లేఖనములు
అధికారిక ప్రకటన 1


అధికారిక ప్రకటన 1

ఆయన వేరేవిధముగా ప్రకటిస్తే తప్ప, ఏకభార్యత్వము అనేది వివాహమునకు దేవుని యొక్క ప్రామాణికమని బైబిలు మరియు మోర్మన్ గ్రంథములు బోధిస్తున్నవి (2 సమూయేలు 12:7–8 మరియు జేకబ్ 2:27, 30 చూడుము). జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన ఒక బయల్పాటు తరువాత 1840 ఆరంభములో సంఘ సభ్యుల మధ్య బహుభార్యత్వ ఆచరణ నెలకొల్పబడింది (132వ ప్రకరణము చూడుము). 1860 నుండి 1880 వరకు, ఈ మతపరమైన ఆచరణ చట్టవిరుద్ధమని సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వము చట్టాలను చేసింది. ఈ చట్టాలు చివరకు అమెరికా అత్యున్నత న్యాయస్థానముచేత సమర్థించబడినవి. బయల్పాటు పొందిన తరువాత, అధ్యక్షులు విల్ఫర్డ్ ఉడ్రఫ్ ఈ వివరణపత్రమును విడుదల చేసెను, అది అధికారికమైనది మరియు పాటించవలసినదిగా 1890, అక్టోబరు 6న సంఘముచేత అంగీకరించబడినది. ఇది సంఘములో బహువివాహముల ఆచరణ యొక్క ముగింపునకు దారితీసింది.

సంబంధిత వ్యక్తులెవరికైనను:

సాల్ట్ లేక్ సిటీ నుండి రాజకీయ అవసరాల కొరకు పత్రిక ప్రకటనలు పంపబడియుండెను, అవి విరివిగా ప్రచురించబడెను, ఫలితముగా అంతర్గత వ్యవహారాల కార్యదర్శికి తమ ఇటీవలి నివేదికలో బహుభార్య వివాహములు ఇంకా జరిపించబడుచున్నవని, గత జూన్ నుండి లేదా గత సంవత్సరము అటువంటి వివాహములు నలుబది లేదా అంతకంటే ఎక్కువ యూటాలో ఒప్పందము చేసుకొనబడెనని, అంతేకాక సంఘనాయకులు బహిరంగ ప్రసంగాలలో బహుభార్యత్వ ఆచారమును కొనసాగించమని బోధించి, ప్రోత్సహించి, ప్రేరేపించెనని యూటా కమీషన్ వాదించెను—

కాబట్టి, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ అధ్యక్షునిగా, ఈ ఆరోపణలు అసత్యమని ఇందునుబట్టి మిక్కిలి వినయముతో నేను ప్రకటించుచున్నాను. బహుభార్యత్వమును లేదా బహుభార్య వివాహములను మేము బోధించుటలేదు, దానిని ఆచరించుటకు ఏ వ్యక్తిని అనుమతించుట లేదు, ఆ కాలములో మా దేవాలయములలో లేదా ఈ భూభాగములో ఏ ఇతర ప్రాంతములోను నలుబది లేదా అంతకంటే ఎక్కువ బహుభార్య వివాహములు జరిగినవనుటను నేను ఖండిస్తున్నాను.

ఒక దావా నివేదించబడినది, అందులో 1889 వసంతకాలములో సాల్ట్ లేక్ సిటీలోని దేవాలయదీవెన మందిరములో వివాహము జరుపబడెనని ఇరుపక్షములు ఆరోపించుచుండెను, కానీ ఆ కార్యమును ఎవరు జరిపించిరో నేను తెలుసుకోలేకపోయాను; ఈ విషయములో ఏమి జరిగెనో అది నాకు తెలియకుండా జరిగెను. ఈ ఆరోపణకు పర్యవసానముగా నా ఆదేశాలను బట్టి ఆలస్యము చేయకుండా దేవాలయదీవెన మందిరము కూల్చబడినది.

