లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 48


48వ ప్రకరణము

1831 మార్చి 10న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. పరిశుద్ధుల కొరకు నివాసస్థలములు సేకరించుటకు కార్యాచరణ విధానమును గూర్చి ప్రవక్త ప్రభువును విచారించెను. వారు ఒహైయోలో సమావేశము కావాలెనను ప్రభువు ఆజ్ఞను గైకొనుటకు తూర్పు సంయుక్త రాష్ట్రాల నుండి సంఘ సభ్యులు వలస వచ్చిన దృష్ట్యా ఇది ముఖ్యమైన అంశముగా నుండెను (ప్రకరణములు 37:1–3; 45:64 చూడుము).

1–3, ఒహైయోలో ఉన్న పరిశుద్ధులు వారి భూములను తమ సహోదరులతో పంచుకొనవలెను; 4–6, పరిశుద్ధులు భూములను కొనుగోలు చేసి, ఒక పట్టణమును నిర్మించి, వారిపై అధ్యక్షత్వము వహించు అధికారుల ఉపదేశములను పాటించవలెను.

1 మీ పరిస్థితులకు అనుకూలముగా నుండును గనుక, ప్రస్తుత కాలములో మీరు మీ నివాస స్థలములలోనే యుండుట అవసరము.

2 మీకు భూములు ఉన్నయెడల, తూర్పునుండి వచ్చిన సహోదరులతో మీరు పంచుకొనవలెను;

3 మీకు భూములు లేనియెడల, ప్రస్తుత కాలములో చుట్టుప్రక్కల నున్న ప్రాంతములలో వారికి మంచిగా కనిపించువాటిని వారిని కొననియ్యుము, ఏలయనగా ప్రస్తుత కాలములో వారు నివసించుటకు స్థలములు ఉండుట అత్యవసరము.

4 భవిష్యత్తులో స్వాస్థ్యముగానుండుటకు మీరు భూమిని, అదేవిధముగా పట్టణమును కొనగలుగునట్లు మీరు దాచగలిగినంత సొమ్మును దాచుట, నీతిగా మీరు సంపాదించగలిగినంత సంపాదించుట అత్యవసరము.

5 ఆ స్థలము అప్పుడే తెలియపరచబడదు; కానీ తూర్పునుండి మీ సహోదరులు వచ్చినప్పుడు, కొంతమంది పురుషులు నియమింపబడవలెను మరియు ఆ స్థలమును తెలుసుకొనుటకు వారు అనుమతించబడెదరు లేదా వారికది తెలియపరచబడును.

6 భూములను కొనుటకు, పట్టణ పునాదులు వేయుట మొదలుపెట్టుటకు వారు నియమించబడవలెను, అప్పుడు మీరు మీ కుటుంబములతో, ప్రతి మనుష్యుడు తన కుటుంబమును బట్టి, తన పరిస్థితులను బట్టి, సంఘ అధ్యక్షత్వము మరియు బిషప్పు చేత అతనికి నియమించబడిన ప్రకారము, మీరు పొందియున్న మరియు ఇకముందు మీరు పొందబోవు నియమములు, ఆజ్ఞల ప్రకారము కూడివచ్చుటకు మొదలుపెట్టవలెను. అలాగే జరుగును గాక. ఆమేన్.