లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 19


19వ ప్రకరణము

బహుశా 1829 వేసవిలో, న్యూయార్క్‌లోని మాంచెస్టర్‌లో జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. తాను వ్రాసిన చరిత్రలో ప్రవక్త దీనిని “మార్టిన్ హారీస్‌కు దేవుని నుండి వచ్చిన ఆజ్ఞయని, మనుష్యునిది కాదని, నిత్యుడగు దేవుని చేత ఇవ్వబడినదని” పరిచయము చేయును.

1–3, క్రీస్తు సర్వాధికారమును కలిగియున్నారు; 4–5, మనుష్యులందరు పశ్చాత్తాపపడవలెను లేదా శ్రమపడవలెను; 6–12, నిత్య శిక్ష అనగా దేవుని శిక్ష; 13–20, క్రీస్తు అందరి కొరకు శ్రమపడెను, తద్వారా వారు పశ్చాత్తాపపడిన యెడల శ్రమపడకయుందురు; 21–28, పశ్చాత్తాప సువార్తను ప్రకటించుము; 29–41, సంతోషకర సువర్తమానమును ప్రకటించుము.

1 అల్ఫాయు ఓమెగయు, ప్రభువైన క్రీస్తును నేనే; అవును, ఆదియును అంతమును మరియు లోక విమోచకుడను నేనే.

2 నేనెవరికి చెందియున్నానో ఆ తండ్రి నన్ను గూర్చి కలిగియున్న చిత్తమును నెరవేర్చి, పూర్తిచేసిన నేను—సమస్తమును నాకు లోబరచుకొనునట్లు దీనిని చేసియుండి—

3 తాను చేసిన క్రియలు మరియు పనులను బట్టి ప్రతి మనుష్యునికి తీర్పు తీర్చునప్పుడు లోకనివాసులపై నేను పంపబోవు ఆ అంతిమ గొప్ప తీర్పు దినమున, లోకాంతమున సాతాను మరియు అతని కార్యములను నాశనము చేయుటకు కూడా సమస్త అధికారమును నిలుపుకొనియున్నాను.

4 ప్రతి మనుష్యుడు తప్పక పశ్చాత్తాపపడవలెను లేదా శ్రమపడవలెను, ఏలయనగా దేవుడనైన నాకు అంతము లేదు.

5 కాబట్టి, నేను పంపబోవు తీర్పును రద్దుపరచను, కానీ నా ఎడమచేతి వైపున కనుగొనబడువారికి ఏడ్పును, రోదనయు, పండ్లు కొరుకు శ్రమలును కలుగును.

6 అయినప్పటికీ, ఈ వేదనకు అంతము లేదని వ్రాయబడలేదు కానీ, అంతము లేని వేదన అని వ్రాయబడెను.

7 మరలా, నిత్య పాపము అని వ్రాయబడెను; కాబట్టి నా నామము సంపూర్ణముగా మహిమపరచబడు వరకు నరుల సంతానము హృదయాలపై పనిచేయునట్లు ఇతర లేఖనముల కంటే ఇది ఎక్కువ స్పష్టముగా ఉన్నది.

8 కాబట్టి, ఈ మర్మమును నేను మీకు విశదపరచెదను, ఏలయనగా నా అపొస్తలుల వలే మీరును తెలుసుకొనుట యుక్తము.

9 మీరు నా విశ్రాంతిలో ప్రవేశించగలుగునట్లు ఈ విషయములో ఎన్నుకోబడిన మీ అందరితో ఒక్కటిగా మాట్లాడుచున్నాను.

10 ఇదిగో, దైవత్వమును గూర్చిన మర్మము ఎంత గొప్పది! నేను అంతము లేనివాడను, నా చేతినుండి ఇవ్వబడిన శిక్ష అంతము లేని శిక్ష, ఏలయనగా నా నామము అంతము లేనిది. కాబట్టి—

11 నిత్య శిక్ష అనగా దేవుని శిక్ష.