బహుభార్య వివాహములను నిషేధించుచు శాసనసభ ద్వారా చట్టములు చేయబడెనని, ఆ చట్టములు రాజ్యంగబద్ధమైనవని అత్యున్నత న్యాయస్థానముచేత ప్రకటించబడెను గనుక, ఆ చట్టములకు లోబడుటకు నా ఉద్దేశ్యమును మరియు నేను అధ్యక్షత్వము వహించు సంఘ సభ్యులపట్ల నా పలుకుబడిని ఉపయోగించి వారును ఆవిధముగా చేయునట్లు చేసెదనని ఇందుమూలముగా నేను ప్రకటించుచున్నాను.

ఆ నిర్దిష్ట కాలములో నేను సంఘమునకు చేసిన బోధనలలో లేదా నా సహచరులు చేసినవాటిలో బహుభార్యత్వమును ప్రోత్సహించునది లేదా పురికొల్పునది ఏదియు లేదని సహేతుకముగా విశ్లేషించవచ్చును; సంఘ పెద్దలెవరైనా అటువంటి ఏ బోధనైనను వ్యక్తపరచునట్లుగా కనిపించినప్పుడు, అతడు వెంటనే మందలించబడెను. దేశ పౌరచట్టము నిషేధించిన ఏ వివాహ ఒప్పందమునైనా చేసుకొనకుండా నిగ్రహించుకోవాలన్నదే కడవరి దిన పరిశుద్ధులకు నా సలహా అని ఇప్పుడు నేను బహిరంగముగా ప్రకటించుచున్నాను.

విల్ఫర్డ్ ఉడ్రఫ్

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల
సంఘము యొక్క అధ్యక్షులు.

అధ్యక్షులు లారెంజో స్నో దీనిని సమర్పించెను:

“విల్ఫర్డ్ ఉడ్రఫ్, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షునిగా, భూమిమీద ప్రస్తుత కాలములో ముద్రవేయు విధుల యొక్క తాళపుచెవులు కలిగియున్న ఏకైక వ్యక్తిగా, ఆయన స్థానపు వైశిష్ట్యమును బట్టి 1890, సెప్టెంబరు 24వ తేదీ వేయబడి, మనము వినుచుండగా చదవబడిన ప్రకటనపత్రం జారీచేయుటకు పూర్తిగా అధికారమును కలిగియున్నారని నేను ప్రతిపాదించుచున్నాను, ఒక సంఘముగా సర్వసభ్య సమావేశములో కూడి, బహుభార్య వివాహములను గూర్చి ఆయన చేసిన ప్రకటన అధికారికమైనదని మరియు బాధ్యుల్ని చేయునదని మేము అంగీకరించుచున్నాము.

సాల్ట్ లేక్ సిటీ, యూటా, అక్టోబరు 6, 1890.

ప్రకటనపత్రం గురించి అధ్యక్షులు విల్ఫర్డ్ ఉడ్రఫ్
ఇచ్చిన మూడు ప్రసంగముల
నుండి తీసుకొనబడిన భాగములు

నేను లేదా ఈ సంఘ అధ్యక్షునిగా నిలబడు ఏ ఇతర వ్యక్తి మిమ్ములను తప్పు మార్గములో నడిపించుటకు ప్రభువు అనుమతించరు. అది ప్రణాళికలో లేదు. అది దేవుని ఆలోచనలో లేదు. దానిని చేయుటకు నేను ప్రయత్నించిన యెడల, ప్రభువు నా స్థానమునుండి నన్ను తప్పించును, దేవుని దేవోక్తుల నుండి, వారి బాధ్యత నుండి నరుల సంతానమును తప్పుగా నడిపించు ఏ ఇతర వ్యక్తినైనా ఆయన అదేవిధముగా తప్పించును. (సంఘము యొక్క అరువది ఒకటవ అర్థవార్షిక సర్వసభ్య సమావేశము, 1890, అక్టోబరు 6, సోమవారము, సాల్ట్ లేక్ సిటీ, యూటా. 1890, అక్టోబరు 11, Deseret Evening News, పే. 2. లో నివేదించబడినది.)

