లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 23


23వ ప్రకరణము

1830 ఏప్రిల్, న్యూయార్క్‌లోని మాంచెస్టర్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఆలీవర్ కౌడరీ, హైరం స్మిత్, శామ్యుల్ హెచ్. స్మిత్, జోసెఫ్ స్మిత్ సీనియర్, జోసెఫ్ నైట్ సీనియర్‌లకు ఇవ్వబడిన ఐదు వరుస బయల్పాటులు. చెప్పబడిన అయిదుగురు వ్యక్తులు తమ తమ బాధ్యతలను గూర్చి తెలుసుకొనవలెనని హృదయపూర్వకముగా కోరుకొనినందున, ప్రవక్త ప్రభువును విచారించి, ప్రతి వ్యక్తి కొరకు ఒక్కొక్క బయల్పాటును పొందెను.

1–7, ఈ మొదటి శిష్యులు బోధించుటకు, ఉద్భోధించుటకు, సంఘమును బలపరచుటకు పిలువబడిరి.

1 ఇదిగో ఆలీవర్, నేను నీతో కొద్ది మాటలను మాట్లాడుచున్నాను. ఇదిగో, నీవు ధన్యుడవు మరియు నిందారహితుడవైయున్నావు. కానీ, నీవు శోధనలో ప్రవేశించకుండునట్లు గర్వమును గూర్చి జాగ్రత్తపడుము.

2 సంఘమునకు, లోకము యెదుట నీ పిలుపును తెలియపరచుము, ఇకనుండి నిరంతరము సత్యమును ప్రకటించుటకు నీ హృదయము తెరువబడును. ఆమేన్.

3 ఇదిగో హైరం, నేను నీతో కొద్ది మాటలు మాట్లాడుచున్నాను, ఏలయనగా నీవు కూడా నిందారహితుడవైయున్నావు, నీ హృదయము తెరువబడి, నీ నాలుక సడలించబడినది; నీ పిలుపు యేదనగా, ఉద్భోధించుట మరియు ఎడతెగక సంఘమును బలపరచుట. కాబట్టి నీవు చేయవలసినది ఎన్నటికీ సంఘమునకే చేయవలెను, ఇది నీ కుటుంబము వలన కలిగినది. ఆమేన్.

4 ఇదిగో శామ్యుల్, నేను నీతో కొద్ది మాటలు మాట్లాడుచున్నాను; ఏలయనగా నీవు కూడా నిందారహితుడవైయున్నావు, నీ బాధ్యత యేమనగా ఉద్భోధించుట మరియు సంఘమును బలపరచుట; లోకము యెదుట ప్రకటించుటకు నీవింకను పిలువబడలేదు. ఆమేన్.

5 ఇదిగో జోసెఫ్, నేను నీతో కొద్ది మాటలు మాట్లాడుచున్నాను; ఏలయనగా నీవు కూడా నిందారహితుడవైయున్నావు, నీ బాధ్యత యేమనగా ఉద్భోధించుట మరియు సంఘమును బలపరచుట; ఇకనుండి ఎన్నటికీ ఇది నీ బాధ్యతయైయున్నది. ఆమేన్.

6 ఇదిగో జోసెఫ్ నైట్, ఈ మాటల చేత నేను నీకు ప్రత్యక్షపరచునదేమనగా, నీవు నీ సిలువ నెత్తికొనవలెను, ఎట్లనగా బయటకు వినిపించునట్లుగాను, రహస్యముగాను, లోకము యెదుట, నీ కుటుంబములో, నీ స్నేహితుల మధ్య మరియు అన్ని ప్రదేశములలో నీవు ప్రార్థించవలెను.

7 సత్య సంఘముతో ఐక్యమగుట నీ బాధ్యతయైయున్నది, నీ భాషను నిరంతరము ఉద్భోధించుటకు వినియోగించుము, తద్వారా నీవు పనివాని ప్రతిఫలమును పొందగలవు. ఆమేన్.