లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 112


112వ ప్రకరణము

1837, జులై 23న కర్ట్‌లాండ్, ఒహైయోలో గొఱ్ఱెపిల్ల యొక్క పన్నెండుమంది అపొస్తలులను గూర్చి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా థామస్ బి. మార్ష్ నకు ఇవ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటు పెద్దలు హిబర్ సి. కింబల్ మరియు ఓర్సన్ హైడ్ ఇంగ్లాండ్‌లో మొట్టమొదటిసారిగా సువార్తను బోధించిన దినమున ఇవ్వబడినది. థామస్ బి. మార్ష్ ఈ సమయములో పన్నెండుమంది అపొస్తలుల సమూహమునకు అధ్యక్షుడు.

1–10, పన్నెండుమంది సమస్త జనములకు, ప్రజలకు సువార్తను పంపి, హెచ్చరిక స్వరమును ఎలుగెత్తి చాటవలెను; 11–15, వారు తమ సిలువను మోసుకొని, యేసు క్రీస్తును వెంబడించి, ఆయన గొఱ్ఱెలను మేపవలెను; 16–20, ప్రథమ అధ్యక్షత్వమును చేర్చుకొనువారు ప్రభువును చేర్చుకొనును; 21–29, చీకటి భూమిని కమ్మును, నమ్మి బాప్తిస్మము పొందినవారు మాత్రమే రక్షింపబడుదురు; 30–34, కాలముల సంపూర్ణ యుగము యొక్క తాళపుచెవులను ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది కలిగియుందురు.

1 నా సేవకుడవైన థామస్, ప్రభువు నీతో నిశ్చయముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను నీ ప్రార్థనలను వినియున్నాను; నీ సహోదరుల పక్షమున నీవు చేసిన దానములు నా యెదుట స్మరణకు వచ్చియున్నవి, వారు నా నామమును గూర్చి సాక్ష్యము చెప్పుటకు, దానిని విదేశాలలో సమస్త జనములు, వంశములు, భాషలు, ప్రజల మధ్యకు చేరవేయుటకు ఎన్నుకోబడి, నా సేవకుల ద్వారా నియమించబడిరి.

2 నీ హృదయమందు నీతో ఉన్న కొద్ది విషయముల పట్ల ప్రభువైన నేను ఆనందించుట లేదని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

3 అయినప్పటికీ, నిన్ను నీవు తగ్గించుకొంటివి గనుక నీవు హెచ్చింపబడుదువు; కాబట్టి, నీ పాపములన్నియు నీ యెడల క్షమించబడియున్నవి.

4 నా యెదుట సంతోషకర హృదయముతోనుండుము; నా నామమును గూర్చి నీవు అన్యజనులకు మాత్రమే కాక, యూదులకు కూడా సాక్ష్యమిచ్చెదవు; నా వాక్యమును నీవు భూదిగంతముల వరకు చేరవేయుదువు.

5 కాబట్టి నీవు ప్రతి ఉదయము, ప్రతి దినము వ్యాజ్యమాడుము, నీ హెచ్చరిక స్వరమును ముందుకు సాగనీయుము; రాత్రి సమీపించినప్పుడు, నీ ప్రసంగము వలన భూలోకవాసులను నిద్రించనియ్యకుము.

6 నీ నివాసము సీయోనులో తెలియపరచుము, నీ గృహమును తొలగించకుము: ఏలయనగా, ప్రభువైన నేను నా నామమును మనుష్యకుమారుల మధ్య ప్రచురించుటకు నీ కొరకు గొప్ప కార్యమును కలిగియున్నాను.

7 కాబట్టి, ఆ కార్యము కొరకు నీ నడుముకు దట్టీ కట్టుకొనుము. నీ పాదములకు జోళ్ళు తొడుగుకొనుము, ఏలయనగా నీవు ఎన్నుకోబడితివి, నీ మార్గము పర్వతముల మధ్య, అనేక జనముల మధ్య ఉండును.

