లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 38


38వ ప్రకరణము

1831 జనవరి 2న, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. సందర్భము—సంఘ సమావేశము.

1–6, క్రీస్తు సమస్తమును సృష్టించెను; 7–8, ఆయన తన పరిశుద్ధుల మధ్యనున్నారు, వారు త్వరలో ఆయనను చూచెదరు; 9–12, సమస్తశరీరులు ఆయన యెదుట చెడిపోయిరి; 13–22, తన పరిశుద్ధుల కొరకు ఒక వాగ్దానదేశమును ఈ లోకములోను, నిత్యత్వములోను ఆయన ముందుగా సిద్ధపరచియుండెను; 23–27, పరిశుద్ధులు ఒకటిగానుండి, ఒకరినొకరు సహోదరులుగా యెంచాలని ఆజ్ఞాపించబడిరి; 28–29, యుద్ధములు ముందుగా చెప్పబడెను; 30–33, పరిశుద్ధులకు ఉన్నతమైన దానినుండి శక్తి ఇవ్వబడవలెను మరియు వారు సమస్త జనముల మధ్యకు వెళ్ళవలెను; 34–42, బీదలను, అవసరతలో ఉన్నవారిని లక్ష్యపెట్టవలెనని, నిత్యత్వపు నిధులను వెదకవలెనని సంఘము ఆజ్ఞాపించబడెను.

1 దేవుడైన మీ ప్రభువు, ఘనమైన ఉన్నవాడు, అల్ఫాయు ఓమెగయు, ఆదియు అంతమును, లోకము రూపింపబడక మునుపే నిత్యత్వపు విశాలములను, పరలోకపు సెరాపు సైన్యములను చూచిన ఆయనే అనగా యేసు క్రీస్తు, ఈలాగు సెలవిచ్చుచున్నాడు;

2 అన్ని సంగతులను యెరిగిన వాడను నేనే, ఏలయనగా నా కన్నుల యెదుటనే అన్ని సంగతులు ఉన్నవి;

3 నేను పలుకగా లోకము రూపింపబడెను, అన్ని సంగతులు నా వల్లనే కలిగినవి.

4 హానోకు పట్టణమును, నా నామమందు విశ్వసించిన వారందరిని కూడా నా బాహువులోనికి తీసుకొనినది నేనేయని నిశ్చయముగా చెప్పుచున్నాను; ఏలయనగా నేను క్రీస్తును, నా నామములో, నేను చిందించిన రక్తము యొక్క శక్తితో తండ్రి యెదుట వారి కొరకు వేడుకొంటిని.

5 కానీ ఇదిగో, లోకాంతమున సంభవించు ఆ మహాదినమున జరుగు తీర్పు వరకు అంధకార పాశములలో నేను దుష్ట శేషమును బంధించితిని;

6 నా స్వరమును వినక తమ హృదయాలను కఠినపరచుకొను దుష్టులను కూడా అదేవిధముగా బంధించి ఉంచెదను, అయ్యో, అయ్యో, అయ్యో, వారిదెంత దుస్థితి!

7 కానీ ఇదిగో, నా కన్నులు మీపైయున్నవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీ మధ్యనే యున్నాను, కానీ మీరు నన్ను చూడలేరు;

8 అయితే మీరు నన్ను చూచి, నేను ఉన్నానని తెలుసుకొను దినము త్వరలో వచ్చును; ఏలయనగా అంధకారపు తెర త్వరలో చిరిగిపోవును మరియు శుద్ధిచేయబడని వాడు ఆ దినమున నిలిచియుండలేడు.

9 కాబట్టి, మీ నడుములకు దట్టీలను కట్టుకొని సిద్ధముగా నుండుము. ఇదిగో, రాజ్యము మీదైయున్నది మరియు శత్రువు జయించలేడు.

10 మీరు పవిత్రులే కానీ, అందరు కాదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; నేను మిక్కిలి ఆనందించువారు మీరు తప్ప మరెవరునూ లేరు;

11 ఏలయనగా సమస్త శరీరులు నా యెదుట చెడిపోయిరి; అంధకార శక్తులు భూమిపై, నరుల సంతానము మధ్య, పరలోకసైన్యములన్నింటి సమక్షములో విస్తరించియున్నవి—

12 అది నిశ్శబ్దము ఏలుటకు కారణమయ్యెను, నిత్యత్వమంతయు బాధింపబడెను, భూమిని కోతకోసి, అవి కాల్చబడులాగున గురుగులను కూర్చవలెనను ఆ గొప్ప ఆజ్ఞ కొరకు దేవదూతలు వేచి చూచుచున్నారు; ఇదిగో, శత్రువు జతకూడెను.

