లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 11


11వ ప్రకరణము

1829 మే, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా అతని సహోదరుడైన హైరమ్ స్మిత్‌కివ్వబడిన బయల్పాటు. జోసెఫ్ యొక్క విన్నపము, విచారణకు సమాధానముగా ఊరీము తుమ్మీము ద్వారా ఈ బయల్పాటు పొందబడినది. అహరోను యాజకత్వ పునఃస్థాపన తరువాత ఈ బయల్పాటు పొందబడినదని జోసెఫ్ స్మిత్ చరిత్ర సూచించును.

1–6, ద్రాక్షతోటలో పనిచేయువారు రక్షణ పొందెదరు; 7–14, జ్ఞానమును వెదకుము, పశ్చాత్తాపమును ప్రకటించుము, ఆత్మయందు నమ్మికయుంచుము; 15–22, ఆజ్ఞలను పాటించి, ప్రభువు వాక్యమును అధ్యయనము చేయుము; 23–27, బయల్పాటు ఆత్మ, ప్రవచనాత్మలను తృణీకరించకుము; 28–30, క్రీస్తును స్వీకరించువారు దేవుని కుమారులగుదురు.

1 ఒక గొప్ప ఆశ్చర్యకార్యము నరుల సంతానము మధ్యకు రాబోవుచున్నది.

2 ఇదిగో, నేను దేవుడను; నా మాటకు చెవియొగ్గుము, అది జీవము గలది, శక్తివంతమైనది, కీళ్ళను, మూలుగును విడదీయు రెండంచులు గల ఖడ్గము కన్నా పదునైనది; కాబట్టి, నా మాటకు చెవియొగ్గుము.

3 ఇదిగో, పొలము ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నది; కాబట్టి, ఎవడైతే కోయుటకు ఇష్టపడునో, అతడు తన బలముతో తన కొడవలిని వాడి, దేవుని రాజ్యములో తన ప్రాణమునకు నిత్య రక్షణను దాచిపెట్టుకొనునట్లు దినము గడవక ముందే కోత కోయనిమ్ము.

4 అవును, ఎవడైతే తన కొడవలితో కోతకోయునో, అట్టివాడు దేవుని చేత పిలువబడెను.

5 కాబట్టి, నీవు నన్ను అడిగిన యెడల నీవు పొందెదవు; నీవు తట్టిన యెడల అది నీకు తెరువబడును.

6 ఇప్పుడు, నీవు అడిగితివి గనుక, ఇదిగో నేను నీకు సెలవిచ్చుచున్నాను, నా ఆజ్ఞలను పాటించుము, సీయోను హేతువును ముందుకు తెచ్చి, స్థాపించుటకు ప్రయత్నించుము.

7 జ్ఞానము కొరకే గాని ఐశ్వర్యము కొరకు వెదకవద్దు; ఇదిగో దేవుని మర్మములు నీకు తెలుపబడును, అప్పుడు నీవు ఐశ్వర్యవంతునిగా చేయబడుదువు. ఇదిగో, నిత్యజీవము గలవాడే ఐశ్వర్యవంతుడు.

8 నీవు నన్ను కోరినట్లే నీకు జరుగునని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; నీవు కోరిన యెడల, ఈ తరములో అనేకమైన మంచి పనులు చేయుటలో నీవు సాధనమగుదువు.

9 ఈ తరమునకు పశ్చాత్తాపము తప్ప మరి దేనిని గూర్చియు బోధించకుము; నా ఆజ్ఞలను పాటించుము, నా ఆజ్ఞల ప్రకారము నా పనిని ముందుకు తీసుకొనివచ్చుటలో సహాయపడుము మరియు నీవు దీవించబడెదవు.

10 ఇదిగో, నీవొక బహుమానమును కలిగియున్నావు లేదా నీవు విశ్వాసముతో, నిజాయితీ గల హృదయముతో, యేసు క్రీస్తు శక్తియందు లేదా నీతో మాట్లాడు నా శక్తియందు నమ్మికయుంచి, నీవు నా నుండి కోరిన యెడల నీవొక బహుమానమును కలిగియుందువు;

11 ఏలయనగా ఇదిగో, మాట్లాడుచున్నది నేనే; చీకటిలో ప్రకాశించు వెలుగును నేనే, నా శక్తి చేత ఈ మాటలను నేను నీకిచ్చెదను.