12 అంతములేని శిక్ష అనగా దేవుని శిక్ష.

13 కాబట్టి, పశ్చాత్తాపపడమని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను, నా నామమున జోసెఫ్ స్మిత్ జూ. చేతి ద్వారా నీవు పొందిన ఆజ్ఞలను పాటించుము;

14 నా సర్వోన్నత శక్తి ద్వారా వాటిని నీవు పొందితివి;

15 కాబట్టి పశ్చాత్తాపపడమని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను—పశ్చాత్తాపపడుము, లేనియెడల నా నోటి దండము చేత, నా ఉగ్రత చేత, నా కోపము చేత నేను నిన్ను కొట్టుదును, నీ బాధలు తీవ్రమగును—ఎంత తీవ్రమో నీవెరుగవు, ఎంత అధికమో నీవెరుగవు, అవును, భరించుట ఎంత కష్టమో నీవెరుగవు.

16 ఏలయనగా ఇదిగో, వారు పశ్చాత్తాపపడిన యెడల వారు శ్రమపడకుండునట్లు దేవుడనైన నేను అందరి కొరకు ఈ బాధలను భరించితిని;

17 కానీ వారు పశ్చాత్తాపపడని యెడల, నా వలే వారును శ్రమపడుదురు;

18 ఆ శ్రమ అందరికంటే గొప్పవాడను అనగా దేవుడనైన నన్ను బాధ వలన వణకి, ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారి, శరీరము, ఆత్మ శ్రమపడునట్లు చేసెను—ఆ చేదు గిన్నెనుండి త్రాగకుండా వెనుదిరగాలని నేను అనుకొంటిని—

19 అయినప్పటికీ, తండ్రికి మహిమ కలుగును గాక మరియు నేను త్రాగి, నరుల సంతానము కొరకైన సిద్ధపాటులను ముగించితిని.

20 కాబట్టి పశ్చాత్తాపపడమని నేను మరలా నిన్నాజ్ఞాపించుచున్నాను, లేనియెడల నా సర్వశక్తితో నేను నిన్ను తగ్గించెదను; నీవు నీ పాపములను ఒప్పుకొనవలెను, లేనియెడల నేను చెప్పిన ఈ శిక్షలను పొందెదవు, నా ఆత్మను నేను వెనుకకు తీసుకున్నప్పుడు కొద్దిగా—అనగా స్వల్ప పరిమాణములో వాటిని నీవు రుచి చూచియున్నావు.

21 పశ్చాత్తాపము తప్ప మరేమియు ప్రకటించవద్దని, నా యందు వివేకమైయున్నంత వరకు లోకమునకు ఈ సంగతులను చూపవద్దని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను.

22 ఏలయనగా వారిప్పుడు మాంసమును తినలేరు, కానీ వారు పాలను స్వీకరించవలెను; కాబట్టి, ఈ సంగతులను వారు తెలుసుకొనరాదు, లేనియెడల వారు నశించెదరు.

23 నా నుండి నేర్చుకొనుము, నా మాటలను వినుము; నా ఆత్మ యొక్క సాత్వికములో నడువుము మరియు నా యందు నీవు శాంతిని కలిగియుందువు.

24 నేనే యేసు క్రీస్తును; నా తండ్రి చిత్తప్రకారము వచ్చితిని మరియు ఆయన చిత్తమును నేను నేరవేర్చెదను.

25 మరలా, నీ పొరుగువాని భార్యను నీవు ఆశింపకూడదని, నీ పొరుగు వాని ప్రాణమును కోరకూడదని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను.