ఎవరు జీవించునో, ఎవరు మరణించునో లేదా ఈ సంఘమును ఎవరు నడిపించునో అది ముఖ్యము కాదు, సర్వశక్తిమంతుడగు దేవుని ప్రేరేపణతో వారు దానిని నడిపించవలెను. వారు ఆ విధముగా చేయనియెడల, వారు దానిని ఏమాత్రము చేయలేరు. …

ఈ మధ్యకాలములో నాకు కొన్ని బయల్పాటులు ఇవ్వబడినవి, అవి నాకు చాలా ప్రాముఖ్యమైనవి, ప్రభువు నాతో ఏమి చెప్పెనో మీకు చెప్పెదను. ప్రకటనపత్రంగా పిలువబడిన దానిని మీ ఆలోచనకు నన్ను తీసుకొనిరానియ్యుడి. …

కడవరి దిన పరిశుద్ధులను ఒక ప్రశ్న అడుగమని ప్రభువు చెప్పెను, నేను వారికి చెప్పినది విని, వారిని అడిగిన ప్రశ్నకు సమాధానము దేవుని శక్తి మరియు ఆత్మ ద్వారా చెప్పిన యెడల, వారందరు ఒకేవిధముగా సమాధానము చెప్పుదురు, ఈ అంశమునకు సంబంధించి వారందరు ఒకే విధముగా నమ్ముదురని కూడా ఆయన నాకు చెప్పియుండెను.

ఆ ప్రశ్న ఇదే: కడవరి దిన పరిశుద్ధులు అనుసరించవలసిన తెలివైన మార్గము ఏది—దేశ చట్టములు దానికి విరోధముగానుండి ఆరు కోట్లమంది ప్రజల వ్యతిరేకతతో, దేవాలయములన్నీ జప్తు చేయబడి, కోల్పోబడి, సజీవులు మరియు మృతుల కొరకు వాటిలోని విధులన్నియు ఆపివేయబడి, ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది అపొస్తలుల సమూహము, సంఘములోని కుటుంబ పెద్దలు చెరశాలలో వేయబడి, ప్రజల ఆస్తులు జప్తుచేయబడి, దానికి తగిన మూల్యం చెల్లించి బహుభార్య వివాహములను ఆచరించుటకు ప్రయత్నించుటలో కొనసాగుటయా? (ఇవన్నియు ఈ ఆచరణను ఆపివేయునట్లు చేయును); లేదా, ఈ సూత్రమును పాటించుట ద్వారా మనము వేటిని చేసియుండి, బాధననుభవించితిమో వాటిని చేసి బాధననుభవించిన తరువాత ఈ ఆచరణను ఆపివేసి చట్టమునకు లోబడి, ఆ విధముగా చేయుట ద్వారా ప్రవక్తలు, అపొస్తలులు, తండ్రులు గృహములలో ఉండుటకు వీలుకల్పించి, తద్వారా వారు ప్రజలకు సూచించి, సంఘ బాధ్యతలను నెరవేర్చుటకు దేవాలయములను పరిశుద్ధుల చేతులకప్పగించి తద్వారా వారు సజీవులకు, మృతులకు ఇరువురికి సువార్త విధులు నెరవేర్చునట్లు చేయుటయా?

ఈ ఆచరణను మనము ఆపివేయని యెడల ఖచ్చితముగా ఏమి జరుగునో ప్రభువు దర్శనము మరియు బయల్పాటు ద్వారా నాకు చూపెను. దీనిని మనము ఆపివేయని యెడల, మీరు. … లోగన్ లోని ఈ దేవాలయములోనున్న ఏ పురుషుడు దేనికిని అక్కరకు రాకపోవును; సీయోను ప్రదేశమందంతటా విధులన్నియు ఆగిపోవును. ఇశ్రాయేలు అంతటా గందరగోళం రాజ్యమేలును, పురుషులలో అనేకులు ఖైదీలుగా చేయబడుదురు. సంఘమంతటికి ఈ ఆపద సంభవించును, మనము ఈ ఆచరణను ఆపివేయుటకు బలవంతము చేయబడుదుము. ఇప్పుడు ప్రశ్న ఏమిటనగా, ఈ విధముగా అది ఆపబడవలెనా లేదా ప్రభువు మనకు ప్రత్యక్షపరచిన విధముగా మన ప్రవక్తలను, అపొస్తలులను, తండ్రులను స్వతంత్రులుగా చేసి, మృతులు విమోచింపబడునట్లు దేవాలయములను ప్రజల చేతులకప్పగించుట ద్వారానా? ఈ జనుల ద్వారా పెద్ద సంఖ్యలో ఆత్మల ప్రపంచములో చెరలోనున్నవారు అప్పుడే విడిపించబడిరి, ఈ కార్యము కొనసాగవలెనా లేదా ఆగవలెనా? అని కడవరి దిన పరిశుద్ధులను నేను అడుగుచున్నాను. మీకు మీరే విమర్శ చేసుకొనవలెను. మీకు మీరే ప్రత్యుత్తరమిచ్చుకొనవలెనని నేను కోరుచున్నాను. నేను ప్రత్యుత్తరమియ్యను; కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయమును నేను తీసుకోనియెడల ఒక జనాంగముగా మనము ఖచ్ఛితముగా ఇటువంటి పరిస్థితిలోనే ఉండెడివారమని మీకు చెప్పుచున్నాను.

