లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 102


102వ ప్రకరణము

1834, ఫిబ్రవరి 17న కర్ట్‌లాండ్ నందు సంఘము యొక్క మొదటి ఉన్నత సలహామండలి సంస్థాపన సమావేశ ముఖ్యాంశములు. అసలు సమావేశ ముఖ్యాంశములు ఓర్సన్ హైడ్, ఆలీవర్ కౌడరీల చేత లిఖించబడినవి. ఆ మరుసటి దినము ప్రవక్త సమావేశ ముఖ్యాంశములను సరిదిద్దెను, అవి సంఘము యొక్క “ప్రధాన సలహామండలి యొక్క వ్యవస్థ మరియు రాజ్యాంగము” అని ప్రధాన సలహామండలిచేత ఏకగ్రీవముగా అంగీకరించబడెను. పన్నెండుమంది అపొస్తలుల సలహామండలి గురించి తెలియజేయు 30 నుండి 32 వచనములు, 1835లో ఈ ప్రకరణమును సిద్ధాంతము మరియు నిబంధనలలో ప్రచురణ కొరకు సిద్ధపరచినప్పుడు జోసెఫ్ స్మిత్ దర్శకత్వములో చేర్చబడినవి.

1–8, సంఘములో తలెత్తు ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుటకు ఒక ఉన్నత సలహామండలి నియమించబడినది; 9–18, వ్యాజ్యములు వినుటకు విధానములు ఇవ్వబడినవి; 19–23, సలహామండలి అధ్యక్షుడు నిర్ణయమును తెలుపును; 24–34, ఫిర్యాదు విధానము స్థిరపరచబడినది.

1 ఈ దినమున బయల్పాటు వలన జోసెఫ్ స్మిత్ జూ. గృహములో ఇరువది నాలుగు మంది ప్రధాన యాజకుల సాధారణ సలహామండలి కూడివచ్చి, క్రీస్తు సంఘపు ఉన్నత సలహామండలిని ఏర్పాటు చేయుట మొదలుపెట్టిరి, అది పన్నెండుమంది ప్రధాన యాజకులను, సందర్భానుసారముగా ఒకరు లేదా ముగ్గురు అధ్యక్షులను కలిగియుండవలెను.

2 సంఘములో తలెత్తు ముఖ్యమైన సమస్యలు, వాటికి కారణమగు ఇరువురి సంతృప్తి మేరకు అవి సంఘము వలన గాని, బిషప్పు సలహామండలి వలన గాని పరిష్కరించబడని వాటిని పరిష్కరించుటకు బయల్పాటు వలన ఉన్నత సలహామండలి నియమించబడినది.

3 సలహామండలి అంగీకారము చేత జోసెఫ్ స్మిత్ జూ., సిడ్నీ రిగ్డన్, ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ అధ్యక్షులుగా ఒప్పుకోబడిరి; ప్రధాన యాజకులు, జోసెఫ్ స్మిత్ సీ., జాన్ స్మిత్, జోసెఫ్ కో, జాన్ జాన్సన్, మార్టిన్ హారిస్, జాన్ ఎస్. కార్టర్, జెరెడ్ కార్టర్, ఆలీవర్ కౌడరీ, సామ్యుయెల్ హెచ్. స్మిత్, ఓర్సన్ హైడ్, సిల్వెస్టర్ స్మిత్, లూక్ జాన్సన్ సలహామండలి చేత ఏకగ్రీవముగా శాశ్వత సలహామండలిగా ఎన్నుకోబడిరి.

4 తరువాత పైన చెప్పబడిన సలహాదారులు వారి నియామకములను అంగీకరించిరో లేదోనని, ఆ స్థానములో పరలోక ధర్మశాస్త్రము ప్రకారము వారు పనిచేయుదురో లేదోనని అడుగబడిరి, దానికి వారందరు తమ నియామకములను అంగీకరించితిమని, తమపై క్రుమ్మరించబడు దేవుని కృపను బట్టి తమ స్థానములను పూరించెదమని సమాధానము చెప్పిరి.

