లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 45


45వ ప్రకరణము

1831 మార్చి 7న, ఒహైయోలోని కర్ట్‌లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా సంఘమునకివ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటును పొందుపరచుటకు ముందుమాటగా జోసెఫ్ స్మిత్ చరిత్ర ప్రకటించునదేమనగా, “సంఘ చరిత్రలో ఈ సమయములో. … ఈ కార్యమును పరిశోధించకుండా, లేదా విశ్వాసమును హత్తుకొనకుండా ప్రజలను నివారించుటకు … అనేక అసత్య నివేదికలు … బుద్ధిహీనమైన కథలు ప్రచురించబడెను … పంచిపెట్టబడెను, … కానీ పరిశుద్ధుల ఆనందమునకై, … నేను దీనిని పొందితిని.”

1–5, క్రీస్తు తండ్రితో మన న్యాయవాది; 6–10, సువార్తే ప్రభువు యెదుట మార్గమును సిద్ధపరచు దూత; 11–15, హనోకు, అతని సహోదరులు ప్రభువు చేత ఆయన యొద్దకే చేర్చుకొనబడిరి; 16–23, ఒలీవల కొండపై ఇచ్చిన విధముగానే క్రీస్తు తన రాకడను గూర్చి సూచనలు బయలుపరచెను; 24–38, సువార్త పునఃస్థాపించబడును, అన్యజనముల కాలములు పరిపూర్ణమగును, నాశనకరమైన వ్యాధి దేశమంతటిని కప్పును; 39–47, రెండవ రాకడ సమయములో సూచకక్రియలు, ఆశ్చర్యకార్యములు, పునరుత్థానము కలుగును; 48–53, క్రీస్తు ఒలీవల కొండపై నిలబడును మరియు యూదులు ఆయన చేతులలోను, పాదములలోను గాయములను చూచెదరు; 54–59, వెయ్యేండ్ల పరిపాలనయందు ప్రభువు రాజ్యమేలును; 60–62, క్రొత్త నిబంధన అనువాదమును ప్రారంభించమని ప్రవక్త ఉపదేశించబడెను, దాని ద్వారా ముఖ్య సమాచారము తెలియజేయబడును; 63–75, పరిశుద్ధులు కూడి వచ్చి, నూతన యెరూషలేమును నిర్మించవలెనని ఆజ్ఞాపించబడిరి, అక్కడికి సమస్త దేశములనుండి ప్రజలు వచ్చెదరు.

1 పరలోకరాజ్యము ఇవ్వబడిన ఓ నా సంఘ జనులారా, ఆలకించుడి; భూమికి పునాది వేసిన వానిని ఆలకించి, ఆయనకు చెవియొగ్గుడి; ఆయన పరలోకమును, దానిలోని సైన్యములన్నిటిని చేసెను మరియు జీవముగలవి, చలించుచున్నవి, ఉనికి గల సమస్తమును ఆయన వలననే చేయబడినవి.

2 నేను మరలా చెప్పునదేమనగా, నా స్వరమును ఆలకించుడి, లేనియెడల మరణము మిమ్ములను జయించును; మీరు ఊహించని ఒక గడియలోనే వేసవి గతించును, కోత ముగియును మరియు మీ ఆత్మలు రక్షించబడవు.

3 ఇలా చెప్పుచూ తండ్రితో మీ న్యాయవాదిగానుండి, ఆయన యెదుట మిమ్ములను గూర్చి బ్రతిమాలుచున్న వానిని ఆలకించుము—

4 తండ్రీ, ఏ పాపము చేయని వాని శ్రమలను, మరణమును చూడుము, వానియందు నీవు అధికముగా ఆనందించితివి; చిందించబడిన నీ కుమారుని రక్తమును, నీవు మహిమపరచబడునట్లు నీవిచ్చిన అతని రక్తమును చూడుము.

5 కాబట్టి తండ్రీ, వారు నా యొద్దకు వచ్చి, నిత్య జీవమును పొందునట్లు నా నామమందు విశ్వాసముంచు ఈ నా సహోదరులను కాపాడుము.

6 ఓ నా సంఘ జనులారా, ఆలకించుడి, పెద్దలారా మీరు కలిసి ఆలకించుడి, మీ హృదయములను కఠినపరచుకొనక నేడు అనబడు దినమున నా స్వరమును వినుడి;

7 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, అల్ఫాయు ఓమెగయు, ఆదియు అంతమును, లోకమునకు వెలుగును, జీవమును నేనే—ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను.