… ఏదో ఒకటి చేయకుండిన యెడల ఖచ్ఛితముగా ఏమి సంభవించునో నేను చూచితిని. చాలా సమయము ఈ ఆత్మ నాపైయుండెను. కానీ నేను దీనిని చెప్పాలని కోరుచున్నాను: పరలోకమందున్న దేవుడు నేను చేసియున్న దానిని చేయమని ఆజ్ఞాపించని యెడల దేవాలయములన్నీ మన చేజారిపోవునట్లు నేను చేసియుండేవాడిని; నేను చెరసాలకు వెళ్ళి, మిగిలిన పురుషులు కూడా అక్కడకు వెళ్ళునట్లు చేసియుండేవాడిని; నేను ఆజ్ఞాపించబడిన దానిని చేయు గడియ వచ్చినప్పుడు, ఇదంతయు నాకు స్పష్టమయ్యెను. నేను ప్రభువు యెదుటకు వెళ్ళితిని, వ్రాయమని ప్రభువు నాకు చెప్పిన దానిని నేను వ్రాసితిని. …

మీరు ఆలోచించి, పరిగణించుటకు దీనిని మీ యెదుట వదిలిపెట్టుచున్నాను. ప్రభువు మనతో పాటు పనిచేయుచున్నాడు. (కేష్ స్టేకు సమావేశము, లోగన్, యూటా, ఆదివారము, 1891, నవంబరు 1. 1891, నవంబరు 14, Deseret Weekly, లో ప్రచురించబడినది.)

ఇప్పుడు నాకు ఏమి ప్రత్యక్షపరచబడినదో మరియు ఈ విషయములో దేవుని కుమారుడు ఏమి చేయుచుండెనో నేను మీకు తెలిపెదను. … ఆ బహిరంగ ప్రకటన ఇవ్వని యెడల, సర్వశక్తిగల దేవుని తోడు, ఇవన్నియు జరిగియుండేవి. కాబట్టి, దేవుని కుమారుడు తన మనస్సులోనున్న ఉద్దేశ్యముల నిమిత్తము ఈ ప్రకటనను సంఘము యెదుట, లోకము యెదుట ప్రవేశపెట్టుటకు ఇష్టపడెను. సీయోను స్థాపన గూర్చి ప్రభువు శాసనము చేసెను. ఈ దేవాలయమును పూర్తి చేయమని ఆయన శాసించెను. సజీవులు మరియు మృతుల రక్షణ ఈ పర్వత లోయలలో ఇవ్వబడవలెనని ఆయన శాసనము చేసెను. అపవాది దీనిని అడ్డగించకూడదని సర్వశక్తిగల దేవుడు శాసనము చేసెను. దీనిని మీరు గ్రహించగలిగిన యెడల, బహిరంగ ప్రకటనకు వివరణ ఇదియే అగును. (1893 ఏప్రిల్‌లో సాల్ట్ లేక్ దేవాలయపు ప్రతిష్ఠ యొక్క ఆరవ సమావేశములో ఒక ప్రసంగము నుండి తీసుకొనబడినది. టైపు చేయబడిన అంకిత సేవల పత్రము, ప్రాచీన భాండాగారం, సంఘ చరిత్ర విభాగము, సాల్ట్ లేక్ సిటీ, యూటా.)