లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 18


18వ ప్రకరణము

1829 జూన్‌, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీ, డేవిడ్ విట్మర్‌లకు ఇవ్వబడిన బయల్పాటు. ప్రవక్త తెలిపిన ప్రకారము, ఈ బయల్పాటు “ఈ అంత్యదినములలో పన్నెండుమంది అపొస్తలుల పిలుపు మరియు సంఘ నిర్మాణమునకు సంబంధించిన సూచనలను” తెలియజేసెను.

1–5, సంఘమును ఏవిధముగా నిర్మించవలెనో లేఖనములు చూపును; 6–8, లోకము పాపములో పండుచున్నది; 9–16, ఆత్మల విలువ గొప్పది; 17–25, రక్షణ పొందుటకు, మనుష్యులు క్రీస్తు నామమును తమపైకి తీసుకొనవలెను; 26–36, పన్నెండుమంది పిలుపు మరియు నియమిత కార్యము తెలియజేయబడినది; 37–39, ఆలీవర్ కౌడరీ, డేవిడ్ విట్మర్‌లు పన్నెండుమందిని వెదకవలెను; 40–47, రక్షణ పొందుటకు మనుష్యులు తప్పక పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొంది, ఆజ్ఞలను పాటించవలెను.

1 ఇదిగో ఇప్పుడు, నా సేవకుడవైన ఆలీవర్ కౌడరీ అను నీవు నా నుండి నేర్చుకొనుటకు కోరితివి గనుక, ఈ మాటలను నేను నీకిచ్చుచున్నాను:

2 అనేక సందర్భాలలో నీవు వ్రాసిన సంగతులు సత్యమని నా ఆత్మ ద్వారా నేను నీకు తెలియజేసితిని; కాబట్టి అవి సత్యమని నీకు తెలియును.

3 అవి సత్యమని నీకు తెలిసినయెడల, ఇదిగో, వ్రాయబడిన సంగతులపై ఆధారపడమని నేను నీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను;

4 ఏలయనగా వాటియందు నా సంఘ పునాది, నా సువార్త, నా బండను గూర్చిన అన్ని సంగతులు వ్రాయబడియున్నవి.

5 కాబట్టి, నా సువార్త, నా బండ యొక్క పునాదిమీద నీవు నా సంఘమును కట్టిన యెడల, నరకపు ద్వారములు నీ యెదుట నిలువనేరవు.

6 ఇదిగో, లోకము పాపములో పండుచున్నది; నరుల సంతానము అనగా అన్యజనులు, ఇశ్రాయేలు వంశస్థులు ఇరువురిని పశ్చాత్తాపమునకు తప్పక పురిగొల్పవలసియున్నది.

7 కాబట్టి, నేనతనికి ఆజ్ఞాపించియున్న దాని ప్రకారము నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. చేతుల మీదుగా నీవు బాప్తిస్మము పొందితివి గనుక, నేనతనికి ఆజ్ఞాపించియున్న దానిని అతడు నెరవేర్చెను.

8 ఇప్పుడు, నా స్వకీయ ఉద్దేశ్యమునకు నేనతనిని పిలిచినందున ఆశ్చర్యపోకుము, ఆ ఉద్దేశ్యము నేనెరుగుదును; కాబట్టి, నా ఆజ్ఞలు పాటించుటలో అతడు శ్రద్ధవహించిన యెడల, అతడు నిత్యజీవముతో దీవించబడును; అతని పేరు జోసెఫ్.

9 ఇప్పుడు ఆలీవర్ కౌడరీ, నేను నీతోను, డేవిడ్ విట్మర్‌తోను ఆజ్ఞాపూర్వకముగా మాట్లాడుచున్నాను; ఏలయనగా, ఇదిగో పశ్చాత్తాపపడమని అన్ని ప్రాంతములలోనున్న మనుష్యులందరిని నేనాజ్ఞాపించుచున్నాను; నేను నా అపొస్తలుడైన పౌలుతో మాట్లాడిన విధముగానే మీతోను మాట్లాడుచున్నాను, ఏలయనగా అతడు పిలువబడిన పిలుపుతోనే మీరును పిలువబడిరి.

