లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 20


20వ ప్రకరణము

సంఘ ఏర్పాటు మరియు ప్రభుత్వమును గూర్చి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో లేదా సమీపములో ఇవ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటులోని భాగాలు చాలా ముందుగా, అనగా 1829 వేసవిలో ఇవ్వబడియుండవచ్చును. ఆ కాలములో ప్రమాణాలు మరియు నిబంధనలుగా పరిచయమున్న పూర్తి బయల్పాటు 1830, ఏప్రిల్ 6 (సంఘము ఏర్పాటు చేయబడిన దినము) తరువాత వెంటనే లిఖించబడియుండవచ్చును. ప్రవక్త ఇలా వ్రాసెను, “ఆయన (యేసు క్రీస్తు) నుండి ప్రవచనము, బయల్పాటు ఆత్మ ద్వారా క్రింది వాటిని మేము పొందితిమి; అది మాకు చాలా సమాచారమును ఇచ్చుటయే కాక, ఆయన చిత్తము మరియు ఆజ్ఞ ప్రకారము ఒక నిర్ణీత దినమున మరియొకసారి ఇక్కడ ఈ భూమిపై ఆయన సంఘాన్ని ఏర్పాటు చేయుటలో ఏవిధముగా ముందుకు సాగాలో మాకు చూపెను.

1–16, కడవరి దిన కార్యపు దైవత్వమును మోర్మన్ గ్రంథము నిరూపించును; 17–28, సృష్టి, పతనము, ప్రాయశ్చిత్తము, బాప్తిస్మము యొక్క సిద్ధాంతములు రూఢిపరచబడెను; 29–37, పశ్చాత్తాపము, సమర్థింపు, శుద్ధిచేయబడుట, బాప్తిస్మములను నిర్దేశించు నియమములు వివరించబడినవి; 38–67, పెద్దలు, యాజకులు, బోధకులు, పరిచారకుల విధులు సంక్షిప్తపరచబడినవి; 68–74, సభ్యుల విధులు, పిల్లలను దీవించుట, బాప్తిస్మమిచ్చు విధానము తెలియజేయబడినవి; 75–84, సంస్కార ప్రార్థనలు, సంఘ సభ్యత్వమును నిర్దేశించు నియమములు ఇవ్వబడినవి.

1 మన ప్రభువును, రక్షకుడునైన యేసు క్రీస్తు శరీరమందు వచ్చి ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పది సంవత్సరములు కాగా, ఈ కడవరి దినములలో క్రీస్తు సంఘము ఉద్భవించి, దేవుని చిత్తము, ఆజ్ఞల చేత మన దేశ నియమాలకు అంగీకారమగు రీతిలో ఏప్రిల్‌గా పిలువబడు నాలుగవ నెల, ఆరవ తేదీన క్రమముగా ఏర్పాటు చేయబడి, స్థాపించబడెను—

2 దేవుని చేత పిలువబడి, ఈ సంఘ మొదటి పెద్దగా నుండుటకు యేసు క్రీస్తు అపొస్తలునిగా నియమింపబడిన జోసెఫ్ స్మిత్ జూ;

3 మరియు ఆలీవర్ కౌడరీకి ఈ ఆజ్ఞలు ఇవ్వబడెను, అతడు కూడా యేసు క్రీస్తు అపొస్తలునిగా దేవుని చేత పిలువబడి, ఈ సంఘపు రెండవ పెద్దగా అతని చేతి క్రింద నియమింపబడెను;

4 ఇది మన ప్రభువును, రక్షకుడునైన యేసు క్రీస్తు కృపను బట్టి జరిగెను, ఆయనకు ఇప్పుడును ఎల్లప్పుడును మహిమ కలుగును గాక. ఆమేన్.

