లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 3


3వ ప్రకరణము

మోర్మన్ గ్రంథము మొదటి భాగము నుండి అనువదించబడి, “లీహై గ్రంథము”గా పిలువబడిన 116 పేజీల చేతివ్రాతలు కోల్పోవుటకు సంబంధించి 1828 జూలై, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కివ్వబడిన బయల్పాటు. ప్రవక్త అయిష్టముగా ఈ పేజీలను తన ఆధీనములోనుండి మార్టిన్ హారిస్ యొద్దకు వెళ్ళుటకు అనుమతించెను, అతడు కొద్దికాలముపాటు మోర్మన్ గ్రంథ అనువాదములో లేఖకునిగా పనిచేసెను. ఈ బయల్పాటు ఊరీము తుమ్మీముల ద్వారా ఇవ్వబడినది. (10వ ప్రకరణము చూడుము.)

1–4, ప్రభువు మార్గము ఒక నిత్య వలయమైయున్నది; 5–15, జోసెఫ్ స్మిత్ తప్పక పశ్చాత్తాపపడవలెను, లేనియెడల అనువదించు వరమును కోల్పోవును; 16–20, లీహై సంతానమును కాపాడుటకు మోర్మన్ గ్రంథము వచ్చును.

1 దేవుని ఉద్దేశ్యములు, ప్రణాళికలు, కార్యములు భంగపరచబడలేవు, అవి నిష్ఫలము కాలేవు.

2 ఏలయనగా దేవుడు వంకర త్రోవలలో నడువడు, ఆయన కుడిప్రక్కకైనను, ఎడమప్రక్కకైనను మరలడు, ఆయన చెప్పిన దాని నుండి ఆయన మారడు గనుక ఆయన త్రోవలు సరాళమైనవి మరియు ఆయన మార్గము ఒక నిత్య వలయమైయున్నది.

3 జ్ఞాపకముంచుకొనుము, భంగపరచబడేది దేవుని కార్యము కాదు, కానీ మనుష్యుల కార్యమని జ్ఞాపకముంచుకొనుము;

4 ఏలయనగా ఒక మనుష్యుడు అనేక బయల్పాటులు పొంది, మహా గొప్ప కార్యములు చేయుటకు శక్తి కలిగియుండి కూడా, అతడు తన స్వశక్తియందు అతిశయించి, దేవుని ఉపదేశములను తృణీకరించి, తన చిత్తానుసారముగా శరీరేచ్ఛలను బట్టి నడుచుకొనిన యెడల అతడు తప్పక పతనమై, న్యాయవంతుడైన దేవుని ప్రతీకారమును తన మీదకు తెచ్చుకొనును.

5 ఇదిగో, ఈ సంగతులతో నీవు అప్పగించబడియున్నావు, కానీ నీకివ్వబడిన ఆజ్ఞలు ఎంతో కఠినమైనవి; వాటిని నీవు అతిక్రమించని యెడల, నీకు చేయబడిన వాగ్దానములను కూడా జ్ఞాపకము చేసుకొనుము.

6 ఇదిగో, ఎన్నిమారులు నీవు దేవుని ఆజ్ఞలను, శాసనాలను అతిక్రమించి మనుష్యుల ఒప్పింపులకు లోబడితివి.

7 ఏలయనగా నీవు దేవుని కంటే మనుష్యునికి ఎక్కువ భయపడియుండవలసినది కాదు. మనుష్యులు దేవుని ఉపదేశములను తృణీకరించి, ఆయన మాటలను నిర్లక్ష్యము చేసినను—

8 నీవు నమ్మకముగా యుండవలసినది; మరియు ఆయన తన బాహువును చాచి, అపవాది అగ్నిబాణములన్నిటికి విరుద్ధముగా తన సహకారమునందించి, ప్రతి ఇబ్బందిలో ఆయన నీతో ఉండేవాడు.

9 ఇదిగో, జోసెఫ్ అను నీవు, ప్రభువు యొక్క కార్యము చేయుటకు ఎన్నుకోబడితివి, కానీ నీవు జాగ్రత్తగా ఉండని యెడల, అతిక్రమము వలన పడిపోవుదువు.

10 అయినను దేవుడు కనికరము గలవాడని జ్ఞాపకముంచుకొనుము; కాబట్టి, నేనిచ్చిన ఆజ్ఞకు విరుద్ధముగా నీవు చేసిన దానికి పశ్చాత్తాపపడుము, నీవింకను ఎన్నుకోబడియుండి, ఈ కార్యమునకు తిరిగి పిలువబడితివి;

11 నీవు దీనిని చేయని యెడల, నీవు అప్పగించబడుదువు, ఇక ఏ బహుమానము కలిగియుండక ఇతర మనుష్యుల వలే అగుదువు.

12 దేవుడు నీకిచ్చిన చూపు మరియు శక్తి చేత అనువదించిన దానిని నీవు అప్పగించినప్పుడు, ఒక పవిత్రమైన దానిని నీవు దుష్టుని చేతికి అప్పగించితివి,

13 అతడు దేవుని ఉపదేశములను తృణీకరించి, దేవుని యెదుట చేసిన అత్యంత పరిశుద్ధమైన వాగ్దానములను మీరి, తన స్వాభిప్రాయముపై ఆధారపడి, తన స్వపరిజ్ఞానమునందు అతిశయించెను.

14 కొంత కాలముపాటు నీ విశేషాధికారములను కోల్పోవుటకు కారణమిదియే—

15 నీవు మొదటి నుండి నీ మార్గదర్శకుని ఉపదేశము త్రొక్కివేయబడుటకు అనుమతించితివి.

16 అయినప్పటికీ, నా కార్యము ముందుకు సాగును, ఏలయనగా యూదుల సాక్ష్యము ద్వారా ఒక రక్షకుని గూర్చి లోకము తెలుసుకొనినట్లుగానే, నా ప్రజలు కూడా ఒక రక్షకుని గూర్చి తెలుసుకొనెదరు—

17 నీఫైయులు, జేకబీయులు, జోసెఫీయులు, జోరమీయులు వారి పితరుల సాక్ష్యము ద్వారా తెలుసుకొనెదరు—

18 మరియు తమ పితరుల దోషము వలన విశ్వాసమందు క్షీణించి, తమ సహోదరులైన నీఫైయులను వారి దోషములు, హేయక్రియలను బట్టి నాశనము చేయుటకు ప్రభువు అనుమతించిన లేమనీయులు, లెమూయేలీయులు, ఇష్మాయేలీయులు ఈ సాక్ష్యమును తెలుసుకొనెదరు.

19 ప్రభువు తన జనులకు చేసిన వాగ్దానములు నెరవేరులాగున—ఈ వృత్తాంతములను కలిగిన ఈ పలకలు ఇందు నిమిత్తమే భద్రపరచబడినవి;

20 తద్వారా లేమనీయులు వారి పితరులను గూర్చి మరియు ప్రభువు యొక్క వాగ్దానాలను గూర్చి తెలుసుకొనగలిగి, వారి పశ్చాత్తాపమును బట్టి వారు రక్షించబడులాగున సువార్తను విశ్వసించి, యేసు క్రీస్తు యొక్క మంచితనముపై ఆధారపడి, ఆయన నామమందు విశ్వాసముంచుట ద్వారా మహిమ పొందెదరు. ఆమేన్.