లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 69


69వ ప్రకరణము

1831 నవంబరు 11న, ఒహైయోలోని హైరంలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. నవంబరు 1, 2 తేదీలలో జరిగిన ప్రత్యేక సమావేశములో త్వరలో ప్రచురణ కొరకు ఉద్దేశించబడిన బయల్పాటుల సంపుటీకరణ ఆమోదించబడినది. నవంబరు 3న, ఇక్కడ 133వ ప్రకరణముగా కనబడు బయల్పాటు చేర్చబడి, తరువాత అనుబంధము అని పిలువబడెను. సంపుటీకరించబడిన బయల్పాటులు మరియు ఆజ్ఞల చేతివ్రాతలను ప్రచురణ కొరకు మిస్సోరిలోని ఇండిపెండెన్స్‌కు తీసుకొనిపోవుటకు ఆలీవర్ కౌడరీ ముందుగా నియమించబడెను. అతడు మిస్సోరిలో సంఘమును నిర్మించుటకు విరాళముగా ఇవ్వబడిన సొమ్మును కూడా తనతో తీసుకొని వెళ్ళవలెను. ఆలీవర్ కౌడరీకి సహకరించమని ఈ బయల్పాటు జాన్ విట్మర్‌కు సూచించును, సంఘ చరిత్రకారుడు మరియు నమోదుచేయువానిగా తన పిలుపులలో చారిత్రక అంశములను సేకరించుటకు ప్రయాణించమని నిర్దేశించును.

1–2, ఆలీవర్ కౌడరీకి తోడుగా జాన్ విట్మర్ మిస్సోరికి వెళ్ళవలెను; 3–8, అతడు బోధించవలెను మరియు చారిత్రక సమాచారమును సేకరించి, నమోదుచేసి, వ్రాయవలెను.

1 నా సేవకుడైన ఆలీవర్ కౌడరీ నిమిత్తము నన్ను ఆలకించుడని దేవుడైన మీ ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నమ్మకముగా, యథార్థముగా నుండు ఒకడు అతనితో వెళితే తప్ప, అతడికి ఆజ్ఞలు మరియు సీయోను ప్రదేశమునకు తీసుకొనిపోవలసిన ధనము అప్పగించబడుట నా యందు వివేకమైనది కాదు.

2 కాబట్టి, ప్రభువైన నేను నా సేవకుడైన ఆలీవర్ కౌడరీతో పాటు నా సేవకుడైన జాన్ విట్మర్ వెళ్ళవలెనని కోరుచున్నాను;

3 నా సంఘమును గూర్చి అతడు పరిశీలించి, తెలుసుకొను ముఖ్య సంగతులన్నింటి యొక్క చరిత్రను తయారుచేయుటలో, వ్రాయుటలో అతడు కొనసాగవలెను;

4 అతడు నా సేవకుడైన ఆలీవర్ కౌడరీ నుండి, ఇతరుల నుండి ఉపదేశమును, సహాయమును పొందవలెను.

5 భూమియందంతట ఉన్న నా సేవకులు సీయోను ప్రదేశమునకు వారి గృహనిర్వాహకత్వముల వృత్తాంతములను పంపవలెను;

6 ఏలయనగా ఈ సంగతులన్నింటిని పొందుటకు, వాటిని చేయుటకు సీయోను ప్రదేశము ఒక ప్రాంతముగా, ఒక స్థలముగానుండును.

7 అయినప్పటికీ, నా సేవకుడైన జాన్ విట్మర్ అతి సులువుగా జ్ఞానమును పొందగలుగునట్లు అనేకమార్లు ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు, ఒక సంఘము నుండి మరొక సంఘమునకు ప్రయాణించవలెను—

8 సీయోను ప్రదేశములో ఎదిగే భావితరములు ఎప్పటికీ, తరతరములకు దానిని స్వాధీనపరచుకొనుటకు మరియు సంఘము యొక్క మేలు కొరకు బోధించుచు, వివరించుచు, వ్రాయుచు, నకలు చేయుచు, ఎంపిక చేయుచు, అన్ని సంగతులను పొందవలెను. ఆమేన్.