5 అతని పాపములకు అతడు క్షమాపణ పొందెనని ఈ మొదటి పెద్దకు యథార్థముగా ప్రత్యక్షపరచబడిన తరువాత, అతడు మరలా వ్యర్థమైన లోకవిషయాలలో చిక్కుకొనెను;

6 కానీ పశ్చాత్తాపపడి, విశ్వాసము ద్వారా నిష్కపటముగా తననుతాను తగ్గించుకొనిన తరువాత, ఒక పరిశుద్ధ దేవదూత ద్వారా దేవుడు అతనికి పరిచర్య చేసెను, అతని స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రములు శుద్ధముగాను, సమస్త తెల్లదనమును మించి తెల్లగా నుండెను;

7 అతనికి ఆజ్ఞలనిచ్చెను, అవి అతడిని ప్రేరేపించెను;

8 ముందుగా సిద్ధపరచబడియున్న సాధనముల ద్వారా మోర్మన్ గ్రంథమును అనువదించుటకు ఉన్నతము నుండి అతనికి శక్తినిచ్చెను;

9 అది పతనమైన జనుల వృత్తాంతమును, యూదులకు, అన్యజనులకు యేసు క్రీస్తు సంపూర్ణ సువార్తను కలిగియున్నది;

10 అది ప్రేరేపణ వలన ఇవ్వబడెను, అది దేవదూతల పరిచర్య ద్వారా ఇతరులకు నిర్ధారించబడి, వారిచేత లోకమునకు ప్రకటించబడెను—

11 పరిశుద్ధ లేఖనములు సత్యమైనవని, దేవుడు మనుష్యులను ప్రేరేపించునని, ప్రాచీనకాల తరములలో వలే ఈ కాలములో, ఈ తరములో ఆయన పరిశుద్ధ కార్యమునకు వారిని పిలుచునని లోకమునకు అది నిరూపించుచున్నది;

12 తద్వారా ఆయన నిన్న, నేడు, నిరంతము ఒకే రీతిలో యున్నాడని చూపుచున్నది. ఆమేన్.

13 కాబట్టి, గొప్ప సాక్షులను కలిగియున్నందున, వారిచేత లోకము అనగా ఇకమీదట ఎంతమంది ఈ కార్యమును గూర్చి తెలుసుకొందురో వారందరు తీర్పుతీర్చబడుదురు.

14 దీనిని విశ్వాసముతో స్వీకరించి, నీతిని జరిగించువారు నిత్యజీవ కిరీటమును పొందెదరు;

15 కానీ ఎవరైతే అవిశ్వాసమువలన వారి హృదయాలను కఠినపరచుకొని, దీనిని తిరస్కరించెదరో, వారి శిక్షావిధికి అది కారణమగును—

16 ఏలయనగా ప్రభువైన దేవుడు దీనిని పలికెను; సంఘ పెద్దలమైన మేము ఉన్నత లోకమందున్న మహామహుని మాటలను విని సాక్ష్యము చెప్పుచున్నాము, ఆయనకే నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్.

17 ఈ సంగతులను బట్టి పరలోకమందు దేవుడున్నాడని, ఆయన అనంతమని, నిత్యుడైయున్నాడని, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మారక ఏకరీతిగా నుండు దేవుడని, భూమ్యాకాశములు, వాటిలో నున్న సమస్తమునకు రూపకర్తయని మేమెరుగుదుము;

18 అంతేకాక ఆయన నరులను పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించెను, ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున ఆయన వారిని సృష్టించెను;

19 జీవముగల ఏకైక సత్య దేవుడైన ఆయనను ప్రేమించి, సేవించాలని, వారు ఆరాధించవలసిన వ్యక్తిగా ఆయన మాత్రమే ఉండాలని వారికి ఆజ్ఞలనిచ్చెను.

20 కానీ ఈ పరిశుద్ధ నియమాలను అతిక్రమించుట ద్వారా మనుష్యుడు సుఖాసక్తి గలవానిగాను, అపవాది సంబంధిగాను మారి, పతనము చెందిన మనుష్యునిగా ఆయెను.

