన దీనిని కోరుచున్నట్లైతే, దీర్ఘదర్శియైన జోసెఫ్ ద్వారా ఆయన ప్రత్యక్షపరచాలని నేను కోరుచున్నాను.” జోసెఫ్ స్మిత్ ఈ బయల్పాటును పొందిన తరువాత, జాన్ విట్మర్ అంగీకరించి, ఆయనకు నియమించిన స్థానములో సేవచేసెను.

1–4, సంఘ చరిత్రను లిఖించుటకు మరియు ప్రవక్త కొరకు వ్రాయుటకు జాన్ విట్మర్‌కు బాధ్యత అప్పగించబడెను.

1 ఇదిగో, అతడు మరిన్ని బాధ్యతలకు పిలువబడువరకు జాన్ విట్మర్ ఒక క్రమ చరిత్రను వ్రాసి, నమోదు చేయుట మరియు నా సేవకుడవైన జోసెఫ్ అను నీకు ఇవ్వబడు అన్ని సంగతులను నకలుచేయుటలో నీకు సహాయపడుట నా యందు యుక్తమైయున్నది.

2 మరలా, అవసరమైనప్పుడల్లా కూడికలలో అతడు కూడా తన స్వరమును ఎలుగెత్తవచ్చును.

3 నేను మరలా నీతో చెప్పునదేమనగా సంఘ వృత్తాంతమును, సంఘ చరిత్రను ఎడతెగక వ్రాయుటకు అతడు నియమించబడును, ఏలయనగా ఆలీవర్ కౌడరీని మరియొక స్థానమునకు నేను నియమించితిని.

4 కాబట్టి, అతడు విశ్వాసముగా ఉన్నంతవరకు ఈ సంగతులను వ్రాయుటకు ఆదరణకర్త ద్వారా అతనికది అనుగ్రహింపబడును. అలాగే జరుగును గాక. ఆమేన్.