లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 105


105వ ప్రకరణము

1834, జూన్ 22న మిస్సోరిలోని ఫిషింగ్ రివర్ వద్ద ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ప్రవక్త నాయకత్వములో ఒహైయో మరియు ఇతర ప్రాంతాలనుండి పరిశుద్ధులు తరువాత సీయోను శిబిరముగా పిలువబడిన సాహసయాత్రలో మిస్సోరికి కవాతు చేసిరి. వారి ఉద్దేశ్యమేమనగా, బహిష్కరించబడిన మిస్సోరి పరిశుద్ధులను జాక్సన్ కౌంటీలో ఉన్న వారి స్థలాల యొద్దకు తీసుకొనివెళ్ళుట. పరిశుద్ధులను ఇంతకుముందు హింసించిన మిస్సోరివారు, సీయోను శిబిరమునుండి ప్రతిదాడికి భయపడి, ముందుజాగ్రత్తగా క్లే కౌంటీ, మిస్సోరిలో నివశిస్తున్న పరిశుద్ధులపై దాడిచేసారు. మిస్సోరి గవర్నర్ పరిశుద్ధులకు సహాయము చేస్తానన్న తన వాగ్దానమును వెనుకకు తీసుకొన్నప్పుడు, జోసెఫ్ స్మిత్ ఈ బయల్పాటును పొందెను.

1–5, సిలెస్టియల్ ధర్మశాస్త్రమునకు అనుగుణముగా సీయోను నిర్మించబడును; 6–13, సీయోను విమోచన కొద్దికాలము పాటు వాయిదా వేయబడెను; 14–19, సీయోను యుద్ధములను ప్రభువు పోరాడును; 20–26, పరిశుద్ధులు కూడి వచ్చినప్పుడు జ్ఞానవంతులుగానుండి, మహత్కార్యములను గూర్చి గర్వపడకూడదు; 27–30, జాక్సన్ కౌంటీ, దానికి ఆనుకొనియున్న కౌంటీలలో స్థలములు కొనుగోలు చేయబడవలెను; 31–34, కర్ట్‌లాండ్ నందు ప్రభువు యొక్క మందిరములో పెద్దలు ఒక దీవెనను పొందవలసియున్నది; 35–37, పిలువబడి, ఎన్నుకోబడిన పరిశుద్ధులు పరిశుద్ధపరచబడుదురు; 38–41, పరిశుద్ధులు లోకమునకు శాంతి ధ్వజమునెత్తవలెను.

1 శ్రమలను పొందిన నా జనుల విమోచనను గూర్చి నా చిత్తమును నేర్చుకొనుటకు కూడివచ్చిన మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను—

2 ఇదిగో నేను మీతో చెప్పునదేమనగా, నా జనులు అపరాధములు చేయకుండిన యెడల, వారు ఇప్పటికే విమోచించబడి యుండేవారు, సంఘమును గూర్చే గాని విడివిడిగా మాట్లాడుటలేదు.

3 కానీ ఇదిగో, వారినుండి నేను కోరిన సంగతులకు వారు విధేయత కలిగియుండుటను నేర్చుకొనలేదు, కానీ వారు సమస్తమైన చెడుతో నిండియున్నారు, పరిశుద్ధులు చేయవలసినట్లుగా వారు తమ ఆస్థిని వారి మధ్యనున్న బీదలకు, శ్రమలలోనున్న వారికి ఇచ్చుటలేదు;

4 సిలెస్టియల్ రాజ్యపు ధర్మశాస్త్రమునకు కావలసిన ఐక్యతను బట్టి వారు ఏకము కాలేదు;

5 సిలెస్టియల్ రాజ్య ధర్మశాస్త్రపు సూత్రముల వలన తప్ప సీయోను నిర్మించబడలేదు; లేనియెడల ఆమెను నేను స్వీకరించలేను.

6 నా జనులు విధేయత నేర్చుకొనువరకు అవసరమైతే వారు బాధపడు విషయముల వలన గద్దింపబడవలెను.

7 నా జనులను నడిపించుటకు నియమించబడిన నా సంఘ మొదటి పెద్దలైన వారిని గూర్చి నేను మాట్లాడుటలేదు, ఏలయనగా వారందరు ఈ శిక్షావిధిలో లేరు;

8 కానీ విదేశాలలోనున్న నా సంఘముల గూర్చి నేను మాట్లాడుచున్నాను—వారి దేవుడు ఎక్కడ? ఇదిగో, కష్టసమయములో ఆయన వారిని విడిపించును, లేనియెడల మేము సీయోనుకు ఎక్కిపోయి మా ధనములను పెట్టలేమని చెప్పువారు అనేకులు అక్కడున్నారు.