8 నేను నా స్వకీయుల యొద్దకు వచ్చితిని గాని, నా స్వకీయులు నన్ను అంగీకరించలేదు; కానీ నన్ను ఎందరంగీకరించిరో వారికందరికి అనేక అద్భుతములు చేయుటకు, దేవుని పిల్లలగుటకు నేను శక్తినిచ్చితిని; నా నామమందు విశ్వాసముంచిన వారికి కూడా నిత్యజీవము పొందుటకు నేను శక్తినిచ్చితిని.

9 ఆవిధముగానే లోకమునకు వెలుగుగా నుండుటకు, నా ప్రజలకు ఒక ప్రమాణముగా నుండుటకు, అన్యజనులు దానిని వెదకుట కొరకు, నా యెదుట దూతగా నుండి నాకు మార్గమును సిద్ధపరచుటకు నా నిత్య నిబంధనను నేను లోకములోనికి పంపితిని.

10 కాబట్టి, మీరు దాని యొద్దకు రండి, వచ్చువానితో ప్రాచీన దినములందున్న మనుష్యులతో వలే నేను తర్కించెదను మరియు నా బలమైన కారణమును నేను మీకు చూపెదను.

11 కాబట్టి మీరందరు ఆలకించుడి, నా జ్ఞానమును అనగా—హనోకు, అతని సహోదరుల దేవుడని మీరు చెప్పు ఆయన జ్ఞానమును చూపనియ్యుడి,

12 వారు భూలోకమునుండి వేరుచేయబడి, నా యొద్దకు చేర్చుకొనబడిరి—పరిశుద్ధులందరి చేత వెదకబడుచున్ననీతిగల ఒక దినము వచ్చువరకు భద్రపరచబడిన ఆ పట్టణమును దుష్టత్వము, హేయ క్రియలవలన వారు కనుగొనలేకపోయిరి;

13 తాము భూమిమీద పరదేశులము, యాత్రికులమైయున్నామని ఒప్పుకొనిరి;

14 కానీ వారు దానిని కనుగొందురని, శరీరమందు దానిని చూచెదరని ఒక వాగ్దానమును పొందిరి.

15 కాబట్టి ఆలకించుడి, మీతో నేను తర్కించెదను మరియు ప్రాచీన దినములందున్న మనుష్యులతోవలే నేను మీతో మాట్లాడి, ప్రవచించెదను.

16 శరీరమందు వారి యెదుట నిలిచియున్నప్పుడు వారితో ఇట్లు చెప్పుచూ నా శిష్యులకు నేను చూపిన విధముగా నేను దానిని స్పష్టముగా చూపెదను: నా రాకడ యొక్క సూచకక్రియలను గూర్చి మీరు నన్ను అడిగితిరి గనుక, ఆకాశమేఘారూఢుడనై నేను నా మహిమతో వచ్చు సమయమందు మీ పితరులకు నేను చేసియున్న వాగ్దానములను నెరవేర్చెదను;

17 మీ ఆత్మలు మీ శరీరములలో దీర్ఘకాలము లేకపోవుటను బట్టి మీరు చెరలో ఉన్నట్లుగా భావించితిరి గనుక, విమోచన దినము మరియు చెదరగొట్టబడిన ఇశ్రాయేలీయుల పునఃస్థాపన ఏవిధముగా వచ్చునో నేను మీకు చూపెదను.

18 మీరు దేవుని మందిరముగా పిలుచు యెరూషలేములోనున్న దేవాలయమును మీరు చూడుడి, మీ శత్రువులు ఈ మందిరము ఎన్నటికీ పడిపోదని చెప్పుదురు.

19 కానీ నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, రాత్రి వేళ దొంగ వచ్చునట్లుగా ఈ తరమువారి మీదికి నాశనము వచ్చును మరియు ఈ ప్రజలు నాశనము చేయబడి, సమస్త జనముల మధ్యకు చెదరగొట్టబడుదురు.

20 మీరు చూచుచున్న ఈ దేవాలయము ఒక రాయిపై మరొకటి లేకుండా పడవేయబడును.

21 మరియు యూదుల యొక్క ఈ తరము వారిని గూర్చి నేను చెప్పియున్న ప్రతి నాశనము నెరవేరువరకు వారు గతించరు.