21 కాబట్టి, ఆయన ద్వారా ఇవ్వబడిన లేఖనములలో వ్రాయబడిన విధముగా సర్వశక్తిగల దేవుడు తన అద్వితీయ కుమారుడిని అనుగ్రహించెను.

22 ఆయన శోధనలను భరించెను, కానీ వాటిని లక్ష్యపెట్టలేదు.

23 ఆయన సిలువ వేయబడి, మరణించెను, మూడవ దినమున తిరిగి లేచెను;

24 తండ్రి కుడి పార్శ్వమున కూర్చొనుటకు, తండ్రి చిత్తప్రకారము సర్వశక్తితో పరిపాలించుటకు పరలోకమునకు ఆరోహణుడయ్యెను;

25 తద్వారా ఎవరైతే నమ్మి, ఆయన పరిశుద్ధ నామములో బాప్తిస్మము పొంది, విశ్వాసముతో అంతము వరకు సహించెదరో, వారందరు రక్షించబడుదురు—

26 మధ్యస్థకాలములో ఆయన శరీరధారియై వచ్చిన తరువాత ఎవరైతే నమ్మిరో వారు మాత్రమే కాక, ఆరంభము నుండి అందరు, అనగా ఆయన రాకమునుపు ఉన్న వారందరు, పరిశుద్ధాత్మ వరము వలన ప్రేరేపించబడగా పలికి, ఆయనను గూర్చి అన్ని సంగతులయందు యథార్థముగా సాక్ష్యము చెప్పిన పరిశుద్ధ ప్రవక్తల మాటలను ఎవరైతే నమ్మిరో వారందరు,

27 అంతేకాక ఇకమీదట వచ్చువారు, ఎవరైతే తండ్రిని గూర్చియు, కుమారుని గూర్చియు సాక్ష్యమిచ్చు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బహుమానములు మరియు పిలుపులను నమ్మెదరో వారు నిత్యజీవమును పొందవలెను;

28 ఆ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అంతము లేనివారై, అనంతమును, నిత్యమునైన ఏక దేవుడైయున్నారు. ఆమేన్.

29 మనుష్యులందరు యేసు క్రీస్తు యొక్క నామమందు నమ్మికయుంచి, తప్పక పశ్చాత్తాపపడవలెనని, ఆయన నామములో తండ్రిని ఆరాధించవలెనని, ఆయన నామమందు విశ్వాసముతో అంతము వరకు సహించవలెనని, లేనియెడల దేవుని రాజ్యములో వారు రక్షింపబడలేరని మేమెరుగుదుము.

30 మన ప్రభువును, రక్షకుడునైన యేసు క్రీస్తు కృప చేత నీతిమంతులుగా తీర్చబడుట న్యాయము, సత్యమని మేమెరిగియున్నాము;

31 వారి పూర్ణ శక్తులతో, మనస్సులతో, బలముతో దేవుని ప్రేమించు వారందరు, మన ప్రభువును, రక్షకుడునైన యేసు క్రీస్తు కృప వలన శుద్ధిచేయబడుట న్యాయము, సత్యమని కూడా మేమెరిగియున్నాము.

32 కానీ మనుష్యుడు కృపనుండి తొలగిపోయి, జీవముగల దేవుడిని విడిచిపోవు అవకాశము కలదు;

33 కాబట్టి సంఘము జాగ్రత్తపడి, ఎల్లప్పుడు ప్రార్థించవలెను, లేనియెడల వారు శోధనలో పడిపోవుదురు;

34 అవును, శుద్ధిచేయబడిన వారు కూడా జాగ్రత్తపడవలెను.

35 ఈ సంగతులు సత్యమని, యోహాను ప్రకటనల ప్రకారము యుండెనని, ఆయన గ్రంథములోని ప్రవచనములకు, పరిశుద్ధ లేఖనములకు, పరిశుద్ధాత్మ శక్తి మరియు బహుమానముల ద్వారా ఇక మీదట రాబోవు దేవుని యొక్క బయల్పాటులు, దేవుని స్వరము, లేదా దేవదూతల పరిచర్యకు దేనిని చేర్చక, దేనిని తీసివేయకయుండెనని మేమెరుగుదుము.