5 సలహామండలిని ఏర్పరచిన వారు, పైన చెప్పబడిన సలహాదారులను నియమించుటలో సంఘ నామములో సంఘము కొరకు ఓటు వేసినవారి సంఖ్య నలుబది మూడు, వారెవరనగా: తొమ్మిదిమంది ప్రధాన యాజకులు, పదిహేడుమంది పెద్దలు, నలుగురు యాజకులు, పదమూడుమంది సభ్యులు.

6 పైన చెప్పబడిన ఏడుగురు సలహాదారులు లేదా క్రమముగా నియమించబడు వారి అనుచరులు లేకుండా పనిచేయుటకు ఉన్నత సలహామండలి అధికారము కలిగియుండలేదని ఓటువేసిరి.

7 ఈ ఏడుగురు, హాజరుకాని సలహాదారుల స్థానములో పనిచేయుటకు సమర్థులు మరియు యోగ్యులుగా వారు పరిగణించు ఇతర ప్రధాన యాజకులను నియమించుటకు అధికారమును కలిగియుందురు.

8 పైన చెప్పబడిన సలహాదారులలో ఏ ఒక్కరైనా మరణించుట, అపరాధము వలన స్థానము నుండి తొలగింపబడుట, లేదా ఈ సంఘ ప్రభుత్వపు అనుబంధము నుండి తొలగింపబడుట వలన ఏదైనా ఖాళీ ఏర్పడినప్పుడు, అది అధ్యక్షుడు లేదా అధ్యక్షుల సలహామేరకు భర్తీచేయబడును, సంఘము యొక్క నామములో పనిచేయుటకు, ఆ ఉద్దేశ్యము కొరకు పిలువబడిన ప్రధాన యాజకుల సాధారణ సలహామండలి అంగీకారము వలన మంజూరు చేయబడును అని ఓటు వేసిరి.

9 సలహామండలికి కూడా అధ్యక్షుడైన సంఘాధ్యక్షుడు బయల్పాటు వలన నియమించబడును, సంఘ అంగీకారము వలన అతని నిర్వహణయందు అంగీకరించబడును.

10 అతని స్థానము యొక్క గౌరవమును బట్టి అతడు సంఘ సలహామండలికి అధ్యక్షత్వము వహించవలెను; అతడు నియమించబడిన రీతిలోనే నియమించబడిన ఇద్దరు ఇతర అధ్యక్షులచేత సహకరింపబడుట అతని యొక్క విశేషాధికారము.

11 అతనికి సహకరించుటకు నియమించబడిన వారిలో ఒకరు లేదా ఇద్దరూ హాజరుకాని పక్షములో, సహకారి లేకుండా సలహామండలికి అధ్యక్షత్వము వహించుటకు అతనికి అధికారము కలదు; అతడు హాజరుకానీ పక్షములో, ఇతర అధ్యక్షులు అతనికి మారుగా ఇద్దరును లేదా ఎవరో ఒకరు అధ్యక్షత్వము వహించుటకు అధికారము కలదు.

12 క్రీస్తు సంఘపు ఉన్నత సలహామండలి క్రమముగా ఏర్పరచబడినప్పుడెల్లా, ఇంతకుముందున్న విధానమును బట్టి, అంకెలతో చీట్లు వేయుట, దానిని బట్టి మొదటి అంకెతో మొదలు పెట్టి ఆవిధముగా పన్నెండవ అంకె వరకు కొనసాగించుటకు పన్నెండుమందిలో ఎవరు మొదటగా మాట్లాడవలెనో నిర్ణయించుట పన్నెండుమంది సలహాదారుల బాధ్యతయైయుండును.

13 ఏ వ్యాజ్యమునైన పరిష్కరించుటకు ఈ సలహాసభ పిలువబడినప్పడు, పన్నెండుమంది సలహాదారులు అది కష్టమైనదో కాదో ఆలోచించవలెను; కానీయెడల, పైన వ్రాయబడిన క్రమములో సలహాదారులలో ఇద్దరు మాత్రమే దానిని గూర్చి మాట్లాడవలెను.