22 లోకాంతము వచ్చుచున్నదని మీకు తెలియునని మీరు చెప్పుదురు; ఆకాశములును, భూమియు గతించునని మీకు తెలియునని కూడా మీరు చెప్పుదురు;

23 దీని విషయమై మీరు యథార్థముగా చెప్పుదురు, ఏలయనగా ఆవిధముగానే జరుగును; కానీ నేను మీకు చెప్పియున్న ఈ సంగతులు అన్నియు నెరవేరువరకు అవి గతించవు.

24 యెరూషలేమును గూర్చి దీనిని నేను మీకు చెప్పితిని; ఆ దినము వచ్చునప్పుడు, ఒక శేషము సమస్త జనముల మధ్యకు చెదరగొట్టబడును;

25 వారు మరలా సమకూర్చబడుదురు; కానీ అన్యజనుల కాలములు పరిపూర్ణమగు వరకు వారు సమకూర్చబడకయుందురు.

26 ఆ దినమందు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు విందురు, భూమి యంతయు సంక్షోభములోనుండును, ధైర్యము చెడి మనుష్యులు కూలుదురు మరియు భూమి అంతమగువరకు క్రీస్తు తన రాకడను ఆలస్యము చేయుచున్నాడని వారు చెప్పుదురు.

27 మనుష్యులలో ప్రేమ చల్లారును, పాపము విస్తరించును.

28 అన్యజనుల కాలములు వచ్చినప్పుడు, చీకటిలో కూర్చుండువారి మధ్య వెలుగు ఉదయించును మరియు అది నా సంపూర్ణ సువార్తయైయుండును.

29 కానీ వారు దానిని స్వీకరించరు; ఏలయనగా వారు వెలుగును గ్రహించరు, మనుష్యుల ఆజ్ఞలను బట్టి వారు తమ హృదయాలను నా నుండి త్రిప్పుకొనెదరు.

30 ఆ తరములోనే అన్యజనముల కాలములు పరిపూర్ణమగును.

31 ముంచివేయు ఉపద్రవమును చూచువరకు గతించని మనుష్యులు ఆ తరము వారిలో నిలిచియుందురు; ఏలయనగా నాశనకరమైన తెగులు భూమిని కప్పును.

32 కానీ నా శిష్యులు పరిశుద్ధ స్థలములలో కదలక నిలిచియుందురు; కానీ దుష్టుల మధ్యనున్న మనుష్యులు వారి స్వరములనెత్తి దేవుని శపించి, మరణించెదరు.

33 అనేక ప్రదేశములలో భూకంపములు, అనేకమైన నాశనములు కలుగును; అయినను మనుష్యులు వారి హృదయములను నాకు విరోధముగా కఠినపరచుకొందురు, ఒకనికి విరోధముగా మరియొకడు కత్తిపట్టి, ఒకరినొకరు హతము చేసుకొందురు.

34 ఇప్పుడు, ప్రభువునైన నేను నా శిష్యులతో ఈ మాటలను పలికినప్పుడు వారు కలవరపడిరి.

35 మరియు నేను వారితో చెప్పితిని: మీరు కలవరపడకుడి, ఏలయనగా ఈ సంగతులన్నియు జరుగునప్పుడు, మీకు చేయబడిన వాగ్దానములన్నియు నెరవేరునని మీరు తెలుసుకొందురు.

36 వెలుగు ఉదయించుట ఆరంభించునప్పుడు, నేను మీకు చూపబోవు ఒక ఉపమానము వలే అది వారితో నుండును—

37 మీరు అంజూరపు చెట్లను చూచి వీక్షించునప్పుడు, వాటిని మీ కన్నులతో చూచెదరు, అవి చిగురించుట ప్రారంభించి, వాటి ఆకులు ఇంకను లేతగా ఉన్నప్పుడు వేసవి సమీపములో ఉన్నదని మీరు చెప్పుదురు;

38 ఈ సంగతులన్నిటిని వారు చూచినప్పుడు, ఆ దినమందు కూడా ఆవిధముగానే ఉండును, అప్పుడు ఆ గడియ సమీపములో ఉన్నదని వారు తెలుసుకొందురు.

39 నాకు భయపడువాడు ప్రభువు యొక్క ఆ మహా దినము కొరకు, అనగా మనుష్యకుమారుని రాకడ యొక్క సూచకక్రియల కొరకు కనిపెట్టుచుండును.

40 వారు సూచకక్రియలను, ఆశ్చర్యకార్యములను చూచెదరు, ఏలయనగా పైన ఆకాశమందును, క్రింద భూమి మీదను అవి చూపబడును.

