లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 29


29వ ప్రకరణము

1830 సెప్టెంబరు, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ఆరుగురు పెద్దల సమక్షములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. 1830 సెప్టెంబరు 26న ప్రారంభమగుచున్న సమావేశమునకు కొన్ని దినముల ముందు ఈ బయల్పాటు ఇవ్వబడెను.

1–8, క్రీస్తు తాను ఎన్నుకొనిన వారిని సమకూర్చును; 9–11, ఆయన రాకడ వెయ్యేండ్ల పరిపాలనను ప్రవేశపెట్టును; 12–13, ఇశ్రాయేలీయులందరిని పన్నెండుమంది తీర్పుతీర్చుదురు; 14–21, రెండవ రాకడకు ముందు సూచనలు, తెగుళ్ళు, నాశనములు కలుగును; 22–28, వెయ్యేండ్ల పరిపాలన తరువాత ఆఖరి పునరుత్థానము, అంతిమ తీర్పు జరుగును; 29–35, ప్రభువుకు అన్ని సంగతులు ఆత్మీయముగా నున్నవి; 36–39, సాతాను, అతని సైన్యములు మనుష్యులను శోధించుటకు పరలోకము నుండి త్రోసివేయబడిరి; 40–45, పతనము, ప్రాయశ్చిత్తము రక్షణను కలిగించును; 46–50, చిన్నపిల్లలు ప్రాయశ్చిత్తము వలన విమోచింపబడిరి.

1 మీ విమోచకుడు, ఘనమైన ఉన్నవాడు అను యేసు క్రీస్తు స్వరమును ఆలకించుము, ఆయన కృపగల బాహువు మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసెను;

2 కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే తన జనులను, అనగా ఆయన స్వరమును విని, ఆయన యెదుట తమనుతాము తగ్గించుకొని, బలమైన ప్రార్థనతో ఆయనకు మొరపెట్టువారందరిని ఆయన చేర్చుకొనును.

3 ఇదిగో, ఈ సమయములో మీ పాపములు క్షమించబడియున్నవి గనుక, మీరీ సంగతులను పొందుచున్నారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, కానీ ఇక మీదట పాపము చేయరాదని జ్ఞాపకముంచుకొనుడి, లేనియెడల మీకు ఆపదలు సంభవించును.

4 సంతోషధ్వనితో, బూర స్వరమువలే, నా సువార్తను ప్రకటించుటకు లోకము నుండి మీరు ఎన్నుకోబడిరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

5 మీ హృదయములను పైకెత్తుకొని ఆనందించుడి, ఏలయనగా నేను మీ మధ్యనున్నాను, తండ్రితో మీ న్యాయవాదిగానుందును; మీకు రాజ్యమిచ్చుట ఆయనకు ఇష్టమైయున్నది.

6 నా ఆజ్ఞానుసారముగా ప్రార్థనలో ఏకమై, విశ్వాసముతో మీరు ఏమి అడిగినను, దానిని మీరు పొందెదరని వ్రాయబడెను కదా.

7 నేను ఎన్నుకొనిన వారిని సమకూర్చుటకు మీరు పిలువబడిరి; ఏలయనగా నేను ఎన్నుకొనిన వారు నా స్వరమును వినెదరు, వారి హృదయములను కఠినపరచుకొనరు;

8 కాబట్టి దుష్టులపై శ్రమయు, నాశనమును పంపబడు దినము కొరకు సమస్త విషయములలో సిద్ధపడియుండుటకు, వారి హృదయములు సిద్ధపరచుకొనుటకు ఈ దేశములోనున్న ఒక ప్రదేశమందు వారు సమకూర్చబడవలెనని తండ్రి నుండి శాసనము బయలు వెళ్ళెను.

9 ఏలయనగా ఆ గడియ సమీపించినది, భూమి పాపముతో పండు దినము సమీపములోనున్నది; గర్విష్ఠులు, దుష్టత్వము జరిగించు వారందరు కొయ్యకాలువలెనుందురు; భూమిమీద పాపము లేకుండునట్లు నేను వారిని కాల్చివేయుదునని సైన్యములకు అధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు;

10 ఆ గడియ సమీపించినది, నా అపొస్తలులచేత చెప్పబడినది తప్పక నెరవేరవలెను; ఏలయనగా వారు చెప్పిన విధముగానే జరుగును;

11 శక్తితోను, గొప్ప మహిమతోను, అక్కడున్న సైన్యములన్నింటితో పరలోకము నుండి నన్ను నేను కనబరచుకొని, భూమిమీద మనుష్యులతో వెయ్యేండ్లు నీతితో నివసించెదను మరియు దుష్టులు నిలువజాలరు.