36 ప్రభువైన దేవుడు దీనిని సెలవిచ్చెను; మహిమ, ఘనత, ప్రభావము ఇప్పుడును, ఎల్లప్పుడును ఆయన పరిశుద్ధ నామమునకు కలుగును గాక. ఆమేన్.

37 మరలా, బాప్తిస్మ విధానమును గూర్చి సంఘమునకు ఆజ్ఞాపూర్వకముగా—ఎవరైతే దేవుని యెదుట తమనుతాము తగ్గించుకొని, బాప్తిస్మము పొందవలెనని కోరిక కలిగియుండి, విరిగిన హృదయము, నలిగిన ఆత్మతో వచ్చి, వారి పాపములన్నింటి నిమిత్తము వారు యథార్థముగా పశ్చాత్తాపపడిరని, అంతము వరకు ఆయనను సేవించుటకు దృఢ సంకల్పము కలిగియున్నారని, యేసు క్రీస్తు నామమును తమపై తీసుకొనుటకు సిద్ధముగాయున్నారని సంఘము యెదుట సాక్ష్యమిచ్చి, వారి పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు ఆత్మను పొందియున్నారని వారి క్రియల ద్వారా యథార్థముగా ప్రత్యక్షపరచిన యెడల, బాప్తిస్మము ద్వారా వారు ఆయన సంఘములోనికి స్వీకరించబడుదురు.

38 పెద్దలు, యాజకులు, బోధకులు, పరిచారకులు, క్రీస్తు యొక్క సంఘ సభ్యుల బాధ్యత—అపొస్తలుడు ఒక పెద్దయైయున్నాడు, బాప్తిస్మమిచ్చుట అతని పిలుపైయున్నది;

39 ఇతర పెద్దలు, యాజకులు, బోధకులు, పరిచారకులను నియమించుట;

40 క్రీస్తు యొక్క శరీరము, రక్తములకు చిహ్నములైన రొట్టె, ద్రాక్షారసమును నిర్వహించుట—

41 సంఘములో బాప్తిస్మము పొందిన వారిని లేఖనముల ప్రకారము పరిశుద్ధాత్మతోను, అగ్నితోను బాప్తిస్మమిచ్చుటకు హస్తనిక్షేపణము ద్వారా నిర్ధారించుట;

42 బోధించుట, వివరించుట, ఉద్భోధించుట, బాప్తిస్మమిచ్చుట, సంఘమును కావలికాయుట;

43 హస్తనిక్షేపణము ద్వారా సంఘమును నిర్ధారించుట, పరిశుద్ధాత్మనిచ్చుట;

44 అన్ని కూడికలను నడిపించుట అతని పిలుపైయున్నది.

45 పెద్దలు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడగా దేవుని ఆజ్ఞలు, బయల్పాటుల ప్రకారము కూడికలను నిర్వహించవలెను.

46 యాజకుల బాధ్యత యేమనగా ప్రకటించుట, బోధించుట, వివరించుట, ఉద్భోధించుట, బాప్తిస్మమిచ్చుట, సంస్కారమును నిర్వహించుట,

47 ప్రతి సభ్యుని గృహమును దర్శించి, బయటకు వినిపించునట్లుగాను రహస్యముగాను ప్రార్థించాలని, కుటుంబ బాధ్యతలన్నింటిని నెరవేర్చాలని వారికి ఉద్భోధించుట.

48 అతడు ఇతర యాజకులను, బోధకులను, పరిచారకులను కూడా నియమించవచ్చును.