41 వారు రక్తమును, అగ్నిని, దట్టమైన పొగను చూచెదరు.

42 ప్రభువు యొక్క ఆ మహాదినము రాకమునుపు, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు రక్తముగా మారును, ఆకాశమునుండి నక్షత్రములు రాలును.

43 శేషము ఈ ప్రదేశమునకు చేర్చబడును;

44 అప్పుడు వారు నా కొరకు కనిపెట్టెదరు, ఇదిగో నేను వచ్చెదను; వారు నన్ను పరిశుద్ధ దేవదూతలందరితోను శక్తి, గొప్ప మహిమ సమేతముగా ఆకాశ మేఘములలో చూచెదరు; నా కొరకు కనిపెట్టని వాడు కొట్టివేయబడును.

45 కానీ ప్రభువు హస్తము పడకముందు, ఒక దూత బూరను ఊదును మరియు నిద్రించిన పరిశుద్ధులు మేఘములపైన నన్ను కలుసుకొనుటకు ముందుకు వచ్చెదరు.

46 కాబట్టి, శాంతితో మీరు నిద్రించిన యెడల మీరు ధన్యులు; ఏలయనగా ఇప్పుడు మీరు నన్ను చూచి, నేను ఉన్నానని తెలుసుకొనిన విధముగానే మీరు నా యొద్దకు వచ్చెదరు, మీ ఆత్మలు జీవించును, మీ విమోచన పరిపూర్ణముగా చేయబడును; మరియు భూమి నలుమూలల నుండి పరిశుద్ధులు వచ్చెదరు.

47 అప్పుడు ప్రభువు హస్తము జనములమీద పడును.

48 ఈ కొండమీద ప్రభువు తన పాదమును మోపగా అది రెండుగా విడిపోవును, భూమి కంపించి ముందుకు, వెనుకకు చుట్టివేయబడును మరియు ఆకాశము కూడా కంపించును.

49 ప్రభువు తన స్వరమును వినిపించగా, భూదిగంతములన్నియు దానిని వినును; భూమి మీదనున్న సమస్త జనములు దు:ఖించుదురు మరియు నవ్విన వారందరు వారి అవివేకమును చూచెదరు.

50 వెక్కిరించువానిని ఆపద కప్పివేయును, అపహాసకుడు దహించివేయబడును; పాపము కొరకు కనిపెట్టువారు నరకబడి, అగ్నిలో వేయబడుదురు.

51 అప్పుడు యూదులు నన్ను చూచి అడుగుదురు: నీ చేతులలో, నీ పాదములలోనున్న ఈ గాయములు ఏమిటి?

52 ప్రభువును నేనేయని అప్పుడు వారు తెలుసుకొందురు; ఏలయనగా నేను వారితో చెప్పుదును: ఈ గాయములు నా స్నేహితుల గృహములో నేను పొందిన గాయములు. పైకెత్తబడిన వాడను నేనే. సిలువ వేయబడిన యేసును నేనే. నేను దేవుని కుమారుడను.

53 అప్పుడు తమ పాపములను గూర్చి వారు ఏడ్చెదరు; వారు తమ రాజును హింసించిరి గనుక, వారు ప్రలాపింతురు.

54 అప్పుడు అన్య జనములు విమోచింపబడును మరియు ఏ ధర్మశాస్త్రమును యెరుగని వారు మొదటి పునరుత్థానములో పాలుపొందెదరు; అది వారికి సహింపశక్యముగా నుండును.

55 నరుల సంతానము యొక్క హృదయములలో వానికి స్థానము లేకుండునట్లు సాతాను బంధించబడును.

56 ఆ దినమున నేను మహిమతో వచ్చునప్పుడు, పదిమంది కన్యకలను గూర్చి నేను చెప్పిన ఉపమానము నెరవేర్చబడును.

57 ఏలయనగా జ్ఞానము కలిగి, సత్యమును స్వీకరించి, పరిశుద్ధాత్మను తమ మార్గదర్శిగా పొందినవారు మోసగించబడలేదు—వారు నరకబడి అగ్నిలో వేయబడరు, కానీ వారు ఆ దినమున నిలిచియుందురని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

58 ఒక స్వాస్థ్యముగా భూమి వారికి ఇవ్వబడును; వారు అభివృద్ధి చెంది బలపడుదురు మరియు వారి పిల్లలు పాపము లేకుండా ఎదిగి రక్షణ పొందెదరు.