12 ఇశ్రాయేలు వంశస్థులందరికి, అనగా నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలను పాటించువారందరికి తప్ప మరెవరికి తీర్పు తీర్చకుండుటకు యెరూషలేమునందు నా పరిచర్యలో నాతో ఉన్న పన్నెండుమంది అపొస్తలులు నీతి వస్త్రములను ధరించి, శిరస్సులపై కిరీటములను, నా వంటి మహిమను కలిగియుండి, అగ్ని స్థంభములో నా రాకడ దినమున నా కుడివైపున నిలిచియుందురని, తండ్రి చిత్తానుసారముగా అది ఖండితమైన శాసనముగా బయలువెళ్ళెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

13 ఏలయనగా సీనాయి పర్వతముపై వలే దీర్ఘకాలము బిగ్గరగా ఒక బూర ధ్వనించగా భూమి అంతయు వణకును మరియు వారు, అనగా నా యందు మృతినొందిన మృతులు నీతి కిరీటమును పొందుటకు, నా వంటి వస్త్రములు ధరించి మేము ఏకమైయుండులాగున నాతో నివసించుటకు ముందుకు వచ్చెదరు.

14 కానీ ఇదిగో, ఈ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారును, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, పైన ఆకాశమందును, క్రింద భూమి మీదను గొప్ప సూచక క్రియలు కలుగునని నేను మీతో చెప్పుచున్నాను;

15 జన సమూహముల మధ్య ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండును;

16 భూమిపై నున్న పంటలను నాశనము చేయుటకు గొప్ప వడగండ్లవాన పంపబడును.

17 లోకము యొక్క చెడుతనము వలన దుష్టులపై నేను ప్రతీకారము తీర్చుకొందును, ఏలయనగా వారు పశ్చాత్తాపపడరు; నా ఉగ్రతాపాత్ర నిండియున్నది; ఇదిగో వారు నా మాట వినని యెడల, నా రక్తము వారిని శుద్ధి చేయదు.

18 కాబట్టి, దేవుడును ప్రభువునైన నేను భూమి మీదకు ఈగలను పంపెదను, దాని నివాసులను అవి వశపరచుకొని, వారి మాంసమును తినును మరియు వారిపై పురుగులు వచ్చునట్లు అవి చేయును;

19 నాకు బదులు చెప్పకుండా వారి నాలుకలు కట్టివేయబడును; వారి ఎముకలపైనుండి మాంసము, గూడులలో నుండి వారి కన్నులు రాలును;

20 అడవిలోనుండు క్రూరమృగములును, ఆకాశ పక్షులును వారిని చీల్చివేయుట జరుగును.

21 ప్రవక్తయైన యెహెజ్కేలు నోటిద్వారా చెప్పబడిన ప్రకారము భూమియంతటికి వేశ్యయైన గొప్ప, హేయకరమైన ఆ సంఘము నాశనకరమైన అగ్నిచేత పడద్రోయబడును, అతడు ఈ సంగతులను గూర్చి మాట్లాడెను, అవి ఇంకను సంభవించలేదు కానీ, నా జీవము తోడు తప్పక సంభవించవలెను, ఏలయనగా దుష్కార్యములు ప్రబలజాలవు.

22 వెయ్యేండ్లు ముగిసిన తరువాత, మనుష్యులు దేవుని మరలా విసర్జించుట మొదలుపెట్టునప్పుడు, కొంతకాలము మట్టుకు భూమిని నేను కాయుదునని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను;

23 అప్పుడు అంతము వచ్చును, ఆకాశమును భూమియు నాశనము చేయబడి గతించును, అంతట క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఉండును.