49 పెద్ద ఎవరూ లేనప్పుడు అతడు కూడికలను నడిపించవలెను;

50 కానీ ఒక పెద్ద ఉన్నప్పుడు, అతడు ప్రకటించుట, బోధించుట, వివరించుట, ఉద్భోధించుట, బాప్తిస్మమిచ్చుట మాత్రమే చేయవలెను,

51 ప్రతి సభ్యుని గృహమును దర్శించి, బయటకు వినిపించునట్లుగాను రహస్యముగాను ప్రార్థించాలని, కుటుంబ బాధ్యతలన్నింటిని నెరవేర్చాలని వారికి ఉద్భోధించవలెను.

52 ఈ బాధ్యతలన్నింటిలో అవసరమైన సందర్భములో యాజకుడు పెద్దకు సహాయపడవలెను.

53 బోధకుని బాధ్యత యేమనగా, ఎల్లప్పుడు సంఘమును కావలికాయుట మరియు వారితో ఉండి బలపరచుట;

54 సంఘములో పాపమైనను, ఒకరితోనొకరు కఠినముగా ఉండుటయైనను, అబద్ధమాడుటయైనను, చాడీలు చెప్పుటయైనను, చెడుగా మాట్లాడుటయైనను లేకుండా చూచుట;

55 సంఘము తరచు కూడుకొనునట్లు చూచుట మరియు సంఘ సభ్యులందరు వారి బాధ్యతను నెరవేర్చులాగున చూచుట.

56 పెద్ద లేదా యాజకుడు లేనప్పుడు కూడికలను అతడు నడిపించవలెను—

57 సంఘములో అతని బాధ్యతలన్నింటిలో అవసరమైన సందర్భములో ఎల్లప్పుడు పరిచారకుని సహాయము పొందవలెను.

58 కానీ బోధకునికైనను, పరిచారకునికైనను బాప్తిస్మమిచ్చుటకు, సంస్కారమును నిర్వహించుటకు, లేదా హస్తనిక్షేపణము చేయుటకు అధికారము లేదు;

59 అయినప్పటికీ వారు హెచ్చరించి, వివరించి, ఉద్భోధించి, బోధించవలెను మరియు క్రీస్తునొద్దకు రమ్మని అందరిని ఆహ్వానించవలెను.

60 ప్రతి పెద్ద, యాజకుడు, బోధకుడు లేదా పరిచారకుడు అతని యెడల దేవుని బహుమానములు, పిలుపులను బట్టి నియమించబడవలెను; అతడిని నియమించు వానిలోనుండు పరిశుద్ధాత్మ శక్తి వలన అతడు నియమించబడవలెను.

61 ఈ క్రీస్తు సంఘమును రూపించు అనేక పెద్దలు మూడు మాసములకొకమారు సమావేశములో కలుసుకొనవలెను లేదా చెప్పబడిన సమావేశాలు నిర్దేశించిన లేదా నిర్ణయించిన ప్రకారము అప్పుడప్పుడు కలుసుకొనవలెను;

62 ఆ సమయములో చేయబడవలసిన అత్యవసరమైన సంఘ వ్యవహారములలో ఏదైనను చెప్పబడిన సమావేశాలలో చేయబడవలెను.

63 పెద్దలు వారి అనుమతి పత్రములను ఇతర పెద్దలనుండి, వారు చెందియుండిన సంఘము యొక్క ఓటు చేత లేదా సమావేశముల నుండి పొందవలెను.

64 ఒక యాజకుని చేత నియమించబడిన ప్రతి యాజకుడు, బోధకుడు, లేదా పరిచారకుడు, ఆ సమయములో అతని నుండి ఒక ధృవపత్రమును తీసుకొనవలెను లేదా అతడు దానిని ఒక సమావేశము నుండి పొందవచ్చును; ఆ ధృవపత్రము ఒక పెద్దకు ఇచ్చినప్పుడు, అది ఒక అనుమతి పత్రమునకు అతడిని అర్హునిగా చేయును, అది అతని పిలుపు యొక్క బాధ్యతలను నెరవేర్చుటకు అతనికి అధికారమిచ్చును.

