లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 4


4వ ప్రకరణము

1829 ఫిబ్రవరి, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా అతని తండ్రియైన జోసెఫ్ స్మిత్ సీనియర్‌కు ఇవ్వబడిన బయల్పాటు.

1–4, నిర్భయమైన సేవ ప్రభువు సేవకులను రక్షించును; 5–6, దైవిక గుణములు వారిని పరిచర్యకు అర్హులుగా చేయును; 7, దేవుని సంగతులు తప్పక వెదకబడవలెను.

1 ఇదిగో, ఒక ఆశ్చర్యకార్యము నరుల సంతానము మధ్యకు రాబోవుచున్నది.

2 కాబట్టి, దేవుని సేవకు పూనుకొనుచున్న మీరు, అంత్యదినమున దేవుని యెదుట నిర్దోషులుగా నిలబడునట్లు మీ పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో ఆయనను సేవించుటకు శ్రద్ధ వహించుడి.

3 కాబట్టి, దేవుని సేవించాలనే కోరిక మీరు కలిగియున్న యెడల మీరు సేవకు పిలువబడెదరు;

4 ఏలయనగా ఇదిగో, పొలము ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నది; ఇదిగో, తన శక్తితో కొడవలిని వాడువాడెవడో, అతడు నశించకుండునట్లు సమకూర్చి దాచుకొనును, అంతేకాక తన ప్రాణమునకు రక్షణను తెచ్చుకొనును;

5 దేవుని మహిమయే లక్ష్యముగా ఉండుటతో పాటు విశ్వాసము, నిరీక్షణ, దాతృత్వము, ప్రేమ వానిని ఆ పనికి అర్హునిగా చేయును.

6 విశ్వాసము, సుగుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, సహోదర ప్రేమ, దైవభక్తి, దాతృత్వము, వినయము, శ్రద్ధను జ్ఞాపకముంచుకొనుము.

7 అడుగుడి, మీకది ఇవ్వబడును; తట్టుడి, మీకది తెరువబడును. ఆమేన్.