లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 57


57వ ప్రకరణము

1831 జూలై 20న, మిస్సోరిలోని జాక్సన్ కౌంటీలోనున్న సీయోనులో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. మిస్సోరికి ప్రయాణము చేయాలని, అక్కడ ఆయన “మీ స్వాస్థ్య దేశమును బయలుపరచును” (52వ ప్రకరణము) అనే ప్రభువు ఆజ్ఞకు అనుగుణంగా పెద్దలు ఒహైయో నుండి మిస్సోరి పశ్చిమ సరిహద్దుకు ప్రయాణమయ్యారు. జోసెఫ్ స్మిత్ లేమనీయుల స్థితిని గూర్చి ఆలోచించుచూ, “అరణ్యము గులాబివలే ఎప్పుడు వికసించును? సీయోను తన మహిమతో నిర్మించబడి, అంత్యదినములలో సమస్త జనములు వచ్చు నీ దేవాలయము ఎప్పుడు నిలబడును?” అని విస్మయమొందెను. అటుపిమ్మట ఆయన ఈ బయల్పాటును పొందెను.

1–3, సీయోను పట్టణము మరియు దేవాలయము నిర్మించబడు స్థలమే ఇండిపెండెన్స్, మిస్సోరి; 4–7, పరిశుద్ధులు స్థలములను కొనుగోలు చేసి, ఆ ప్రాంతములో స్వాస్థ్యమును పొందవలెను; 8–16, సిడ్నీ గిల్బర్ట్ ఒక అంగడిని స్థాపించవలెను, విలియం డబ్ల్యు. ఫెల్ప్స్ ఒక ముద్రణకర్తగా నుండవలెను మరియు ఆలీవర్ కౌడరీ ప్రచురణ కొరకు అంశములను సవరించవలెను.

1 ఓ నా సంఘ పెద్దలారా, ఆలకించుడని దేవుడైన మీ ప్రభువు సెలవిచ్చుచున్నాడు, నా ఆజ్ఞలను బట్టి ఈ ప్రదేశములో అనగా పరిశుద్ధులు కూడివచ్చుటకు నేను నియమించి, ప్రతిష్ఠించిన మిస్సోరిలో మీయంతట మీరు సమావేశమైరి.

2 కాబట్టి ఇదే వాగ్దాన ప్రదేశము మరియు సీయోను పట్టణము కొరకు స్థలము.

3 మీ దేవుడైన ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు జ్ఞానమును పొందగోరినట్లైతే, ఇందులో జ్ఞానము కలదు. ఇదిగో, ఇండిపెండెన్స్‌గా ఇప్పుడు పిలువబడుచున్న ప్రదేశమే కేంద్ర ప్రదేశము; దేవాలయము కొరకు ఒక స్థలము పశ్చిమ ముఖముగా, న్యాయస్థాన భవనమునకు కొంచెము దూరములో ఒక భూభాగముపైనున్నది.

4 కాబట్టి, పరిశుద్ధుల చేత ఆ స్థలము కొనుగోలు చేయబడుట జ్ఞానమైయున్నది మరియు పశ్చిమముగానున్న ప్రతి విశాలప్రదేశము, సరాసరి యూదులు మరియు అన్యజనుల మధ్య వెళ్ళుచున్న గీతవరకు కూడా కొనుగోలు చేయబడవలెను;

5 నా శిష్యులు స్థలములను కొనగలిగినంత వరకు పచ్చికబయళ్ళకు అవతలనున్న ప్రతి విశాల ప్రదేశము కొనుగోలు చేయబడవలెను. ఇదిగో, వారు దీనిని శాశ్వత స్వాస్థ్యముగా పొందుట జ్ఞానమైయున్నది.