14 కానీ అది కష్టమైనదిగా భావించినయెడల, నలుగురు నియమించబడవలెను; మరింత కష్టమైనదైతే ఆరుగురు; కానీ ఎట్టిపరిస్థితులలోను ఆరుగురి కంటె ఎక్కువమంది మాట్లాడుటకు నియమించబడకూడదు.

15 నింద మోపబడినవానికి అన్ని సందర్భములలోను అవమానము లేదా అన్యాయము జరుగకుండా నివారించునట్లు చూచుటకు సలహామండలిలో సగము మందికి పైగా హక్కుకలదు.

16 సాక్ష్యమును, దాని యథార్థతను పరిశీలించిన తరువాత మాట్లాడుటకు నియమించబడిన సలహాదారులు సలహామండలి యెదుట వ్యాజ్యమును ప్రవేశపెట్టవలెను; ప్రతి మనుష్యుడు సమానత్వమును, న్యాయముననుసరించి మాట్లాడవలెను.

17 సరి సంఖ్యలను తీసిన సలహాదారులు, అవి 2, 4, 6, 8, 10, 12, నింద మోపబడినవాని తరఫున నిలబడి, అవమానమును, అన్యాయమును నివారించవలసిన వ్యక్తులు.

18 సాక్ష్యములు వినిన తరువాత వ్యాజ్యమును గూర్చి మాట్లాడుటకు నియమించబడిన సలహాదారులు తమ పరిశీలనలను ముగించిన తరువాత నిందారోపణ చేయువాడు, నింద మోపబడినవాడు అన్ని వ్యాజ్యములలో సలహామండలి యెదుట వారికొరకు వారు మాట్లాడుటకు విశేషాధికారమును కలిగియున్నారు.

19 సాక్ష్యములు వినిన తరువాత, సలహాదారులు, నిందారోపణ చేయువాడు, నింద మోపబడినవాడు మాట్లాడిన తరువాత, అధ్యక్షుడు వ్యాజ్యమును గూర్చి తాను గ్రహించిన దానిని బట్టి నిర్ణయమును తెలుపును, దానిని తమ ఓటు ద్వారా మంజూరు చేయమని పన్నెండుమంది సలహాదారులను అడుగును.

20 కానీ మాట్లాడకుండా ఉన్న మిగిలిన సలహాదారులు లేదా వారిలో ఒకరు సాక్ష్యములు, ప్రతివాదనలు వినిన తరువాత అధ్యక్షుని తీర్పులో తప్పిదమును కనుగొనిన యెడల, దానిని వారు తెలియజేయవచ్చును, ఆ వ్యాజ్యము పునఃపరిశీలనకు వచ్చును.

21 పునఃపరిశీలన తరువాత, వ్యాజ్యముపై ఏదైనా అదనపు సమాచారము తెలిసిన యెడల, దానికి అనుగుణముగా నిర్ణయము మార్చబడును.

22 కానీ అదనపు సమాచారము ఇవ్వబడని సందర్భములో, మొదటి నిర్ణయము నిలుచును, దానిని నిర్ణయించుటకు సలహామండలిలో అధిక భాగానికి అధికారము కలదు.

23 సిద్ధాంతము లేదా నియమమునకు సంబంధించి వివాదము తలెత్తినయెడల, సలహామండలి మనస్సులకు ఆ వ్యాజ్యము స్పష్టమగుటకు వ్రాతపూర్వకమైనది తగినంతగా లేనప్పుడు, అధ్యక్షుడు విచారించి ప్రభువు మనస్సును బయల్పాటు ద్వారా తెలుసుకొనవచ్చును.

24 వారు దూరములోనున్నప్పుడు, వివాదములు పరిష్కరించుటకు వివాద గుంపులు లేదా వారిలో ఎవరో ఒకరు మనవి చేసినప్పుడు, ఇప్పటివరకు చెప్పబడిన విధముగా సలహామండలిని పిలిచి, ఏర్పాటుచేయుటకు ప్రధాన యాజకులకు అధికారము కలదు.