65 సక్రమముగా ఏర్పాటు చేయబడిన సంఘము యొక్క శాఖ ఉన్నచోట సంఘము యొక్క ఓటు లేకుండా ఏ వ్యక్తి, ఏ స్థానమునకు నియమించబడకూడదు;

66 కానీ ఓటు అడుగుటకు సంఘము యొక్క శాఖ లేనప్పుడు అధ్యక్షత్వము వహించు పెద్దలు, ప్రయాణించు బిషప్పులు, ప్రధాన సలహాదారులు, ప్రధాన యాజకులు, పెద్దలు నియమించు అధికారమును కలిగియుండవచ్చును.

67 ప్రధాన యాజకత్వపు ప్రతి అధ్యక్షుడు (లేదా అధ్యక్షత్వము వహించు పెద్ద), బిషప్పు, ప్రధాన సలహాదారుడు, ప్రధాన యాజకుడు, ఉన్నత సలహామండలి లేదా సర్వసభ్య సమావేశ ఉత్తరువు చేత నియమించబడవలెను.

68 వారు బాప్తిస్మము ద్వారా స్వీకరించబడిన తరువాత సభ్యుల బాధ్యత—వారు సంస్కారములో పాలుపొందుటకు, పెద్దల హస్తనిక్షేపణము చేత నిర్ధారించబడుటకు ముందు అన్ని సంగతులు క్రమములో నుండునట్లు పెద్దలు లేదా యాజకులు క్రీస్తు సంఘమును గూర్చి వారికి అర్థమగురీతిలో అన్ని సంగతులను వివరించుటకు తగినంత సమయము కలిగియుండవలెను.

69 సభ్యులు సంఘము యెదుట, పెద్దల యెదుట దైవచిత్తానుసారమైన నడవడిక మరియు సంభాషణ చేత దానికి యోగ్యులని, ప్రభువు యెదుట పరిశుద్ధముగా నడుచుకొనుచూ పరిశుద్ధ లేఖనములకు అంగీకారముగానుండు క్రియలు, విశ్వాసము కలిగియున్నట్లు ప్రత్యక్షపరచవలెను.

70 పిల్లలను కలిగియున్న క్రీస్తు సంఘము యొక్క ప్రతి సభ్యుడు, సంఘము యెదుట పెద్దల యొద్దకు వారిని తీసుకొనిరావలెను, వారు యేసు క్రీస్తు నామములో వారిపై తమ చేతులుంచి, ఆయన నామములో వారిని దీవించవలెను.

71 దేవుని యెదుట లెక్క అప్పగించు వయస్సుకు సమీపించి, పశ్చాత్తాపమునకు సమర్థుడైతే తప్ప క్రీస్తు సంఘములోనికి ఏ ఒక్కరు స్వీకరించబడలేరు.

72 పశ్చాత్తాపపడిన వారందరికి ఈ దిగువ విధానములో బాప్తిస్మము నిర్వహించబడవలెను—

73 దేవుని చేత పిలువబడి, బాప్తిస్మమిచ్చుటకు యేసు క్రీస్తు నుండి అధికారము గల వ్యక్తి, బాప్తిస్మమునకు అతనికి అతనుగా లేదా ఆమెకు ఆమెగా హాజరైన వ్యక్తితో నీటిలోనికి దిగవలెను మరియు అతడిని లేదా ఆమెను పేరుతో పిలిచి ఈ విధముగా చెప్పవలెను: యేసు క్రీస్తు చేత నియమించబడియుండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నేను నీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. ఆమేన్.

74 తరువాత అతడు అతడిని లేదా ఆమెను నీటిలో ముంచి, తిరిగి నీటిలోనుండి బయటకు తీసుకొని రావలెను.

