లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 27


27వ ప్రకరణము

1830 ఆగష్టు, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కివ్వబడిన బయల్పాటు. సంస్కారపు రొట్టె, ద్రాక్షారసము నిర్వహించవలసియున్న ఒక మత కూడికకు సిద్ధపాటుగా జోసెఫ్ ద్రాక్షారసము కొనుటకు బయలుదేరెను. అతడు ఒక పరలోక దూత చేత దర్శింపబడి ఈ బయల్పాటును పొందెను, దానిలో కొంతభాగము ఆ సమయములో, తరువాత మిగిలినది సెప్టెంబరు మాసములో వ్రాయబడెను. సంఘ సంస్కార కూడికలలో ఇప్పుడు ద్రాక్షారసమునకు బదులు నీరు వాడబడుతుంది.

1–4, సంస్కారములో పాలుపొందుటకు ఉపయోగించవలసిన చిహ్నములు వివరించబడినవి; 5–14, క్రీస్తు మరియు అన్ని యుగములలోనున్న ఆయన సేవకులు సంస్కారములో పాలుపొందవలెను; 15–18, దేవుని సర్వాంగకవచమును ధరించుకొనుము.

1 నీ విమోచకుడు, నీ దేవుడు, నీ ప్రభువునైన యేసు క్రీస్తు స్వరమును ఆలకించుము, ఆయన వాక్యము జీవము గలదియు, శక్తివంతమునైయున్నది.

2 ఇదిగో నేను సెలవిచ్చునదేమనగా—మీరు సంస్కారమందు పాలుపంచుకొనినప్పుడు మీ కొరకు నలుగగొట్టబడిన నా శరీరమును, మీ పాపక్షమాపణ నిమిత్తము చిందించబడిన నా రక్తమును తండ్రియందు జ్ఞాపకము చేసుకొనుచూ నా మహిమయే లక్ష్యముగా మీరు దానిని చేసిన యెడల మీరు దేనిని తిందురో, దేనిని త్రాగుదురో అనునది ప్రాముఖ్యము కాదు.

3 కాబట్టి, నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా మీ శత్రువుల యొద్ద ద్రాక్షారసమైనను, మత్తుపానీయములైనను మీరు కొనరాదు.

4 కాబట్టి మీ మధ్య, అనగా భూమిమీద నిర్మించబడు నా తండ్రి రాజ్యములో అది నూతనముగా తయారు చేయబడితే తప్ప మీరు దేనిలోను పాలుపొందకూడదు.

5 ఇదిగో, ఇది నా యందు వివేకమైయున్నది; కాబట్టి ఆశ్చర్యపడకుడి, ఏలయనగా భూమిమీద నేను మీతోను, మొరోనైతోను ద్రాక్షారసమును త్రాగు గడియ వచ్చును; నా నిత్య సువార్తను కలిగియున్న మోర్మన్ గ్రంథమును బయలుపరచుటకు నేను అతడిని పంపితిని మరియు ఎఫ్రాయిము కఱ్ఱతునక వృత్తాంతపు తాళపుచెవులను నేను అతడికి అప్పగించితిని;

6 లోకము ప్రారంభమైనప్పటి నుండి కడవరి దినములను గూర్చి పరిశుద్ధ ప్రవక్తలందరి నోటిచేత చెప్పబడిన అన్ని విషయముల పునఃస్థాపనను నెరవేర్చుటకు నేను తాళపుచెవులను అప్పగించిన ఏలీయాతోను;

7 జెకర్యా కుమారుడగు యోహానుతోను; ఆ జెకర్యాను అతడు (ఏలీయా) దర్శించి అతనికి కుమారుడు కలుగునని, అతనికి యోహాను అని పేరు పెట్టబడునని, ఏలీయా ఆత్మతో అతడు నింపబడునని వాగ్దానమిచ్చెను;

8 మీరు పొందిన మొదటి యాజకత్వమునకు మిమ్ములను నియమించుటకు, తద్వారా అహరోను వలే మీరును పిలువబడి, నియమించబడుటకు ఆ యోహానును నా సేవకులైన జోసెఫ్ స్మిత్ జూ. మరియు ఆలీవర్ కౌడరీ అనబడు మీ యొద్దకు పంపితిని;

9 భూమి అంతయు శపించబడకుండునట్లు, తండ్రుల ఆత్మలను పిల్లల తట్టును, పిల్లల ఆత్మలను తండ్రుల తట్టును త్రిప్పుటకు శక్తినిచ్చు తాళపుచెవులను నేను ఇచ్చిన ఏలీయాతోను;

10 వారివలన వాగ్దానములు నిలిచియున్న మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు,యోసేపులతోను;

11 అందరికి తండ్రి, రాకుమారుడు, మహావృద్ధుడైన మిఖాయేలు లేదా ఆదాముతోను;

12 మరియు పేతురు, యాకోబు, యోహానులతోను; వారిని నేను మీ యొద్దకు పంపితిని, మీ పరిచర్య యొక్కయు నేను వారికి బయలుపరచిన సంగతుల యొక్కయు తాళపుచెవులను కలిగియుండుటకు మరియు అపొస్తలులుగా, నా నామమునకు ప్రత్యేక సాక్షులుగా ఉండుటకు వారిచేత నేను మిమ్ములను నియమించి, నిర్ధారించితిని;

13 వారికి నా రాజ్యపు తాళపుచెవులను, అంతిమ కాలముల కొరకు మరియు కాలముల సంపూర్ణత కొరకు సువార్త యుగమును అప్పగించితిని, దానిలో పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని అన్నిటిని ఒకటిగా పోగుచేయుదును;

14 మరియు ఈ లోకములో నా తండ్రి నాకు ఇచ్చిన అందరితోనూ త్రాగుదును.

15 కాబట్టి, మీ హృదయములను పైకెత్తుకొని సంతోషించుడి, మీ నడుములకు దట్టికట్టుకొని, ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకు నా సర్వాంగకవచమును ధరించుకొనుడి.

16 ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టికట్టుకొని, నీతియను కవచము తొడుగుకొని, మీకు అప్పగించుటకు నేను నా దూతలను పంపిన సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడును మీ పాదములకు తొడుగుకొని నిలువబడుడి;

17 విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు;

18 రక్షణయను శిరస్త్రాణమును, మీపై నేను క్రుమ్మరించబోవు నా ఆత్మయను ఖడ్గమును, నేను మీకు బయలుపరచు నా వాక్యమును తీసుకొని, నన్ను అడుగు సమస్తమైన వాటియందు ఏకీభవించి, నేను వచ్చువరకు విశ్వాసముగా నుండుడి, నేనెక్కడ యుందునో అక్కడ మీరును ఉండునట్లు మీరు కొనిపోబడుదురు. ఆమేన్.