లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 36


36వ ప్రకరణము

1830, డిసెంబరు 9న, న్యూయార్క్‌లోని ఫేయెట్ సమీపమున ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ కివ్వబడిన బయల్పాటు. (35వ ప్రకరణ శీర్షిక చూడుము). ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ “పరిశుద్ధతకు మారుపేరని, ప్రభువు యొక్క గొప్ప మనుష్యులలో ఈయన ఒకరు” అని జోసెఫ్ స్మిత్ చరిత్ర తెలుపుచున్నది.

1–3, సిడ్నీ రిగ్డన్ చేతి ద్వారా ప్రభువు తన హస్తమును ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌పై ఉంచును; 4–8, సువార్తను, యాజకత్వమును పొందు ప్రతి మనుష్యుడు ముందుకు సాగి, ప్రకటించుటకు పిలువబడవలెను.

1 ఇశ్రాయేలు యొక్క శక్తిమంతుడు, దేవుడైన ప్రభువు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు: ఇదిగో, నా సేవకుడైన ఎడ్వర్డ్, నేను నీతో చెప్పునదేమనగా, నీవు ధన్యుడవు, నీ పాపములు క్షమించబడియున్నవి మరియు బూరధ్వనితో నా సువార్తను ప్రకటించుటకు నీవు పిలువబడియున్నావు;

2 నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్ చేతి ద్వారా నా హస్తమును నీపైనుంచెదను మరియు నీవు నా ఆత్మయైన పరిశుద్ధాత్మను అనగా ఆదరణకర్తను పొందెదవు, అతడు పరలోకరాజ్యమును గూర్చిన శాంతికరమైన విషయాలను నీకు తెలియజేయును;

3 హోసన్నా, సర్వోన్నతుడైన దేవుని నామము దీవించబడును గాక అని చెప్పుచూ గొప్ప స్వరముతో దీనిని నీవు ప్రకటించవలెను.

4 ఇప్పుడు మనుష్యులందరిని గూర్చి ఈ పిలుపును మరియు ఆజ్ఞను నేను నీకిచ్చుచున్నాను—

5 ఈ పిలుపును మరియు ఆజ్ఞను అంగీకరించుచు నా సేవకులైన సిడ్నీ రిగ్డన్, జోసెఫ్ స్మిత్ జూ., యెదుటకు వచ్చు వారందరు జనముల మధ్య నా నిత్యసువార్తను ప్రకటించుటకు నియమించబడి, ముందుకు పంపబడెదరు—

6 అగ్ని నుండి బయటకు వచ్చి, శరీరముతో మలినమైన వస్త్రములను అసహ్యించుకొనుచూ, మూర్ఖులైన ఈ తరమువారి నుండి మిమ్ములను మీరు రక్షించుకొనుడని చెప్పుచూ పశ్చాత్తాపమును ప్రకటించుము.

7 ఈ ఆజ్ఞ నా సంఘ పెద్దలకు ఇవ్వబడును, తద్వారా నేను చెప్పిన విధముగా ఏకమనస్కులై దీనిని హత్తుకొను ప్రతి మనుష్యుడు నియమించబడి, ముందుకు పంపబడును.

8 దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నేనే; కాబట్టి, మీ నడుములకు దట్టీ కట్టుకొనుము మరియు నేను నా దేవాలయమునకు అకస్మాత్తుగా వచ్చెదను. అలాగే జరుగును గాక. ఆమేన్.