13 నేను మీకొక మర్మమును, కొంతకాలమైన తరువాత మీ నాశనమును జరిగించుటకు రహస్యగదులలోనున్న ఒక విషయమును చూపెదను మరియు దానిని మీరు యెరుగరు;

14 కానీ ఇప్పుడు దానిని మీకు చెప్పెదను మరియు మీరు ధన్యులు, కానీ మీ పాపము వలన కాదు, మీ హృదయపు అపనమ్మకము వలన కాదు; ఏలయనగా మీలో కొందరు నా యెదుట దోషులుగానున్నారు, కానీ మీ బలహీనతల యెడల నేను దయ కలిగియుండెదను.

15 కాబట్టి, ఇక నుండి ధైర్యముగా నుండుము; భయపడకుము, ఏలయనగా రాజ్యము మీదైయున్నది.

16 మీ రక్షణ కొరకు మీకొక ఆజ్ఞ ఇచ్చుచున్నాను, ఏలయనగా నేను మీ ప్రార్థనలను వినియున్నాను, పేదలు నాకు ఫిర్యాదు చేసియున్నారు, నేను ధనవంతులను కూడా చేసియున్నాను, సమస్త శరీరులు నావారే, నేను పక్షపాతిని కాను.

17 నేను భూమిని సమృద్ధిగా చేసియున్నాను, ఇదిగో అది నా పాదపీఠము, కాబట్టి మరలా నేను దానిపై నిలిచెదను.

18 అధికమైన సంపదలను అనగా వాగ్దానదేశమును, పాలు తేనెలు ప్రవహించు దేశమును మీకు కృపతో ఇచ్చుటకు మనస్సు కలిగి నేను ఇవ్వజూచుచున్నాను, అక్కడ ప్రభువు వచ్చునప్పుడు శాపమేదియు ఉండదు;

19 మీ పూర్ణహృదయములతో మీరు వెదకిన యెడల, వారసత్వ దేశముగా నేను దీనిని మీకిచ్చెదను.

20 ఇది మీతో నా నిబంధనయై యుండును, భూమి ఉన్నంతవరకు మీ యొక్క వారసత్వ దేశముగాను, మీ పిల్లల యొక్క వారసత్వ దేశముగాను ఎప్పటికీ దీనిని మీరు కలిగియుందురు, ఇక ఎన్నటికీ గతించక నిత్యత్వములో దీనిని మీరు తిరిగి పొందెదరు.

21 కానీ రాబోవు కాలములో రాజైనను, ఏలువాడైనను మీరు కలిగియుండరు, ఏలయనగా నేను మీకు రాజునైయుండి, మిమ్ములను కనిపెట్టెదను.

22 కాబట్టి, నా స్వరమును విని నన్ను వెంబడించుము, మీరు స్వేచ్ఛ కలిగిన జనముగానుందురు మరియు నేను వచ్చునప్పుడు నా శాసనములు తప్ప మరేమియు మీరు కలిగియుండరు, ఏలయనగా మీ శాసనకర్తను నేనే, నా చేతిని ఆపగలవాడెవడు?

23 కానీ నేను మీకు నియమించిన స్థానమును బట్టి ఒకరికొకరు బోధించుకొనుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;

24 ప్రతి మనుష్యుడు తన సహోదరుడిని తనవలే యెంచవలెను మరియు నా యెదుట సద్గుణమును, పరిశుద్ధతను సాధన చేయవలెను.

25 మరలా నేను మీతో చెప్పుచున్నాను, ప్రతి మనుష్యుడు తన సహోదరుడిని తనవలే యెంచవలెను.

26 మీలోనొకడు పన్నెండుమంది కుమారులను కలిగియుండి, వారి యెడల పక్షపాతము చూపక, వారు విధేయతతో అతడిని సేవించునప్పుడు అతడు ఒకనితో: నీవు అంగీని ధరించి ఇక్కడ కూర్చొనుము; మరియొకనితో: నీవు చిరిగిన వస్త్రములు ధరించి అక్కడ కూర్చొనుము అని చెప్పి—అతడు వారి కుమారుల వైపు చూచి నేను నీతిమంతుడనని చెప్పునా?

27 ఇదిగో, దీనిని నేను మీకొక ఉపమానముగా ఇచ్చియున్నాను, ఇది నన్ను పోలియున్నది. నేను మీతో చెప్పునదేమనగా, ఒకటిగా నుండుడి; మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు.

28 మరలా నేను మీతో చెప్పునదేమనగా రహస్యగదులలోనున్న శత్రువు మీ ప్రాణములను కోరుచున్నాడు.

29 దూరపు దేశములలో యుద్ధములను గూర్చి మీరు విందురు, దూరపు దేశములలో త్వరలో గొప్ప యుద్ధములు జరుగునని మీరు చెప్పుదురు, కానీ మీ స్వదేశములలోనున్న మనుష్యుల హృదయాలను మీరెరుగరు.

