లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 49


49వ ప్రకరణము

1831 మే 7న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా సిడ్నీ రిగ్డన్, పార్లీ పి. ప్రాట్, లేమన్ కోప్లీలకివ్వబడిన బయల్పాటు. లేమన్ కోప్లీ సువార్తను హత్తుకొనెను గాని, అతడు ఇంతకు ముందు చెందియున్న షేకర్స్ (క్రీస్తు రెండవ దర్శనమందు విశ్వసించువారి ఐక్య సమాజము) యొక్క కొన్ని బోధనలను ఇంకా నమ్ముచుండెను. షేకర్స్ నమ్మకాలలో కొన్ని ఏవనగా, క్రీస్తు రెండవ రాకడ ఇంతకుముందే వచ్చెను, ఆయన యాన్ లీ అను ఒక స్త్రీ రూపములో కనిపించెను. వారు నీటి ద్వారా బాప్తిస్మము ఆవశ్యకమని పరిగణించలేదు. వారు వివాహమును తిరస్కరించిరి మరియు బ్రహ్మచర్యమునందు విశ్వాసముంచిరి. కొంతమంది షేకర్స్ మాంసము తినుటను కూడా నిషేధించిరి. ఈ బయల్పాటుకు ముందుమాటగా, జోసెఫ్ స్మిత్ చరిత్ర ఇలా ప్రకటించుచున్నది, “ఈ విషయముపై మరింత ఖచ్ఛితమైన అవగాహన కలిగియుండుట కొరకు, నేను ప్రభువును విచారించగా దీనిని పొందితిని.” షేకర్స్ సమూహము యొక్క కొన్ని ప్రాథమిక భావాలను ఈ బయల్పాటు తప్పుగా నిరూపించును. ఇంతకుముందు చెప్పబడిన సహోదరులు ఈ బయల్పాటు నకలును షేకర్స్ సమాజమునకు (ఒహైయోలోని క్లీవ్ లాండ్ సమీపములో) తీసుకొని వెళ్ళి, దానిని వారికి పూర్తిగా చదివి వినిపించిరి, కానీ అది తిరస్కరించబడినది.

1–7, క్రీస్తు రాకడ దినమును, గడియయు ఆయన వచ్చే వరకు తెలియకయుండును; 8–14, రక్షణ పొందుటకు మనుష్యులు పశ్చాత్తాపపడి, సువార్తను నమ్మి, విధులను పాటించవలెను; 15–16, వివాహము దేవునిచేత నియమించబడినది; 17–21, మాంసము తినుట ఆమోదించబడినది; 22–28, రెండవ రాకడకు ముందు సీయోను వర్ధిల్లును మరియు లేమనీయులు గులాబివలే వికసించుదురు.

1 నా సేవకులైన సిడ్నీ, పార్లీ, లేమన్ నా మాటను ఆలకించుడి; ఏలయనగా ఇదిగో, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు వెళ్ళి, మీరు పొందియున్న నా సువార్తను, మీరు పొందిన విధముగానే షేకర్స్ అనువారికి బోధించుడని నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను.

2 ఇదిగో, నేను చెప్పునదేమనగా, వారు సత్యమును కొంచెమే తెలుసుకొనవలెనని కోరుచున్నారు గాని పూర్తిగా కాదు, ఎందుకనగా వారు నా యెదుట యథార్థముగా లేరు మరియు వారు తప్పక పశ్చాత్తాపపడవలెను.

3 కాబట్టి, వారికి సువార్తను ప్రకటించుటకు నా సేవకులైన సిడ్నీ మరియు పార్లీ, మిమ్ములను నేను పంపుచున్నాను.

4 నా సేవకుడైన లేమన్ వారినుండి అతడు పొందినదాని ప్రకారము కాక, నా సేవకులైన మీరు బోధించబోవు దాని ప్రకారము అతడు వారితో తర్కించుటకు ఈ పనికి నియమించబడవలెను; ఆ విధముగా చేయుట వలన నేనతనిని దీవించెదను, అలా కానీయెడల అతడు సఫలముకాడు.

5 కాబట్టి ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు; ఏలయనగా నేను దేవుడను, లోక విమోచన కొరకు నా అద్వితీయ కుమారుని లోకములోనికి పంపితిని, ఆయనను అంగీకరించువాడు రక్షించబడును, ఆయనను అంగీకరించని వాడు శిక్షించబడును—

6 వారు తమకిష్టము వచ్చినట్లు మనుష్యుకుమారుని యెడల చేసిరి; ఆయన తన అధికారమును దేవుని మహిమ యొక్క కుడిపార్శ్వమందు తీసుకొని, ఇప్పుడు పరలోకములలో రాజ్యపరిపాలన చేయుచుండెను, తన శత్రువులను తన పాదముల క్రింద ఉంచుటకు దిగివచ్చువరకు రాజ్యపరిపాలన చేయును మరియు ఆ సమయము సమీపములోనున్నది—

7 దేవుడును, ప్రభువునైన నేను దీనిని సెలవిచ్చితిని; కానీ ఆ గడియయు, ఆ దినమును ఏమనుష్యుడును, పరలోకమందు దూతలైనను యెరిగియుండలేదు లేదా ఆయన వచ్చువరకు యెరుగరు.

