లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 113


113వ ప్రకరణము

యెషయా వ్రాతలపై కొన్ని ప్రశ్నలకు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేత 1838 మార్చిలో, ఫార్ వెస్ట్, మిస్సోరి వద్ద లేదా సమీపములో ఇవ్వబడిన సమాధానాలు.

1–6, యెష్షయి మొద్దు, దాని నుండి పుట్టు దండము, యెష్షయి వేరు గుర్తించబడినవి; 7–10, చెదిరిపోయిన సీయోను శేషములు యాజకత్వమును పొందుటకు హక్కును కలిగియుండి, ప్రభువు యొద్దకు తిరిగివెళ్ళుటకు పిలువబడిరి.

1 యెషయా 11వ అధ్యాయమందు 1, 2, 3, 4, 5వ వచనములలో చెప్పబడిన యెష్షయి మొద్దు ఎవరు?

2 ప్రభువు నిశ్చయముగా చెప్పుచున్నాడు: ఆయనే క్రీస్తు.

3 యెషయా 11వ అధ్యాయము మొదటి వచనములో చెప్పబడిన యెష్షయి మొద్దు నుండి రావలసిన దండము ఏమిటి?

4 ఇదిగో, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: క్రీస్తు హస్తములలో అతడు ఒక సేవకుడు, అతడు కొంచెము యెష్షయి, మరికొంచెము ఎఫ్రాయిము లేదా యోసేపు గృహపు వారసుడు, అతనిపై అధిక శక్తి ఉంచబడియున్నది.

5 11వ అధ్యాయము 10వ వచనములో చెప్పబడిన యెష్షయి వేరు ఏమిటి?

6 ఇదిగో, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు యెష్షయి వారసుడును, యోసేపు వారసుడునై యున్నాడు, ఒక ధ్వజముగా, అంత్యదినములలో నా జనులు పోగుచేయబడుటకు యాజకత్వమును, పరలోకరాజ్యపు తాళపుచెవులను అతడు హక్కుగా కలిగియున్నాడు.

7 ఎలియాస్ హిగ్బీ ప్రశ్నలు: యెషయా 52వ అధ్యాయము, 1వ వచనములో సీయోనూ, నీ బలము ధరించుకొనుము—అని చెప్పబడిన ఆజ్ఞకు అర్థమేమి మరియు ఏ జనులను గూర్చి యెషయా ప్రస్తావించెను?

8 అంత్యదినములలో దేవుడు ఎవరిని పిలువవలెనో వారిని గూర్చి అతడు ప్రస్తావించెను, వారు సీయోనును మరలా తెచ్చుటకు, ఇశ్రాయేలును విమోచించుటకు యాజకత్వపు అధికారమును కలిగియుండవలెను; ఆమె బలమును ధరించుకొనుట అనగా యాజకత్వపు అధికారమును ధరించుకొనుట, దానికి ఆమె, సీయోను వంశక్రమము వలన హక్కును కలిగియుండెను; ఆమె కోల్పోయిన అధికారమును తిరిగి పొందును.

9 2వ వచనము; సీయోను ఆమె మెడకట్లను విప్పుకొనుటను గూర్చి మనమేమి అర్థము చేసుకొనవలెను?

10 చెదిరిన శేషములు వారు పడిపోయిన స్థలము నుండి ప్రభువు యొద్దకు తిరిగివెళ్ళవలెనని ఉపదేశింపబడిరి; దానిని వారు చేసినయెడల, ప్రభువు వారితో మాట్లాడును లేదా వారికి బయల్పాటులు ఇచ్చునని వాగ్దానము చేసెనని మనము గ్రహించవలెను. 6, 7, 8వ వచనములు చూడుము. ఆమె మెడకట్లు ఆమె యెడల దేవుని శాపములు లేదా చెదిరిపోయిన స్థితిలో అన్యజనుల మధ్యనున్న ఇశ్రాయేలు శేషములు.