30 మీ ప్రార్థనల వలన నేను మీకు ఈ సంగతులను చెప్పుచున్నాను; కాబట్టి, జ్ఞానమును మీ హృదయాలలో భద్రపరచుకొనుము, లేనియెడల మనుష్యుల దుష్టత్వము తమ దుష్టత్వము ద్వారా మీకు ఈ సంగతులను తెలియజేయును, అది భూమిని కంపింపజేయు దానికంటే బిగ్గర స్వరముతో ఒక విధానములో మీ చెవులలో మాట్లాడును; కానీ మీరు సిద్ధపడియుండిన యెడల మీరు భయపడనవసరము లేదు.

31 తద్వారా శత్రువు శక్తి నుండి మీరు తప్పించుకొని, మచ్చయైనను, నిందయైనను లేకుండా ఒక నీతిగల జనాంగముగా నా యొద్దకు చేరవచ్చును—

32 కాబట్టి, ఈ హేతువు చేత మీరు ఒహైయోకు వెళ్ళవలెనని నేను మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను; అక్కడ నేను మీకు నా ధర్మశాస్త్రమును ఇచ్చెదను; అక్కడ మీరు ఉన్నతమైన దాని నుండి శక్తిచేత దీవించబడెదరు;

33 అక్కడ నుండి, నేను ఎవరినైతే కోరెదనో వారు సమస్త రాజ్యముల మధ్యకు వెళ్ళవలెను మరియు వారు ఏమి చేయవలెనో వారికది చెప్పబడును; ఏలయనగా దాచబడియున్న ఒక గొప్ప కార్యమును నేను కలిగియున్నాను, ఏలయనగా ఇశ్రాయేలు రక్షించబడును మరియు నేను కోరిన ప్రదేశమునకు వారిని నేను నడిపించెదను, ఏ శక్తియు నా చేతిని ఆపలేదు.

34 ఇప్పుడు, ఈ ప్రాంతములలోనున్న సంఘమునకు నేను ఒక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా వారిలో కొంతమంది పురుషులు నియమించబడవలెను, వారు సంఘ స్వరము చేత నియమించబడవలెను.

35 వారు బీదలను, అవసరతలో ఉన్నవారిని ఆదుకొనవలెను, వారు బాధింపబడకుండునట్లు వారి ఉపశమనము కొరకు సేవచేయవలెను మరియు నేను వారిని ఆజ్ఞాపించిన ప్రదేశమునకు వారిని పంపవలెను;

36 ఈ సంఘ ఆస్థికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించుటయే వారి పనియైయుండును.

37 అమ్ముటకు వీలుకాని పొలాలను కలిగియున్న వారు, వారికి ఏది మంచిగా తోచునో దాని ప్రకారము వాటిని విడిచిపెట్టవలెను లేదా అద్దెకు ఇవ్వవలెను.

38 అన్ని సంగతులు భద్రముగా నుండునట్లు చూచుకొనుము; మనుష్యులు ఉన్నతమైన దాని నుండి శక్తిచేత దీవించబడి, ముందుకు పంపబడునప్పుడు, ఇవన్నియు సంఘ ఆధీనములోనికి తీసుకొనబడును.

39 మీరు ధనము కొరకు వెదకిన యెడల, అది మీకిచ్చుటకు తండ్రి చిత్తమైతే, జనులందరిలో మీరు ధనవంతులగుదురు, ఏలయనగా మీరు నిత్యత్వపు ధనమును కలిగియుందురు; మరియు భూలోక సంపదలు నాకు చెందినవి; కానీ గర్వమును గూర్చి జాగ్రత్తపడుము, లేనియెడల మీరు ప్రాచీన నీఫైయుల వలే అగుదురు.

40 నేను మరలా మీతో చెప్పుచున్నాను, నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా ప్రతి మనుష్యుడు, పెద్ద మొదలుకొని యాజకుడు, బోధకుడు, సభ్యుడు, నేనాజ్ఞాపించిన దానిని సిద్ధపరచి, నెరవేర్చుటకు తన శక్తితో తన చేతుల కష్టముతో పనిచేయుట మొదలుపెట్టవలెను.

41 ప్రతి మనుష్యుడు తన పొరుగువానిని సాత్వికముతోను, నిర్మలత్వముతోను హెచ్చరించునట్లు మీ ప్రకటింపును హెచ్చరిక స్వరముగా నుండనిమ్ము.

42 దుష్టుల మధ్యనుండి బయటకు వెళ్ళుము. మిమ్ములను మీరు రక్షించుకొనుము. ప్రభువు పాత్రలను ధరించు మీరు పవిత్రముగా ఉండవలెను. అలాగే జరుగును గాక. ఆమేన్.