లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 34


34వ ప్రకరణము

1830 నవంబరు 4న, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఓర్సన్ ప్రాట్‌కివ్వబడిన బయల్పాటు. సహోదరుడు ప్రాట్ అప్పటికి పందొమ్మిది సంవత్సరాల వయస్సు కలవాడు. ఆరు వారములకు ముందు అతని అన్న పార్లీ పి. ప్రాట్ చేత ప్రకటించబడిన పునఃస్థాపిత సువార్తను మొదట విన్నప్పుడు అతడు పరివర్తన చెంది, బాప్తిస్మము పొందెను. ఈ బయల్పాటు పీటర్ విట్మర్ సీనియర్ గృహములో పొందబడినది.

1–4, ప్రాయశ్చిత్తము ద్వారా విశ్వాసులు దేవుని కుమారులగుదురు; 5–9, సువార్త ప్రకటన రెండవ రాకడకు మార్గమును సిద్ధపరచును; 10–12, పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రవచనము వచ్చును.

1 నా కుమారుడా ఓర్సన్, దేవుడును ప్రభువునైన నేను నీకు చెప్పబోవు సంగతులను విని, ఆలకించి, చూడుము, ఆయన నీ విమోచకుడైన యేసు క్రీస్తు;

2 లోకమునకు జీవమును, వెలుగునైయున్నాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహించుటలేదు;

3 ఆయన లోకమును ఎంతగా ప్రేమించెననగా, నమ్మువారందరు దేవుని కుమారులగుటకు తన ప్రాణమును అర్పించెను. కాబట్టి నీవు నా కుమారుడవు;

4 నీవు నమ్మితివి గనుక నీవు ధన్యుడవు;

5 నా సువార్తను ప్రకటించుటకు నీవు నా చేత పిలువబడితివి గనుక, నీవు మిక్కిలి ధన్యుడవు—

6 బిగ్గరగా దీర్ఘకాలము బూర ఊదినట్లు నీ స్వరమును ఎలుగెత్తి, వక్రమైన, చెడ్డతరము వారికి పశ్చాత్తాపమును ప్రకటించి, ఆయన రెండవ రాకడ కొరకు ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు పిలువబడితివి.

7 ఏలయనగా ఇదిగో, శక్తితోను, గొప్ప మహిమతోను నేను మేఘమందు వచ్చు గడియ సమీపములోనున్నదని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

8 నేను వచ్చు సమయము మహాదినము అగును, ఏలయనగా జనములన్నీ భయముతో వణకును.

9 కానీ ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు; నక్షత్రములు తమ కాంతిని కోల్పోయి, వాటిలో కొన్ని ఆకాశము నుండి రాలును మరియు దుష్టుల కొరకు గొప్ప నాశనములు వేచియున్నవి.

10 కాబట్టి, తాళక నీ స్వరమును ఎలుగెత్తుము, ఏలయనగా దేవుడైన ప్రభువు దీనిని పలికెను; కాబట్టి ప్రవచించుము, అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇవ్వబడును.

11 నీవు విశ్వాసముగా యుండిన యెడల, ఇదిగో, నేను వచ్చువరకు నేను నీతో నున్నాను—

12 నేను అకస్మాత్తుగా వచ్చెదనని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీ ప్రభువును, నీ విమోచకుడను నేనే. అలాగే జరుగును గాక. ఆమేన్.