8 కాబట్టి, నరులందరు పశ్చాత్తాపపడవలెనని నేను కోరుచున్నాను, ఏలయనగా నా కొరకు నేను ప్రత్యేకపరచియుంచిన పరిశుద్ధ మనుష్యులు తప్ప అందరును పాపములో ఉన్నారు, వారిని గూర్చి మీకు తెలియదు.

9 కాబట్టి, నేను చెప్పునదేమనగా ఆదినుండి ఉన్న నా నిత్య నిబంధనను మీ యొద్దకు పంపియున్నాను.

10 నేను వాగ్దానము చేసిన దానిని నేను నేరవేర్చియున్నాను మరియు భూజనులు దానియెదుట సాగిలపడుదురు; వారు తమకు తాముగా సాగిలపడని యెడల వారు తగ్గించబడుదురు, ఏలయనగా ఇప్పుడు ఏదైతే తనకుతాను హెచ్చించుకొనునో, అది బలవంతముగా తగ్గించబడును.

11 కాబట్టి, ఈ ప్రజల మధ్యకు వెళ్ళి, పేతురు అనబడు నా ప్రాచీన అపొస్తలుని వలే వారితో మీరు చెప్పవలెనని నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను:

12 ఆదియు అంతమునైయుండి, భూమిమీద నివసించిన మరియు భవిష్యత్తులో రావలసియున్న ప్రభువైన యేసు నామమందు నమ్మికయుంచుడి;

13 పశ్చాత్తాపపడి, పరిశుద్ధ ఆజ్ఞ ప్రకారము యేసు క్రీస్తు నామములో పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి;

14 ఎవరైతే దీనిని చేయుదురో వారు సంఘ పెద్దల హస్తనిక్షేపణము ద్వారా పరిశుద్ధాత్మ వరమును పొందెదరు.

15 మరలా, ఎవడైతే వివాహమును నిషేధించునో వాడు దేవునిచేత నియమించబడలేదు, ఏలయనగా వివాహము దేవునిచేత నియమించబడినదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

16 కాబట్టి, అతడు ఒక భార్యను కలిగియుండి, వారు ఏక శరీరమైయుండుట ధర్మము మరియు ఇదంతయు భూమి తన సృష్టి ధర్మమును నెరవేర్చుటకు నియమించబడెను.

17 తద్వారా లోకము రూపింపబడక మునుపు ఆయన సృష్టి ప్రకారము అది నరుల సంతానము చేత నింపబడును.

18 మనుష్యుడు మాంసము తినకూడదని ఎవడైతే దానిని తినకుండా నిషేధించునో, వాడు దేవునిచేత నియమించబడినవాడు కాదు;

19 ఏలయనగా ఇదిగో, మనుష్యుడు సమృద్ధిగా కలిగియుండునట్లు అడవి జంతువులును, ఆకాశ పక్షులును, భూమినుండి వచ్చు సమస్తమును అతని ఉపయోగము నిమిత్తము ఆహారము కొరకును, వస్త్రము కొరకును నియమించబడెను.

20 కానీ ఒక మనుష్యుడు మరియొకని కంటే ఎక్కువ కలిగియుండుటకు నియమించబడలేదు, కాబట్టి లోకము పాపములో నున్నది.

21 అవసరము లేకుండా జంతువుల రక్తమును చిందించి లేదా మాంసమును వృధా చేయు మనుష్యునికి శ్రమ.

22 మరలా, మనుష్యకుమారుడు ఒక స్త్రీ రూపములోనైనను లేదా భూమిమీద ప్రయాణించుచున్న పురుషునిగానైనను వచ్చుటలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

23 కాబట్టి మోసపోకుడి, కానీ పరలోకములు కదిలింపబడుటను, భూమి కంపించి, త్రాగుబోతు వలే ముందుకు వెనుకకు చుట్టివేయబడుటను, లోయలు ఎత్తగుటను, పర్వతములు లోయలగుటను, గరుకైన ప్రదేశములు చదునుగా మారుటను కనిపెట్టుచు స్థిరముగానుండి కొనసాగుడి—దేవదూత తన బూరను ఊదునప్పుడు ఇవన్నియు సంభవించును.

24 కానీ ప్రభువు యొక్క ఆ మహాదినము రాకమునుపు, యాకోబు అరణ్యములో వర్ధిల్లును మరియు లేమనీయులు గులాబి వలే వికసించుదురు.

25 సీయోను కొండలపై వర్ధిల్లును, పర్వతములపై సంతోషించును, నేను నియమించియున్న ప్రదేశమునకు కూడి వచ్చి సమావేశమగును.

26 ఇదిగో నేను మీతో చెప్పునదేమనగా, నేను మిమ్ములను ఆజ్ఞాపించినట్లుగా ముందుకు సాగుడి; మీ పాపములన్నింటి నిమిత్తము పశ్చాత్తాపపడుడి; అడుగుడి మీరు పొందుదురు; తట్టుడి మీకది తెరువబడును.

27 ఇదిగో, నేను మీకు ముందుగా వెళ్ళి, మీ వెనుకటి భాగమును కావలికాయును; నేను మీమధ్య నుందును మరియు మీరు సిగ్గుపరచబడరు.

28 ఇదిగో, నేను యేసు క్రీస్తును మరియు నేను త్వరగా వచ్చుచున్నాను. అలాగే జరుగును గాక. ఆమేన్.