లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 24


24వ ప్రకరణము

1830 జూలై, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీలకు ఇవ్వబడిన బయల్పాటు. సంఘము ఏర్పాటు చేయబడి నాలుగు మాసములు గడువక మునుపే హింసలు తీవ్రమయ్యెను మరియు నాయకులు కొద్దికాలము ఏకాంతవాసములో రక్షణ పొందవలసివచ్చెను. ఈ సమయములో వారిని బలపరచుటకు, ప్రోత్సహించుటకు, బోధించుటకు ఈ మూడు బయల్పాటులు ఇవ్వబడినవి.

1–9, జోసెఫ్ స్మిత్ లేఖనములను అనువదించుటకు, ప్రకటించుటకు, వివరించుటకు పిలువబడెను; 10–12, ఆలీవర్ కౌడరీ సువార్తను ప్రకటించుటకు పిలువబడెను; 13–19, అద్భుతములు, శాపములు, ఒకని పాద ధూళిని దులిపివేయుట, సంచి లేదా జోలె లేకుండా వెళ్ళుట వంటి వాటికి సంబంధించిన ధర్మశాస్త్రము తెలియపరచబడినది.

1 ఇదిగో, మోర్మన్ గ్రంథమును వ్రాయుటకు మరియు నా పరిచర్యకు నీవు పిలువబడి, ఎన్నుకోబడితివి; నీ శ్రమల నుండి నేను నిన్ను లేవనెత్తియున్నాను, నీ శత్రువులందరి నుండి నీవు విడిపించబడునట్లు, సాతాను యొక్క అంధకార శక్తుల నుండి విడిపించబడునట్లు నీకు ఉపదేశించితిని!

2 అయినప్పటికీ, నీ అతిక్రమములకు నీవు బాధ్యుడవైయున్నావు; అయినను నీ మార్గమున వెళ్ళి, ఇకపై పాపము చేయకుము.

3 నీ స్థానమును ఘనపరచుము; నీవు నీ పొలములను విత్తి, వాటిని జాగ్రత్తపరచిన పిమ్మట, కొలిస్విల్లి, ఫేయెట్, మాంచెస్టర్‌లలోనున్న సంఘమునకు త్వరితముగా వెళ్ళుము, వారు నిన్ను బలపరిచెదరు; మరియు ఆత్మీయముగాను, ఐహికముగాను నేను వారిని దీవించెదను;

4 కానీ వారు నిన్ను చేర్చుకొనని యెడల, దీవెనకు బదులు శాపమును వారిపై నేను పంపెదను.

5 నా నామములో నీవు దేవునికి మొరపెట్టుచుండవలెను, ఆదరణకర్త ద్వారా నీకు ఇవ్వబోవు సంగతులను వ్రాయుచూ, సంఘమునకు లేఖనములన్నింటిని వివరించవలెను.

6 ఆ గడియలోనే నీవేమి మాట్లాడవలెనో, ఏమి వ్రాయవలెనో అవి నీకు ఇవ్వబడును మరియు వారు దానిని విందురు, లేదా దీవెనకు బదులు శాపమును నేను వారిపైకి పంపెదను.

7 నీ సేవనంతటిని నీవు సీయోనులో అర్పించవలెను; దీనియందు నీవు బలమును కలిగియుందువు.

8 శ్రమలలో సహనముగా నుండుము, ఏలయనగా నీకు అనేకము కలుగును; కానీ వాటిని సహించుము, ఇదిగో నీ దినములన్నియు గతించు వరకు నేను నీతోనున్నాను.

9 ఐహికమైన పనులలో నీవు బలమును కలిగియుండవు, ఏలయనగా అది నీ పిలుపు కాదు. నీ పిలుపును నెరవేర్చుము, నీ పిలుపును ఘనపరచుటకు, లేఖనములన్నింటిని వివరించుటకు, హస్తనిక్షేపణమును కొనసాగించుటకు మరియు సంఘములను నిర్ధారించుటకు నీకు కావలసిన వాటిని నీవు కలిగియుందువు.

10 నీ సహోదరుడైన ఆలీవర్ లోకము యెదుట, సంఘమునందు కూడా నా నామమును వహించుట కొనసాగించవలెను. నా పక్షమున కొంచెము చెప్పుట చాలునని అతడు తలంచరాదు; ఇదిగో, అంతము వరకు నేనతనితో ఉన్నాను.

11 బలహీనతలోనేమి, బలములోనేమి, చెరలోనేమి, విడుదలలోనేమి తనకుతానుగా కాదు గాని, నా యందే అతడు మహిమపొందును;

12 అన్ని వేళలా, అన్ని ప్రదేశములలో అతడు తన నోటిని విప్పి, రేయింబవళ్ళు బూరధ్వనివలె నా సువార్తను ప్రకటించవలెను. మనుష్యుల మధ్య తెలియనటువంటి బలమును నేనతనికిచ్చెదను.

13 నేనాజ్ఞాపించని యెడల దయ్యములను వెళ్ళగొట్టుట, రోగులను స్వస్థపరచుట, విష సర్పములనుండి, మరణకరమైన విషముల నుండి కాపాడుట తప్ప మరే ఇతర అద్భుతములను కోరవద్దు;

14 లేఖనములు నెరవేరునట్లు వీటిని పొందగోరువారు మిమ్ములను కోరితే తప్ప ఈ సంగతులను మీరు చేయకూడదు, ఏలయనగా వ్రాయబడిన దానిని బట్టి మీరు నడుచుకొనవలెను.

15 మీరు వెళ్ళు ఏ స్థలమందైనను నా నామమున వారు మిమ్ములను చేర్చుకొనని యెడల, వారిమీద సాక్ష్యముగా నుండుటకు మీ పాద ధూళిని దులిపివేసి, త్రోవ ప్రక్కన మీ కాళ్ళను కడుగుకొనుట ద్వారా దీవెనకు బదులు శాపమును మీరు విడిచిపెట్టవలెను.

16 హింసచేత ఎవరైనను మీకు హాని తలపెట్టిన యెడల, కొట్టబడవలెనని నా నామమున మీరు ఆజ్ఞాపించవలెను; ఇదిగో, నా అనుకూల సమయములో మీ మాటలను బట్టి వారిని నేను కొట్టెదను.

17 ఎవడైతే మీతో న్యాయస్థానమునకు వెళ్ళునో, వాడు న్యాయస్థానము చేత నిందింపబడును.

18 మీరు సంచినైనను, జోలెనైనను, చేతికఱ్ఱలైనను, రెండు అంగీలైనను తీసుకొని వెళ్ళకూడదు, ఏలయనగా ఆహారము, వస్త్రము, చెప్పులు, డబ్బు మరియు జోలెయైనను మీకేమి అవసరమో ఆ గడియలోనే సంఘము మీకిచ్చును.

19 చివరిసారిగా నా ద్రాక్షతోటను బాగా శుద్ధిచేసి, కత్తిరింపుతో తీర్చిదిద్దుటకు నీవు పిలువబడితివి; నీవు నియమించిన వారందరు కూడా ఈ విధానమును అనుసరించి చేయవలెను. ఆమేన్.