లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 31


31వ ప్రకరణము

1830 సెప్టెంబరులో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా థామస్ బి. మార్ష్‌కివ్వబడిన బయల్పాటు. సంఘ సమావేశము జరిగిన వెంటనే ఈ బయల్పాటు ఇవ్వబడినది (30వ ప్రకరణ శీర్షిక చూడుము). థామస్ బి. మార్ష్ ఆ నెల ఆరంభములో బాప్తిస్మము పొందెను మరియు ఈ బయల్పాటు ఇవ్వబడకముందు సంఘములో ఒక పెద్దగా నియమించబడియుండెను.

1–6, థామస్ బి. మార్ష్ సువార్తను ప్రకటించుటకు పిలువబడెను మరియు అతని కుటుంబ శ్రేయస్సు గూర్చి అభయమివ్వబడెను; 7–13, సహనముగా ఉండమని, ఎల్లప్పుడు ప్రార్థించమని, ఆదరణకర్తను వెంబడించమని అతనికి ఉపదేశించబడెను.

1 నా కుమారుడా, థామస్, నా కార్యమందు నీకున్న విశ్వాసమును బట్టి నీవు ధన్యుడవు.

2 ఇదిగో, నీ కుటుంబము వలన నీకు అనేక శ్రమలు కలిగెను; అయినప్పటికీ, నేను నిన్ను, నీ కుటుంబమును, నీ చిన్నారులను దీవించెదను; వారు నమ్మి, సత్యమును తెలుసుకొని, నా సంఘములో నీతో ఏకమగు దినము వచ్చును.

3 నీ హృదయమును పైకెత్తుకొని సంతోషించుము, ఏలయనగా నీ పరిచర్య గడియ వచ్చియున్నది; నీ నాలుక సడలించబడును మరియు ఈ తరమునకు నీవు సంతోషకరమైన సువర్తమానమును ప్రకటించెదవు.

4 నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. కు బయలుపరచబడిన సంగతులను నీవు ప్రకటించెదవు. ఈ సమయము నుండి నీవు ప్రకటించుటకు, తెల్లబారి కాల్చబడుటకు సిద్ధముగానున్న పొలములో కోయుట మొదలుపెట్టెదవు.

5 కాబట్టి, నీ పూర్ణాత్మతో నీ కొడవలిని వాడుము, నీ పాపములు క్షమించబడియున్నవి, నీ వీపుపై పనలను నీవు మోసుకొనిపోవుదువు, ఏలయనగా పనివాడు తన జీతమునకు పాత్రుడు. కాబట్టి, నీ కుటుంబము జీవించును.

6 ఇదిగో, వారినుండి కొద్దికాలము మాత్రమే దూరముగా వెళ్ళి, నా సువార్తను ప్రకటించుము మరియు నేను వారికి నివాస స్థలమును సిద్ధపరిచెదను.

7 అవును, మనుష్యుల హృదయాలను నేను తెరిచెదను మరియు వారు నిన్ను చేర్చుకొందురు. నీ ద్వారా నేనొక సంఘమును స్థాపించెదను;

8 నీవు వారిని బలపరచి, వారు సమకూర్చబడే దినము కొరకు వారిని సిద్ధపరచవలెను.

9 శ్రమలయందు నీవు సహనము కలిగియుండుము, దూషించు వారిని నీవు దూషించకుము. సాత్వికముతో నీ గృహమును నిర్వహించి, నిలకడగా ఉండుము.

10 ఇదిగో, నీవు సంఘమునకే వైద్యునిగానుందువు, కానీ లోకమునకు కాదు, ఏలయనగా వారు నిన్ను చేర్చుకొనరు.

11 నేనెక్కడికి వెళ్ళమందునో అక్కడికి నీవు వెళ్ళుము, నీవేమి చేయవలెనో, నీవెక్కడికి వెళ్ళవలెనో అది ఆదరణకర్త ద్వారా నీకివ్వబడును.

12 ఎల్లప్పుడు ప్రార్థించుము, లేనియెడల నీవు శోధనలోనికి ప్రవేశించి నీ బహుమానమును కోల్పోయెదవు.

13 అంతము వరకు విశ్వాసముగానుండుము, ఇదిగో, నేను నీతో ఉన్నాను. ఈ మాటలు మనుష్యులనుండి లేదా మనుష్యుని నుండి వచ్చినవి కావు, కానీ తండ్రి చిత్తము వలన నీ విమోచకుడైన యేసు క్రీస్తు, అనగా నా నుండి వచ్చినవి. ఆమేన్.