10 దేవుని దృష్టిలో ఆత్మల విలువ గొప్పదని జ్ఞాపకముంచుకొనుము;

11 ఏలయనగా ఇదిగో, నీ విమోచకుడైన ప్రభువు శరీరమందు మరణమును సహించెను; కాబట్టి మనుష్యులందరు పశ్చాత్తాపపడి, ఆయన యొద్దకు వచ్చుటకు ఆయన మనుష్యులందరి బాధను సహించెను.

12 పశ్చాత్తాపము యొక్క షరతులపై మనుష్యులందరిని తన యొద్దకు తెచ్చుటకు మరణము నుండి ఆయన తిరిగి లేచెను.

13 పశ్చాత్తాపపడు ఆత్మయందు ఆయన ఆనందము ఎంత గొప్పది!

14 కాబట్టి, ఈ జనులకు పశ్చాత్తాపము ప్రకటించుటకు మీరు పిలువబడిరి.

15 మీరు మీ దినములన్నియూ పశ్చాత్తాపమును ప్రకటించుటకై పనిచేసి, నా యొద్దకు కేవలము ఒక్క ఆత్మను తెచ్చిన యెడల, అతనితో నా తండ్రి రాజ్యములో మీ ఆనందము ఎంత గొప్పదగును!

16 ఇప్పుడు, మీరు నా తండ్రి రాజ్యములోనికి నా యొద్దకు తెచ్చిన ఒక్క ఆత్మతో మీ ఆనందము గొప్పదైనప్పుడు, అనేక ఆత్మలను మీరు నా యొద్దకు తెచ్చిన యెడల మీ ఆనందము ఎంత గొప్పదగును!

17 ఇదిగో, మీరు మీ యొద్ద నా సువార్తను, నా బండను, నా రక్షణను కలిగియున్నారు.

18 మీరు పొందెదరని నమ్ముచు, విశ్వాసముతో నా నామమున తండ్రిని అడుగుడి, మీరు పరిశుద్ధాత్మను కలిగియుందురు, అతడు అవసరమైన అన్ని విషయములను మనుష్యులకు విశదపరచును.

19 మీకు విశ్వాసము, నిరీక్షణ, దాతృత్వము లేనియెడల, మీరేమియు చేయలేరు.

20 అపవాది సంఘము తప్ప ఏ సంఘమునకు విరోధముగా వ్యాజ్యమాడకుడి.

21 యేసు క్రీస్తు నామమును మీపై తీసుకొనుడి, సత్యమును గంభీరముగా ప్రకటించుడి.

22 ఎందరైతే యేసు క్రీస్తు అను నా నామమున బాప్తిస్మము పొంది, అంతము వరకు సహించెదరో, అట్టివారందరు రక్షింపబడెదరు.

23 ఇదిగో, యేసు క్రీస్తు అను నామము తండ్రి చేత ఇవ్వబడెను, మనుష్యుడు రక్షించబడుటకు మరే ఇతర నామము ఇవ్వబడలేదు;

24 కాబట్టి, తండ్రిచేత ఇవ్వబడిన నామమును మనుష్యులందరు తమపైకి తీసుకొనవలెను, ఏలయనగా ఆ నాముముచేతనే వారు అంత్యదినమున పిలువబడెదరు.

25 కాబట్టి, వారేనామము చేత పిలువబడెదరో వారికి తెలియని యెడల, నా తండ్రి రాజ్యములో వారు స్థానమును కలిగియుండలేరు.

26 ఇదిగో ఇప్పుడు అన్యజనులు, యూదులు ఇరువురికి నా సువార్తను ప్రకటించుటకు పిలువబడిన ఇతరులు కలరు;

27 అవును, వారు పన్నెండుమంది; పన్నెండుమంది నా శిష్యులుగా యుండెదరు, వారు తమపై నా నామమును తీసుకొందురు; ఆ పన్నెండుమంది ఎవరనగా, పూర్తి నిబద్ధతతో నా నామమును తమపై తీసుకొనుటకు కోరిక గలవారు.

28 వారు పూర్తి నిబద్ధతతో తమపై నా నామమును తీసుకొనుటకు కోరిన యెడల, ప్రతి ప్రాణికి నా సువార్తను ప్రకటించుటకు సమస్త లోకమునకు వెళ్ళుటకు వారు పిలువబడుదురు.