75 ప్రభువైన యేసు జ్ఞాపకార్థము రొట్టె, ద్రాక్షారసములో పాలుపొందుటకు సంఘము తరచు కూడుట ఆవశ్యకమైయున్నది;

76 పెద్ద లేదా యాజకుడు దీనిని నిర్వహించవలెను; ఈ విధముగా అతడు దీనిని నిర్వహించవలెను—సంఘముతో అతడు మోకరించి, హృదయపూర్వక ప్రార్థనలో ఇట్లు చెప్పుచూ తండ్రికి ప్రార్థన చేయవలెను:

77 ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, ఈ రొట్టెను దానిలో పాలుపొందుచున్న వారందరి ఆత్మల కొరకు ఆశీర్వదించి, పరిశుద్ధపరచమని మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో మిమ్ములను అడుగుచున్నాము; తద్వారా మీ కుమారుని శరీరము యొక్క జ్ఞాపకార్థము వారు దానిని తిని, ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, వారు మీ కుమారుని నామమును తమపై తీసుకొనుటకు, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు, ఆయన వారికిచ్చిన ఆయన ఆజ్ఞలను పాటించుటకు సమ్మతించుచున్నామని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక, తద్వారా వారు ఎల్లప్పుడు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు గాక. ఆమేన్.

78 ద్రాక్షారసమును నిర్వహించు విధానము—అతడు గిన్నెను తీసుకొని, ఇట్లు చెప్పవలెను:

79 ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, ఈ ద్రాక్షారసమును దానిని త్రాగుచున్న వారందరి ఆత్మల కొరకు ఆశీర్వదించి, పరిశుద్ధపరచమని మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో మిమ్ములను అడుగుచున్నాము; తద్వారా వారి కొరకు చిందించబడిన మీ కుమారుని రక్తము యొక్క జ్ఞాపకార్థము వారు దానిని చేసి, ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, వారు ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొందురని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక, తద్వారా వారు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు గాక. ఆమేన్.

80 అతిక్రమము చేయుచున్న లేదా తప్పిదములో పట్టుకొనబడిన క్రీస్తు సంఘము యొక్క ఏ సభ్యునితోనైనా లేఖనములు నిర్దేశించు విధముగా వ్యవహరించవలెను.

81 సంఘ పెద్దల చేత నిర్వహించబడు అనేక సమావేశాలకు హాజరగుటకు వారి బోధకులలో ఒకరు లేదా ఎక్కువ మందిని పంపుట క్రీస్తు సంఘమును ఏర్పరచు అనేక సంఘాల బాధ్యతయగును,

82 గత సమావేశము నుండి సంఘముతో ఏకమగుచున్న అనేకమంది సభ్యుల పేర్ల జాబితాను వారితో పంపవలెను; లేదా ఎవరో ఒక యాజకుని ద్వారా పంపవలెను; తద్వారా సంఘ సభ్యులందరి పేర్లతో కూడిన క్రమ పట్టిక ఇతర పెద్దలు అప్పుడప్పుడు నియమించు పెద్దలలో ఒకరి చేత ఒక పుస్తకములో ఉంచబడవచ్చును;

83 ఎవరైనా సంఘమునుండి బహిష్కరించబడిన యెడల, సంఘ సభ్యుల పేర్ల ప్రధాన గ్రంథము నుండి తొలగించబడునట్లు వారి పేర్లను కూడా తీసుకురావలెను.

84 వారు నివసించుచున్న ప్రదేశములోని సంఘము నుండి స్థానాంతరము చెందుచున్న సంఘ సభ్యులందరు, వారెవరో తెలియని సంఘ శాఖకు వెళ్ళుచున్నట్లైతే, వారు క్రమముగా వచ్చు సభ్యులని, మంచి స్థానమును కలిగియున్నారని ధృవపరచు ఒక లేఖను తీసుకొని వెళ్ళవలెను, లేఖను పొందు సభ్యుడు ఒక పెద్ద లేదా ఒక యాజకునితో వ్యక్తిగతముగా సాన్నిహిత్యము కలిగియున్న యెడల, ఆ పెద్ద లేదా యాజకునిచేత ఆ ధృవపత్రము సంతకము చేయబడవచ్చును లేదా సంఘ బోధకులు లేదా పరిచారకుల చేత అది సంతకము చేయబడవచ్చును.