9 కాబట్టి, నా జనుల అపరాధమునకు పర్యవసానముగా, సీయోను విమోచన కొరకు నా పెద్దలు కొద్దికాలము వేచియుండుట నా యందు యుక్తమైయున్నది—

10 తద్వారా వారంతట వారు సిద్ధపడవచ్చును, నా జనులు మరింత పరిపూర్ణముగా బోధింపబడి, అనుభవము పొందవచ్చును, వారి బాధ్యతను, వారి చేతుల నుండి నేను ఆపేక్షించు సంగతులను గూర్చి మరింత పరిపూర్ణముగా తెలుసుకొనవచ్చును.

11 నా పెద్దలు ఉన్నతము నుండి శక్తితో దీవించబడువరకు ఇది చేయబడలేదు.

12 ఏలయనగా ఇదిగో, వారు విశ్వాసముగానుండి, నా యెదుట వినయమునందు కొనసాగినంత వరకు ఒక గొప్ప వరము, ఆశీర్వాదము వారిపై క్రుమ్మరించబడుటకు నేను సిద్ధపరచియున్నాను.

13 కాబట్టి సీయోను విమోచన కొరకు నా పెద్దలు కొద్దికాలము వేచియుండుట నా యందు యుక్తమైయున్నది.

14 ఏలయనగా ఇదిగో, సీయోను యొక్క యుద్ధములు వారు పోరాడవలెనని నేను కోరుటలేదు; మునుపటి ఆజ్ఞలో నేను చెప్పితిని గనుక, ఆవిధముగానే నేను నెరవేర్చెదను—మీ యుద్ధములను నేను పోరాడెదను.

15 ఇదిగో, నా శత్రువులను నాశనము చేసి, బొత్తిగా పాడుచేయుటకు నాశనకారుని నేను పంపియున్నాను; నా వారసత్వమును పాడుచేయుటకు, నా పరిశుద్ధులు కూడివచ్చుటకు, నేను అర్పించిన భూములపైన నా నామమును దూషించుటకు వారు అనేక సంవత్సరములు విడిచిపెట్టబడరు.

16 నా మందిరపు బలగముతో అనగా నా యోధులు, నా యువకులు, మధ్య వయస్కులతో నా జనుల విమోచన కొరకు సమకూడి, నా శత్రువుల గోపురములను పడగొట్టి, వారి కావలివారిని చెదరగొట్టమని చెప్పుటకు నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. ను నేనాజ్ఞాపించియున్నాను;

17 కానీ నా మందిరపు బలగము నా మాటలను వినలేదు.

18 కానీ వారిలో నా మాటలను వినినవారు ఉండి, వారు విశ్వాసములో కొనసాగిన యెడల, వారి కొరకు నేనొక ఆశీర్వాదమును, దీవెనను సిద్ధపరచియున్నాను.

19 నేను వారి ప్రార్థనలను వినియున్నాను, వారి అర్పణలను అంగీకరించెదను; వారి విశ్వాసమునకు పరీక్షగా వారు ఇంత దూరము తేబడుట నా యందు యుక్తమైయున్నది.

20 ఇప్పుడు, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా ఇక్కడికి వచ్చినవారిలో ఎంతమందైతే ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉండగలరో, వారిని ఉండనియ్యుడి;

21 తూర్పున కుటుంబములను కలిగి ఇక్కడ ఉండలేకపోతున్నవారు, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ వారికి నియమించినంత వరకు కొద్దికాలము ఉండవలెను;

22 ఏలయనగా ఈ అంశమును గూర్చి నేనతనికి ఉపదేశించెదను, అతడు వారికి నియమించినదేదైనను, అవన్నియు నెరవేరును.

23 చుట్టూ ఉన్న ప్రాంతాలలో నివసించు నా జనులు చాలా విశ్వాసముగా, ప్రార్థనాపూర్వకముగా, నా యెదుట తగ్గించుకొనియుండవలెను, వారికి నేను బయలుపరచిన సంగతులను అవి బయలుపరచబడుట నా యందు జ్ఞానమగువరకు బయలుపరచకూడదు.

24 తీర్పులను గూర్చియైనను, విశ్వాసము లేదా మహత్కార్యములను గూర్చియైనను మాట్లాడవద్దు, కానీ అక్కడున్న జనుల చింతలను బట్టి వీలైనంత వరకు ఒక ప్రాంతములో జాగ్రత్తగా కూడుకొనవలెను;

25 ఇదిగో, మీరు జనులతో—ధర్మశాస్త్రమును బట్టి మాకు తీర్పును, న్యాయమును జరిగించుడి, మాకు జరిగిన అన్యాయములకు నష్టపరిహారము చెల్లించుడి అని చెప్పినప్పుడు మీకు సమాధానము మరియు రక్షణ కలుగునట్లు నేను వారి దృష్టిలో మీ యెడల కృపాకనికరములను కలుగజేసెదను.