29 వ్రాయబడియున్నదాని ప్రకారము, వారే నా నామములో బాప్తిస్మమిచ్చుటకు నియమించబడిన వారైయున్నారు;

30 వ్రాయబడినది మీ యెదుటనే ఉన్నది; కాబట్టి, వ్రాయబడిన మాటలను బట్టి మీరు దానిని చేయవలెను.

31 ఇప్పుడు పన్నెండుమందియగు మీతో నేను మాట్లాడుచున్నాను—ఇదిగో, నా కృప మీకు చాలును; మీరు పాపము చేయక నా యెదుట యథార్థముగా నడుచుకొనవలెను.

32 ఇదిగో, మీలోనున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, మనుష్యులకు దేవుని పిలుపులు మరియు బహుమానములను బట్టి, నా సువార్తను ప్రకటించుటకు మరియు యాజకులను, బోధకులను నియమించుటకు నా చేత నియమించబడిన వారు మీరే.

33 మీ ప్రభువు, మీ దేవుడైన యేసు క్రీస్తు అను నేను దీనిని పలికితిని.

34 ఈ మాటలు మనుష్యుల నుండి లేదా మనుష్యుని నుండి వచ్చినవి కావు, కానీ నా నుండి వచ్చినవి; కాబట్టి, అవి మనుష్యుని నుండి వచ్చినవి కావని, నా నుండి వచ్చినవని మీరు సాక్ష్యము చెప్పవలెను;

35 ఏలయనగా వాటిని మీకు చెప్పునది నా స్వరమే; ఏలయనగా అవి నా ఆత్మ ద్వారా మీకివ్వబడినవి, నా శక్తి ద్వారా వాటిని మీరు ఒకరికొకరు చదువగలరు; నా శక్తి ద్వారా తప్ప వాటిని మీరు కలిగియుండలేరు;

36 కాబట్టి, నా స్వరమును వింటిరని, నా మాటలు తెలియునని మీరు సాక్ష్యము చెప్పగలరు.

37 ఇదిగో, నేను చెప్పిన కోరికను కలిగిన పన్నెండుమందిని వెదకు బాధ్యతను నేను ఆలీవర్ కౌడరీ, డేవిడ్ విట్మర్‌ అను మీకిచ్చుచున్నాను;

38 వారి కోరికలు, క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు.

39 మీరు వారిని కనుగొనిన తరువాత, వారికి ఈ సంగతులను మీరు చూపవలెను.

40 మీరు సాగిలపడి నా నామమున తండ్రిని ఆరాధించవలెను.

41 ఈ విధముగా చెప్పుచు లోకమునకు మీరు తప్పక ప్రకటించవలెను: మీరు తప్పక పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను;

42 ఏలయనగా పురుషులందరు, పురుషులు మాత్రమే కాక, స్త్రీలు, జవాబుదారీతనపు వయస్సుకు వచ్చిన పిల్లలు కూడా పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొందవలెను.

43 ఇప్పుడు, మీరు దీనిని పొందిన తరువాత, మీరు అన్ని విషయములలో నా ఆజ్ఞలను తప్పక పాటించవలెను;

44 అనేకుల పాపములను ఒప్పించుటకు, తద్వారా వారు పశ్చాత్తాపపడి, నా తండ్రి రాజ్యమునకు వచ్చుటకు మీ చేతి ద్వారా నరుల సంతానము మధ్య నేనొక ఆశ్చర్యకార్యము చేయుదును.

45 కాబట్టి, నేను మీకిచ్చు దీవెనలు అన్నిటికంటే ఉన్నతమైనవి.

46 మీరు దీనిని పొందిన తరువాత, మీరు నా ఆజ్ఞలను పాటించనియెడల నా తండ్రి రాజ్యములో మీరు రక్షించబడలేరు.

47 ఇదిగో, మీ ప్రభువు, మీ దేవుడు, మీ విమోచకుడైన యేసు క్రీస్తు అను నేను, నా ఆత్మ శక్తిచేత దీనిని పలికితిని. ఆమేన్.