12 ఇప్పుడు, నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మంచిని చేయుటకు—అవును, న్యాయము చేయుటకు, వినయముగా నడుచుకొనుటకు, నీతిగా తీర్పు తీర్చుటకు నడిపించు ఆత్మయందు నమ్మకముంచుము; ఇదియే నా ఆత్మ.

13 నా ఆత్మను నీకిచ్చెదను, అది నీ మనస్సును వెలిగించి, నీ ఆత్మను సంతోషముతో నింపునని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను;

14 నీవు పొందెదవను విశ్వాసముతో నా యందు నమ్మికయుంచిన యెడల, నీతిగల సంగతులకు సంబంధించి నా నుండి నీవు కోరు సంగతులన్నియు అప్పుడు నీవు తెలుసుకొందువు లేదా దీనివలన నీవు తెలుసుకొందువు.

15 ఇదిగో, నీవు ప్రకటించుటకు పిలువబడే వరకు నీవు పిలువబడితివని నీవనుకొనకూడదని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను.

16 నా వాక్యము, నా బండ, నా సంఘము, నా సువార్తను నీవు కలిగియుండే వరకు మరి కొద్దికాలము వేచియుండుము, తద్వారా నా సిద్ధాంతమును నీవు నిశ్చయముగా తెలుసుకొనవచ్చును.

17 అప్పుడు, ఇదిగో నీ కోరికలను బట్టి, అవును నీ విశ్వాసమును బట్టి నీకది జరుగును.

18 నా ఆజ్ఞలను పాటించుము; మౌనముగానుండుము; నా ఆత్మ సహాయమును కోరుము;

19 నీ పూర్ణహృదయముతో నన్ను హత్తుకొనుము, తద్వారా మాట్లాడబడుచున్న ఆ సంగతులను—అనగా నా కార్యము యొక్క అనువాదమును వెలుగులోనికి తెచ్చుటకు నీవు సహాయపడగలవు; దానిని నీవు పూర్తి చేసేవరకు సహనముగానుండుము.

20 ఇదిగో, నీ పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో నా ఆజ్ఞలను పాటించుటయే నీ పనియైయున్నది.

21 నా వాక్యమును ప్రకటించుటకు ప్రయత్నించవద్దు, కానీ మొదట నా వాక్యమును పొందుటకు ప్రయత్నించుము, అప్పుడు నీ నాలుక సడలించబడును; అప్పుడు నీవు కోరిన యెడల, మనుష్యులను ఒప్పించుటకు దేవుని శక్తియగు నా ఆత్మను, నా వాక్యమును నీవు కలిగియుందువు.

22 కానీ ఇప్పుడు మౌనముగానుండుము; నరుల సంతానము మధ్యకు వెళ్ళిన నా వాక్యమును అధ్యయనము చేయుము, నరుల సంతానము మధ్యకు వచ్చు నా వాక్యమును లేదా ఇప్పుడు అనువదించబడుచున్న దానిని, ఈ తరములో నరుల సంతానమునకు నేను అనుగ్రహించునదంతయు నీవు పొందువరకు అధ్యయనము చేయుము, అప్పుడు సమస్తమును దానికి చేర్చబడును.

23 ఇదిగో, హైరమ్ అను నీవు, నా కుమారుడవు; దేవుని రాజ్యమును వెదకుము, ఏది న్యాయమో దానిని బట్టి సమస్తము అనుగ్రహించబడును.

24 నా సువార్తయైన నా బండమీద కట్టుకొనుము;

25 బయల్పాటు ఆత్మను గాని, ప్రవచనాత్మను గాని తిరస్కరించకుము, ఏలయనగా ఈ సంగతులను తిరస్కరించిన వానికి ఆపద;

26 కాబట్టి, నీవు ముందుకు సాగుటకు సరియైన సమయమని నేను తలంచు వరకు నీ హృదయమందు భద్రపరచుకొనుము.

27 ఇదిగో, మంచి కోరికలు కలిగి, తమ కొడవలితో కోతకోయు వారందరితో నేను మాట్లాడుచున్నాను.

28 దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నేనే. నేను లోకమునకు జీవమును, వెలుగునై యున్నాను.

29 నా స్వజనుల యొద్దకు వచ్చినది నేనే మరియు నా స్వజనులు నన్ను చేర్చుకొనలేదు.

30 కానీ నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నన్ను అంగీకరించు వారందరికి, నా నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు నేను శక్తినిచ్చెదను. ఆమేన్.