లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 73


73వ ప్రకరణము

1832 జనవరి 10న, ఒహైయోలోని హైరంలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, సిడ్నీ రిగ్డన్‌లకివ్వబడిన బయల్పాటు. గత డిసెంబరు ఆరంభము నుండి ప్రవక్త మరియు సిడ్నీ రిగ్డన్‌లు సువార్తను బోధించుటలో నిమగ్నమయ్యిరి, దీని ద్వారా సంఘమునకు విరోధముగా లేచిన సంక్లిష్ట భావనలను తగ్గించుటలో అధికభాగము సాధించబడినది (71వ ప్రకరణ శీర్షిక చూడుము).

1–2, పెద్దలు బోధించుటను కొనసాగించవలెను; 3–6, జోసెఫ్ స్మిత్, సిడ్నీ రిగ్డన్‌లు బైబిల్ గ్రంథ అనువాదము పూర్తయ్యేవరకు దానిని కొనసాగించవలెను.

1 ఏలయనగా ప్రభువు నిశ్చయముగా చెప్పునదేమనగా, సమావేశము వరకు వారు సువార్త బోధను కొనసాగించుట మరియు చుట్టుప్రక్కల ప్రాంతములలో ఉన్న సంఘములకు ఉద్భోధించుట నా యందు యుక్తమైయున్నది;

2 ఆ తరువాత, సమావేశ తీర్మానము ద్వారా వారి నియమితకార్యములు అనేకము వారికి తెలియజేయబడును.

3 ఇప్పుడు నా సేవకులైన జోసెఫ్ స్మిత్ జూ., సిడ్నీ రిగ్డన్‌లు మరలా అనువదించుట నా యందు యుక్తమైయున్నదని;

4 సమావేశము వరకు సాధ్యమైనంతమట్టుకు చుట్టుప్రక్కల నున్న ప్రదేశములలో సువార్తను బోధించవలెనని; దాని తరువాత అనువాద కార్యము పూర్తయ్యే వరకు దానిని కొనసాగించుట యుక్తమని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

5 వ్రాయబడిన విధముగా లేఖనములలో మరింత జ్ఞానము ఇవ్వబడు వరకు పెద్దలకు ఇది ఒక విధానముగా ఉండనిమ్ము.

6 ఈ సమయములో ఇక నేను మీకు ఏమియు ఇవ్వను. మీ దట్టీలను కట్టుకొని, గంభీరముగానుండుడి. అలాగే జరుగును గాక. ఆమేన్.