24 ఏలయనగా పాతవి గతించును, సమస్తము అనగా ఆకాశమును, భూమియు, దానిలోని సమస్తము, మనుష్యులు, జంతువులు, ఆకాశ పక్షులు, సముద్రపు చేపలు అన్నియు క్రొత్తవగును;

25 తల వెంట్రుకలలో ఒక్కటైనను, నలుసైనను నశించదు, ఏలయనగా అది నా హస్తకృత్యము.

26 కానీ ఇదిగో, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, భూమి గతించక మునుపు నా ప్రధాన దూత మిఖాయేలు తన బూరను ఊదును, అప్పుడు మృతులందరు లేచెదరు, ఏలయనగా వారి సమాధులు తెరువబడును, వారు—అనగా అందరు పైకి వచ్చెదరు.

27 నీతిమంతులు నిత్యజీవము కొరకు నా కుడివైపున సమకూర్చబడుదురు; దుష్టులను నా ఎడమవైపున కలిగియుండుటకు తండ్రి యెదుట నేను సిగ్గుపడెదను;

28 కాబట్టి వారితో నేను ఈవిధముగా చెప్పుదును—శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.

29 ఇదిగో నేను మీతో చెప్పునదేమనగా, వారు తిరిగి వచ్చెదరని నా నోటితో నేనెన్నడూ చెప్పియుండలేదు, ఏలయనగా వారికి శక్తిలేదు గనుక నేనెక్కడయుందునో వారక్కడికి రాలేరు.

30 కానీ నా తీర్పులన్నియు మనుష్యులకు ఇవ్వబడలేదని జ్ఞాపకముంచుకొనుడి; నా వాక్యము యొక్క శక్తి, అనగా నా ఆత్మ యొక్క శక్తి చేత నేను సృష్టించిన వాటన్నింటిలో మొదటివి కడపటివగును, కడపటివి మొదటివగును అను ఈ మాటలు నా నోటినుండి వెళ్ళెను గనుక అవి నెరవేరును.

31 ఏలయనగా నా ఆత్మ శక్తిచేత వాటిని నేను సృష్టించితిని; అనగా శరీరసంబంధమైన మరియు ఆత్మ సంబంధమైన అన్నిటిని—

32 మొదట ఆత్మసంబంధముగాను, తరువాత శరీరసంబంధముగాను సృష్టించితిని, అది నా పనికి ఆరంభము; మరలా మొదట శరీరసంబంధముగాను, తరువాత ఆత్మసంబంధముగాను సృష్టించితిని, అది నా పనికి ముగింపు—

33 మీరు సహజముగా గ్రహించునట్లు నేను మీతో మాట్లాడుచున్నాను; కానీ నా కార్యములకు ఆదియు అంతమును లేదు; అయితే మీరు గ్రహించునట్లు ఇది మీకు ఇవ్వబడెను, ఎందుకనగా మీరు దీనిని నా నుండి కోరి, అంగీకరించిరి.

34 కాబట్టి, సమస్తము నాకు ఆత్మీయముగా నున్నవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, లోకసంబంధమైన చట్టమును నేనెన్నడూ మీకు గాని, ఏ నరునికి, నరుల సంతానమునకు లేదా నేను సృష్టించిన మీ తండ్రియైన ఆదాముకు గాని ఇచ్చియుండలేదు.

35 ఇదిగో, తనకుతానే ప్రతినిధిగా నుండుటకు అతడిని నేను అనుమతించితిని; అతనికి నేను ఆజ్ఞనిచ్చితిని, కానీ లోకసంబంధమైన ఆజ్ఞ యేదియు నేను ఇచ్చియుండలేదు, ఏలయనగా నా ఆజ్ఞలు ఆత్మసంబంధమైనవి; అవి ప్రకృతిసంబంధమైనని లేదా లోకసంబంధమైనవి కావు, సుఖాసక్తి గలవి లేదా శరీరసంబంధమైనవి కావు.

36 జరిగినదేమనగా ఆదాము అపవాదిచేత శోధింపబడెను—ఏలయనగా ఆదాము కంటే ముందు అపవాది ఉండెను, అతడు నీ ఘనతను నాకిమ్ము, అది నా శక్తి అని పలుకుచూ నాతో పోరాడెను; అంతేకాక పరలోక సమూహములలో మూడవ వంతును వారికున్న స్వతంత్రత వలన అతడు నా నుండి త్రిప్పివేసెను;

37 మరియు వారు త్రోసివేయబడిరి, అందువలన అపవాది, వాని దూతలు ఉనికిలోనికి వచ్చిరి;

38 ఇదిగో, సృష్టి ఆరంభము నుండి వారికొక ప్రదేశము సిద్ధపరచబడియుండెను, ఆ ప్రదేశమే నరకము.