8 నీ వాక్యముచేత పైనున్న వారు క్రిందకు తేబడుదురు, నీ వాక్యముచేత క్రిందున్న వారు హెచ్చింపబడుదురు.

9 నీ స్వరము అపరాధులకు గద్దింపుగానుండును; ఇతరులను గూర్చి చెడు మాట్లాడువాని నాలుక నీవు గద్దించినప్పుడు దాని చెడును విడిచిపెట్టును గాక.

10 నిన్ను నీవు తగ్గించుకొనుము; నీ దేవుడైన ప్రభువు నిన్ను చేయి పట్టుకొని నడిపించును, నీ ప్రార్థనలకు సమాధానమిచ్చును.

11 నీ హృదయమును నేనెరిగియున్నాను, నీ సహోదరులను గూర్చి నీ ప్రార్థనలను వినియున్నాను. ఇతరులనేకులపైన కంటే వారి యెడల ప్రేమ చూపించుటలో పక్షపాతిగానుండకుము, కానీ నీపైనున్నట్లు వారి యెడల ప్రేమ కలిగియుండుము; మనుష్యులందరి యెడల నా నామమును ప్రేమించు వారందరి యెడల నీ ప్రేమ అమితముగా ఉండవలెను.

12 నీ పన్నెండుమంది సహోదరుల కొరకు ప్రార్థించుము. నా నామము నిమిత్తము వారిని తీవ్రముగా మందలించుము, వారి పాపములన్నింటి నిమిత్తము వారు మందలించబడవలెను, నా నామము కొరకు నీవు నా యెదుట విశ్వాసముగానుండుము.

13 వారి శోధనలు, అనేక శ్రమల తరువాత, ఇదిగో ప్రభువైన నేను వారిని సమీపించెదను, వారు తమ హృదయాలను కఠినపరచుకొనక, నాకు వ్యతిరేకముగా తమ మెడలను బిరుసుగా చేసుకొనని యెడల, వారు పరివర్తన చెందుదురు మరియు నేను వారిని స్వస్థపరిచెదను.

14 ఇప్పుడు, నేను నీకు చెప్పునది పన్నెండుమందికి చెప్పుచున్నానని నీతో చెప్పుచున్నాను, అదేమనగా: లేచి నీ నడుముకు దట్టీ కట్టుకొనుము, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించుము, నా గొఱ్ఱెలను మేపుము.

15 నిన్ను నీవు హెచ్చించుకొనకుము; నా సేవకుడైన జోసెఫ్‌కు విరోధముగా తిరుగుబాటు చేయకుము: ఏలయనగా నేను అతనికి తోడుగానున్నాను, నా హస్తము అతనిపై ఉండునని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; అతనికిని, మీకును నేనిచ్చిన తాళపుచెవులు, నేను వచ్చువరకు అతని నుండి తీసుకొనబడవు.

16 నా సేవకుడవైన థామస్, పన్నెండుమందికి సంబంధించి విదేశాలలో సమస్త జనముల మధ్య నా రాజ్యపు తాళపుచెవులను కలిగియుండుటకు నేను ఎన్నుకొనిన మనుష్యుడవు నీవేనని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను—

17 తద్వారా నా సేవకుడు జోసెఫ్, నా సేవకుడు సిడ్నీ, నా సేవకుడు హైరం రాలేని స్థలములన్నింటిలో రాజ్యపు ద్వారములను తెరచుటకు నీవు నా సేవకునిగానుందువు;

18 ఏలయనగా కొంతకాలము కొరకు వారిపై నేను సంఘములన్నింటి భారము మోపియుంటిని.

19 కాబట్టి, వారు నిన్ను పంపు ఏ ప్రదేశమునకైనను నీవు వెళ్ళుము, నేను నీకు తోడుగానుందును; నా నామమును ఏ ప్రదేశములో నీవు ప్రకటించినను వారు నా వాక్యమును అంగీకరించునట్లు కార్యానుకూలమైన ఒక ద్వారము తెరువబడును.