26 మరలా, నీ ఆస్థిని నీవు ఆశింపక, దేవుని వాక్యమును, సత్యమును కలిగియున్న మోర్మన్ గ్రంథమును ముద్రించుటకు ఉచితముగా దానిని ఇవ్వమని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను—

27 యూదులు, వారి యొక్క శేషమైన లేమనీయుల వద్దకు అది త్వరలో వెళ్ళునట్లు, తద్వారా వారు సువార్తను నమ్మి, ఇదివరకే వచ్చియున్న మెస్సీయ కొరకు వేచి చూడకయుండునట్లు అది అన్యజనులకు నా వాక్యమైయున్నది.

28 బయటకు వినిపించునట్లు అదే విధముగా నీ హృదయములో, లోకము యెదుట అదే విధముగా రహస్యముగా, బహిరంగముగా అదే విధముగా అంతరంగముగా నీవు ప్రార్థించవలెనని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను.

29 సంతోషకర సువర్తమానమును నీవు ప్రకటించవలెను, పర్వతములమీద, ప్రతి ఎత్తైన స్థలముమీద, నీవు చూచుటకు అనుమతించబడిన ప్రతి జనముల మధ్య దీనిని ప్రచురించుము.

30 జగడములాడు వారితో జగడములాడక, నా యందు నమ్మికయుంచి, దీనమనస్సుతో దీనిని నీవు చేయవలెను.

31 సంక్లిష్ట సిద్ధాంతములను గూర్చి నీవు మాట్లాడకూడదు, కానీ పశ్చాత్తాపము, రక్షకుని యెడల విశ్వాసము, బాప్తిస్మము ద్వారా మరియు అగ్ని అనగా పరిశుద్ధాత్మ ద్వారా పాపక్షమాపణను ప్రకటించవలెను.

32 ఇదిగో, ఈ సంగతిని గూర్చి నేను ఇవ్వబోవు ఆజ్ఞలలో ఇది గొప్పది మరియు చివరిది; ఏలయనగా నీ అనుదిన నడవడికలో, అనగా నీ జీవితాంతము వరకు ఇది సరిపోవును.

33 ఈ ఉపదేశములను నిర్లక్ష్యము చేసినయెడల నీవు దుఃఖమును పొందెదవు, నీవును, నీ ఆస్థియు నాశనమగును.

34 నీ ఆస్థిలో ఒక భాగమును అనగా నీ భూములలో భాగమును, నీ కుటుంబమునకు ఆధారమైనది తప్ప సమస్తమును ఇవ్వుము.

35 ముద్రణ కర్తతో నీవు ఒప్పందము చేసిన అప్పును చెల్లించుము. చెర నుండి నిన్ను నీవు విడిపించుకొనుము.

36 నీ కుటుంబమును నీవు చూచుటకు కోరినప్పుడు తప్ప నీ ఇంటిని, నీ గృహమును విడిచిపెట్టుము;

37 అందరితో నిస్సంకోచముగా మాట్లాడుము; భీకర స్వరముతో, సంతోషకర స్వరముతో—హోసన్నా, హోసన్నా, ప్రభువైన దేవుని నామము దీవించబడును గాక! అని బిగ్గరగా బోధించి, ఉద్భోధించుము, సత్యమును ప్రకటించుము.

38 ఎల్లప్పుడు ప్రార్థించుము, నేను నా ఆత్మను నీపై క్రుమ్మరించెదను మరియు నీ దీవెన గొప్పదగును—భూలోక నిధులను, వాటికి సమానమైన దుర్నీతిని నీవు పొందవలసియున్నను, వాటికంటె నీ దీవెన అధికముగానుండును.

39 ఇదిగో, నీ హృదయమునెత్తికొని, ఆనందించకుండా నీవు దీనిని చదువగలవా?

40 లేదా గ్రుడ్డి మార్గదర్శి వలే బహుదూరము వెళ్ళగలవా?

41 లేదా నీవు దీనునిగా, సాత్వీకునిగానుండి, నీకు నీవుగా నా యెదుట తెలివిగా ప్రవర్తించలేవా? నీ రక్షకుడైన నా యొద్దకు రమ్ము. ఆమేన్.