6 నా సేవకుడైన సిడ్నీ గిల్బర్ట్ ధనమును స్వీకరించుటకు, సంఘమునకు ప్రతినిధిగా ఉండుటకు, నీతిగా చేయగలిగినంత వరకు తెలివిగా చుట్టుప్రక్కలనున్న అన్ని ప్రదేశములలో స్థలము కొనుగోలు చేయుటకు నేనతడిని నియమించిన స్థానములో నిలబడవలెను.

7 నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌, నేనతడిని నియమించిన స్థానములో నిలబడవలెను మరియు నేనాజ్ఞాపించిన విధముగా పరిశుద్ధులకు వారి స్వాస్థ్యమును విభజించవలెను; అతని చేత నియమించబడిన వారు అతనికి సహాయము చేయవలెను.

8 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన సిడ్నీ గిల్బర్ట్ ఈ ప్రదేశములో స్థిరపడి ఒక అంగడిని స్థాపించవలెను, తద్వారా అతడు మోసము లేకుండా సరుకులను అమ్మవచ్చును, పరిశుద్ధుల మేలు కొరకు స్థలములను కొనుగోలు చేయవచ్చును, తమ స్వాస్థ్యములో తమను స్థిరపరచుకొనుటకు శిష్యులకు కావలసినవన్నీ అతడు సంపాదించవచ్చును.

9 మరియు నా సేవకుడైన సిడ్నీ గిల్బర్ట్ ఒక అనుమతి పత్రమును పొందవలెను, ఆవిధముగా అతడు తన క్రింద గుమాస్తాలుగా నియమించబడిన వారిచేత ఈ జనులకు సరుకులను పంపవచ్చును—ఇదిగో, ఇందులో జ్ఞానము కలదు మరియు చదువు వానిని గ్రహించనిమ్ము;

10 ఆ విధముగా నా పరిశుద్ధులకు సమకూర్చవచ్చును, తద్వారా నా సువార్త అంధకారములోను, ఈ ప్రాంతములోను, మరణచ్ఛాయలోను కూర్చొనియున్న వారికి ప్రకటించబడును.

11 మరలా, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన విలియం డబ్ల్యు. ఫెల్ప్స్ ఈ స్థలములో స్థిరపరచబడవలెను, ఈ సంఘమునకు ముద్రణకర్తగా నియమించబడవలెను.

12 లోకము అతని వ్రాతలను స్వీకరించిన యెడల, పరిశుద్ధుల మేలు కొరకు నీతియందు అతడు దేనిని సంపాదించగలడో దానిని సంపాదించవలెను—ఇదిగో, ఇందులో జ్ఞానము కలదు.

13 నా సేవకుడైన ఆలీవర్ కౌడరీ నేను ఆజ్ఞాపించినట్లుగా, నేను నియమించు ఏ స్థానములోనైనను నకలు చేయుటకు, సరిదిద్దుటకు మరియు ఎంపిక చేయుటకు అతనికి సహాయము చేయవలెను, తద్వారా అన్ని సంగతులు నా యెదుట సరిగ్గా ఉండునట్లు, ఆత్మ దానిని అతని ద్వారా నిరూపించును.

14 ఆ విధముగా, నేను ఎవరిని గూర్చి చెప్పియుంటినో వారు నేను చెప్పినట్లుగా ఆ సంగతులను చేయుటకు వీలైనంత వేగముగా వారి కుటుంబములతో సీయోనులో స్థిరపరచబడవలెను.

15 ఇప్పుడు సమకూడుటను గూర్చి—బిషప్పు మరియు ప్రతినిధి ఈ ప్రదేశమునకు వచ్చుటకు ఆజ్ఞాపించబడిన కుటుంబముల కొరకు వీలైనంత త్వరగా సిద్ధపాటులను చేసి, తమ స్వాస్థ్యములో వారిని స్థిరపరచవలెను.

16 మిగిలిన పెద్దలు, సభ్యులిరువురికి మరిన్ని నిర్దేశములు ఇకముందు ఇవ్వబడును. అలాగే జరుగును గాక. ఆమేన్.