20 నా వాక్యమును అంగీకరించువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నేను పంపియుండి, నా నామము నిమిత్తము నీకు సలహాదారులుగా నేను చేసిన ప్రథమ అధ్యక్షత్వములోని వారిని చేర్చుకొనును.

21 మరలా నేను చెప్పునదేమనగా, నీచేత సక్రమముగా సిఫార్సుచేయబడి అధికారమివ్వబడిన నీ సహోదరులైన పన్నెండుమంది స్వరముచేత నా నామమందు నీవు పంపు ఎవరైనను, నీవు వారిని పంపు ఏ జనముకైనను నా రాజ్యపు ద్వారమును తెరచుటకు శక్తిని కలిగియుందురు—

22 వారు నా యెదుట తగ్గించుకొని, నా వాక్యమునకు లోబడియుండి, నా ఆత్మ స్వరమును ఆలకించునంత వరకు కలిగియుందురు.

23 మరలా నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, భూమిపై చీకటి, జనుల మనస్సులపై చిమ్మ చీకటి కమ్మియున్నది, నా యెదుట సర్వశరీరులు చెడిపోయిన వారైయున్నారు.

24 భూలోక నివాసులపై ప్రతీకారము వేగముగా వచ్చుచున్నది, అది ఉగ్రత దినము, కాల్చివేయబడు దినము, దుఃఖపడి, ఏడ్చి, రోదించే నాశనకర దినము; సుడిగాలి వలే భూమి మీదకు అది వచ్చునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

25 నా మందిరములో అది మొదలగును, నా మందిరము నుండి అది ముందుకు వెళ్ళునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు;

26 వారిలో మొదటివారు మీ మధ్యనున్నవారగుదురని ప్రభువు సెలవిచ్చుచున్నాడు, వారు నా నామమును యెరుగుదుమని చెప్పుకొనిరి గాని యెరుగకయున్నారు, నా మందిరము నడుమ నాకు విరోధముగా దైవదూషణ చేసిరని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

27 కాబట్టి, ఈ ప్రదేశమందు నా సంఘ వ్యవహారముల గూర్చి మీకు మీరు అభ్యంతరపడకుండునట్లు చూచుకొనవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

28 కానీ నా యెదుట మీ హృదయాలు శుద్ధిచేసుకొనుడి; తరువాత మీరు సర్వలోకమునకు వెళ్ళి, నా సువార్తను పొందని ప్రతి జీవికి దానిని బోధించుడి;

29 నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మక బాప్తిస్మము పొందని వాడు నాశనమగును.

30 పన్నెండుమందైన మీకు మీ సలహాదారులుగా, మీ నాయకులుగా మీతో నియమింపబడిన ప్రథమ అధ్యక్షత్వమునకు కాలముల సంపూర్ణ యుగముగానున్న అంత్యదినముల కొరకు చివరి సారిగా ఈ యాజకత్వపు శక్తి ఇవ్వబడెను,

31 సృష్టి ఆరంభము నుండి ఏ సమయములోనైనా ఒక యుగమును పొందిన వారందరితో పాటు ఆ శక్తిని మీరు కలిగియున్నారు;

32 ఏలయనగా మీరు పొందిన యుగపు తాళపుచెవులు పరలోకము నుండి పంపబడి, పితరుల నుండి వచ్చినవని, అన్నిటికంటే చివరివైయున్నవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

33 ఇదిగో, మీ పిలుపు ఎంత గొప్పది! మీ హృదయాలను, మీ వస్త్రములను శుద్ధిచేసుకొనుడి, లేనియెడల ఈ తరము వారి రక్తమునకు మీరు ఉత్తరవాదులుగా ఉందురని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

34 నేను వచ్చువరకు విశ్వాసముగానుండుము, ఏలయనగా నేను త్వరగా వచ్చుచున్నాను; మరియు ప్రతి మనుష్యునికి తాను చేయు క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చుటకు నా బహుమానము నా యొద్దనున్నది. అల్ఫాయు ఓమెగయు నేనే. ఆమేన్.