25 ప్రస్తావించబడిన ప్రధాన యాజకుల సలహామండలి కొంతకాలము వరకు అటువంటి సలహామండలికి అధ్యక్షత్వము వహించుటకు వారి సమూహములో ఒకరిని నియమించుటకు అధికారమును కలిగియుందురు.

26 వారి తీర్మానముల ప్రతిని ఒక దానిని వారి నిర్ణయమునకు జతగానుండు సాక్ష్యము యొక్క పూర్తి వివరణతో వెంటనే సంఘ ప్రథమ అధ్యక్షత్వపు స్థానము యొక్క ఉన్నత సలహామండలికి పంపుట ప్రస్తావించబడిన సలహామండలి బాధ్యతయైయున్నది.

27 వివాద గుంపులు లేదా వారిలో ఎవరో ఒకరు ప్రస్తావించబడిన సలహామండలి నిర్ణయముతో సంతృప్తి చెందనియెడల, వారు సంఘ ప్రథమ అధ్యక్షత్వపు స్థానమందున్న ఉన్నత సలహామండలికి విన్నవించుకోవచ్చును, పునఃపరిశీలన చేయబడి, ఎటువంటి తీర్పు ఇవ్వబడనట్లుగా, ఇంతకుముందు వ్రాయబడిన విధానములో ఆ వ్యాజ్యమును నడిపించవలెను.

28 సంఘ విషయాలలో అత్యంత జఠిలమైన వ్యాజ్యములకు సుదూరములోనున్న ఈ ప్రధాన యాజకుల సలహామండలి పిలువబడవలెను; సహజమైన లేదా సాధారణమైన వ్యాజ్యము కొరకు అటువంటి సలహామండలిని పిలుచుట సరికాదు.

29 అటువంటి సలహామండలిని పిలుచుట అవసరమో లేదో చెప్పుటకు సుదూర ప్రాంతాలలో పర్యటించు లేదా నివాసముండు ప్రధాన యాజకులకు అధికారము కలదు.

30 ఉన్నత సలహామండలికి లేదా సుదూర ప్రాంతాలలో పర్యటించు ప్రధాన యాజకులకు, పన్నెండుమంది అపొస్తలులతో కూడిన పర్యటించు ఉన్నత సలహామండిలికి వారి నిర్ణయములలో వైవిధ్యము కలదు.

31 మొదటి నిర్ణయమునుండి ఒక ఆరోపణ చేయబడవచ్చును; కానీ చివరిదాని నుండి చేయబడదు.

32 అపరాధ విషయములో సంఘ ప్రధాన అధికారుల వలన చివరిది ప్రశ్నించబడగలదు.

33 సంఘ ప్రథమ అధ్యక్షత్వపు స్థానమందున్న అధ్యక్షుడు లేదా అధ్యక్షులు, ఆ ఆరోపణను దానితో జతచేయబడు సాక్ష్యములు, వాంగ్మూలములను పరిశీలించిన తరువాత ఆరోపించబడిన అటువంటి వ్యాజ్యము పునఃపరిశీలనకు న్యాయముగా అర్హమైనదో కాదో నిర్ణయించుటకు అధికారమును కలిగియున్నారని నిర్ణయించబడినది.

34 తరువాత పన్నెండుమంది సలహాదారులు ఎవరు ముందు మాట్లాడవలెనోనని చీట్లు లేదా ఓటు వేయుటకు ముందుకుసాగిరి, దాని ఫలితమే ఈ పేర్లు: 1, ఆలీవర్ కౌడరీ; 2, జోసెఫ్ కోయి; 3, సామ్యుయెల్ హెచ్. స్మిత్; 4, లూక్ జాన్సన్; 5, జాన్ ఎస్. కార్టర్; 6, సిల్వెస్టర్ స్మిత్; 7, జాన్ జాన్సన్; 8, ఓర్సన్ హైడ్; 9, జెరెడ్ కార్టర్; 10, జోసెఫ్ స్మిత్ సీ.; 11, జాన్ స్మిత్; 12, మార్టిన్ హారిస్.ప్రార్థన తరువాత సమావేశము వాయిదా వేయబడెను.

ఆలీవర్ కౌడరీ

ఓర్సన్ హైడ్,

గుమాస్తాలు