39 అపవాది నరుల సంతానమును శోధించుట ఆవశ్యకమైయున్నది, లేనియెడల వారికి వారే ప్రతినిధులు కాలేరు; ఏలయనగా వారు చేదును అనుభవించని యెడల, వారు తియ్యదనమును తెలుసుకొనలేరు—

40 కాబట్టి, అపవాది ఆదామును శోధించగా అతడు నిషేధించబడిన ఫలమును తిని, ఆజ్ఞను అతిక్రమించినందున అతడు అపవాది చిత్తమునకు లోబడెను, ఎందుకనగా అతడు శోధనకు లోబడెను.

41 కాబట్టి, దేవుడును ప్రభువునైన నేను అతని అతిక్రమము వలన అతడు ఏదేను తోటనుండి, నా సన్నిధి నుండి తరిమివేయబడునట్లు చేసితిని, అందువలన అతడు ఆత్మీయముగా మరణించియుండెను, అది మొదటి మరణము, అది చివరి మరణము వలే ఆత్మీయమైనది—శపింపబడిన వారలారా, నా యొద్దనుండి తొలగిపొమ్మని నేను చెప్పినప్పుడు అది దుష్టులపైకి వచ్చును.

42 కానీ ఇదిగో నేను చెప్పునదేమనగా, దేవుడును ప్రభువునైన నేను, నా అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసము ద్వారా వారికి పశ్చాత్తాపమును, విమోచనను ప్రకటించుటకు దేవదూతలను పంపు వరకు దేవుడును ప్రభువునైన నేను ఆదామునకును, అతని సంతానమునకును శారీరక మరణమును బట్టి మరణించకుండునట్లు అనుగ్రహించితిని.

43 కాబట్టి దేవుడును ప్రభువునైన నేను, నరునికి అతని పరీక్షా దినములను నియమించితిని—తద్వారా అతని సహజ మరణము చేత అతడు, అనగా ఎంతమంది విశ్వసించుదురో వారందరు నిత్యజీవము కొరకు అమర్త్యత్వముతో లేపబడవచ్చును;

44 విశ్వసించని వారు నిత్య శిక్షకు లేపబడుదురు; వారు పశ్చాత్తాపము చెందియుండలేదు గనుక, వారి ఆత్మీయ మరణము నుండి వారు విమోచింపబడలేరు;

45 వారు వెలుగునకు బదులు చీకటిని ప్రేమింతురు, వారి క్రియలు చెడ్డవి, వారు దేనికి విధేయత చూపుదురో, దానిని బట్టి వారు తమ జీతమును పొందెదరు.

46 కానీ ఇదిగో, నా అద్వితీయ కుమారుని ద్వారా లోకము పునాది వేయబడినప్పటి నుండి చిన్న పిల్లలు విమోచింపబడిరని నేను మీకు సెలవిచ్చుచున్నాను;

47 కాబట్టి, వారు పాపము చేయలేరు, ఏలయనగా వారు నా యెదుట జవాబుదారులుగా అయ్యేంతవరకు చిన్నపిల్లలను శోధించుటకు సాతానుకు శక్తి ఇవ్వబడలేదు;

48 ఏలయనగా నా చిత్తప్రకారము, నా ఇష్టము చొప్పున వారికది ఇవ్వబడెను, తద్వారా వారి పితరుల చేతి నుండి గొప్పకార్యములు ఆపేక్షించబడవచ్చును.

49 మరలా నేను మీతో చెప్పుచున్నాను, పశ్చాత్తాపపడమని జ్ఞానము గలవానిని నేను ఆజ్ఞాపించియుండలేదా?

50 గ్రహింపు లేనివానికి, వ్రాయబడియున్న ప్రకారము చేయుట నా వశమైయున్నది. ఈ సమయమందు ఇంతకుమించి నేను మీకు ప్రకటించను. ఆమేన్.