26 ఇప్పుడు ఇదిగో, నా స్నేహితులారా, నేను చెప్పునదేమనగా, ఈ విధముగా ఇశ్రాయేలు సైన్యము బహు గొప్పది అగువరకు జనుల దృష్టిలో మీరు కనికరమును పొందుదురు.

27 నా మందిరపు బలగమును సమకూర్చుటకు నా సేవకుడైన జోసెఫ్ స్మిత్, నేను నియమించిన నా పెద్దలు సమయమును కలిగియుండు వరకు ఫరో మనసును చేసినట్లుగా కాలానుగుణముగా జనుల మనసులను నేను మృదువుగా చేసెదను,

28 జాక్సన్ కౌంటీనందు, దానికి ఆనుకొని చుట్టూ ఉన్న కౌంటీలందు కొనుగోలు చేయగలిగిన భూములు కొనుగోలు చేయుట గురించి నేనిచ్చిన ఆజ్ఞ నెరవేర్చుటకు జ్ఞానులను పంపవలెను.

29 ఏలయనగా ఈ భూములు కొనుగోలు చేయబడుట నా చిత్తమైయున్నది; అవి కొనుగోలు చేయబడిన తరువాత, నేను ఇచ్చియున్న సమర్పణ చట్టములను బట్టి నా పరిశుద్ధులు వాటిని స్వాధీనము చేసుకొనవలెను.

30 ఈ భూములు కొనుగోలు చేయబడిన తరువాత, తమ ధనముతో ముందుగా కొనుగోలు చేసిన తమ స్వస్థలములను స్వాధీనము చేసుకొనుట యందు నా శత్రువుల గోపురములు వారిమీద పడునట్లు పడద్రోసి, వారి కావలివారిని చెదరగొట్టి, నన్ను ద్వేషించు నా శత్రువులపై మూడు నాలుగు తరముల వరకు ప్రతీకారము తీర్చుకొనుటయందు ఇశ్రాయేలు సైన్యములను నేను నిర్దోషులుగా యెంచెదను.

31 కానీ మొదట నా సైన్యము బహు గొప్పది కావలెను, నా యెదుట శుద్ధి చేయబడవలెను, తద్వారా అది సూర్యుని వలే ప్రకాశవంతముగాను, చంద్రుని వలే స్పష్టముగాను మారి, ఆమె ధ్వజములు సమస్త జనములకు భయంకరముగా ఉండును;

32 తద్వారా సీయోను రాజ్యము నిజముగా మన దేవుని రాజ్యమని మరియు ఆయన యొక్క క్రీస్తుదని ఈ లోక రాజ్యములు ఒప్పుకొనుటకు బలవంతము చేయబడును; కాబట్టి, ఆమె చట్టములకు మనము లోబడియుందుము.

33 నా సంఘము యొక్క మొదటి పెద్దలు కర్ట్‌లాండ్ ప్రదేశములో నా నామమున నిర్మించమని నేనాజ్ఞాపించిన నా మందిరమందు ఉన్నతము నుండి వారి దీవెనను పొందుట నా యందు యుక్తమైయున్నదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

34 మరియు సీయోను గూర్చి నేను ఇచ్చియున్న ఆ ఆజ్ఞలు మరియు ఆమె ధర్మశాస్త్రము ఆమె విమోచన తరువాత అమలుపరచబడి, నెరవేర్చబడవలెను.

35 పిలువబడుటకు ఒక దినము కలదు, కానీ ఎన్నుకోబడు దినము కొరకు సమయము ఆసన్నమైనది; మరియు యోగ్యులైనవారు ఎన్నుకోబడవలెను.

36 ఎన్నుకోబడిన వారు నా సేవకునికి నా ఆత్మ యొక్క స్వరము వలన ప్రత్యక్షపరచబడుదురు; మరియు వారు శుద్ధి చేయబడుదురు;

37 వారు పొందు ఉపదేశమును వారు గైకొనిన యెడల, సీయోనుకు సంబంధించిన అన్ని కార్యములు సాధించుటకు అనేక దినముల తరువాత వారు శక్తిని కలిగియుందురు.

38 మరలా నేను చెప్పునదేమనగా, మిమ్ములను కొట్టిన జనులకే కాక సమస్త జనులకు శాంతి ఒప్పందమును ప్రతిపాదించుము;

39 శాంతి ధ్వజమునెత్తి, భూదిగంతముల వరకు శాంతి ప్రకటనను చేయుము:

40 మీలోనున్న ఆత్మ స్వరమును బట్టి మిమ్ములను కొట్టిన వారికి శాంతి ఒప్పందములను ప్రతిపాదించుము మరియు మీ మేలు కొరకు సమస్తము సమకూడి జరుగును.

41 కాబట్టి, విశ్వాసముగానుండుడి; ఇదిగో, అంతము వరకు నేను మీతోనున్నాను. అలాగే జరుగును గాక. ఆమేన్.