59 ఏలయనగా ప్రభువు వారి మధ్యనుండును, ఆయన మహిమ వారిమీద నుండును, ఆయన వారి రాజుగా, శాసనకర్తగా ఉండును.

60 ఇదిగో, ఇప్పుడు నేను చెప్పునదేమనగా, క్రొత్త నిబంధన అనువదించబడు వరకు ఈ అధ్యాయమును గూర్చి ఇంకా ఎక్కువ తెలుసుకొనుటకు నీకు ఇవ్వబడదు మరియు అందులో ఈ సంగతులన్నియు తెలియజేయబడును;

61 కాబట్టి ఇప్పుడు నీవు అనువదించుటకు దీనిని నేను నీకిచ్చుచున్నాను, తద్వారా రాబోవు సంగతుల కొరకు నీవు సిద్ధపడియుందువు.

62 ఏలయనగా గొప్ప సంగతులు మీ కొరకు వేచియున్నవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;

63 విదేశాలలో మీరు యుద్ధములను గూర్చి విందురు; కానీ, ఇదిగో నేను చెప్పునదేమనగా, అవి మీ గుమ్మముల యొద్దనే యున్నవి మరియు అనేక సంవత్సరములు గడువక ముందు మీ స్వదేశాలలోనే మీరు యుద్ధములను గూర్చి విందురు.

64 కాబట్టి, తూర్పు దేశములనుండి మీరు కూడి రండని ప్రభువునైన నేను చెప్పితిని, నా సంఘ పెద్దలారా మీరు కలిసి కూడుకొనుడి; పశ్చిమదేశములకు మీరు వెళ్ళుడి, పశ్చాత్తాపపడుడని వాటి నివాసులకు ప్రకటించుడి, వారు పశ్చాత్తాపపడిన యెడల నాకు సంఘములను నిర్మించుడి.

65 ఏక హృదయము, ఏక మనస్సుతో ఇక మీదట మీకు నియమించబడు స్వాస్థ్యమును కొనుటకు మీ ధనమును సమకూర్చుకొనుడి.

66 అది నూతన యెరూషలేము, శాంతిగల ప్రదేశము, రక్షణదుర్గమైన పట్టణము, మహోన్నతుడైన దేవుని పరిశుద్ధుల కొరకు క్షేమకరమైన ప్రదేశము అని పిలువబడును;

67 దుష్టులు అక్కడకు రాలేనంతగా ప్రభువు మహిమ అక్కడ ఉండును, ప్రభువు విషయమైన భయము అక్కడ ఉండును, అది సీయోను అని పిలువబడును.

68 దుష్టుల మధ్య జరుగునదేమనగా, తన పొరుగువానికి విరోధముగా కత్తి పట్టనివాడు రక్షణ కొరకు సీయోనుకు పారిపోవలసిన అవసరముండును.

69 పరలోకము క్రిందనున్న ప్రతి జనము దానిలో సమకూడును; వీరు మాత్రమే ఒకరితోనొకరు యుద్ధము చేయని జనముగా ఉందురు.

70 దుష్టుల మధ్య ఇది చెప్పబడును: సీయోనుతో పోరాడుటకు మనము వెళ్ళవద్దు, ఏలయనగా సీయోను నివాసులు భయంకరులు; గనుక మనము నిలువలేము.

71 నీతిమంతులు సమస్త జనములనుండి కూర్చబడుదురు, నిత్య సంతోష గీతములను పాడుచు సీయోనుకు వచ్చెదరు.

72 నేను చెప్పునదేమనగా, నా యందు యుక్తమగువరకు ప్రజల కన్నులయందును, మీ శత్రువుల కన్నులయందును ఈ కార్యమును నెరవేర్చువరకు ఈ సంగతులు బయట ప్రపంచమునకు వెళ్ళకుండా ఆపుము, తద్వారా నేను మీకు ఆజ్ఞాపించియున్న దానిని మీరు నెరవేర్చువరకు వారు మీ కార్యములను తెలుసుకొనకయుందురు;

73 వారు దానిని తెలుసుకొన్నప్పుడు, ఈ సంగతులను వారు పరిగణించెదరు.

74 ఏలయనగా ప్రభువు కనబడునప్పుడు ఆయన వారికి భయంకరునిగానుండును, వారికి భయము కలుగును, వారు దూరముగా నిలబడి భయపడుదురు.

75 ప్రభువును గూర్చిన భయము వలన, ఆయన బలము యొక్క శక్తి వలన సమస్త జనములు భయపడుదురు. అలాగే జరుగును గాక. ఆమేన్.