లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 50


50వ ప్రకరణము

1831 మే 9న, ఒహైయోలో కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. లోకమంతా వ్యాపించియున్న వేర్వేరు ఆత్మల ప్రత్యక్షతలను కొంతమంది పెద్దలు గ్రహించకుండిరి; ఈ సంగతిని గూర్చి అతని ప్రత్యేక విచారణకు ప్రత్యుత్తరముగా ఈ బయల్పాటు ఇవ్వబడినదని జోసెఫ్ స్మిత్ చరిత్ర చెప్పుచున్నది. ఇటువంటి ఆత్మీయ దృగ్విషయాలు సభ్యుల మధ్య అసాధారణమైనవి కావు; సభ్యులలో కొందరు దర్శనములను, బయల్పాటులను పొందుచున్నామని ఆరోపించిరి.

1–5, అబద్ధ ఆత్మలనేకము లోకమంతా వ్యాపించియున్నవి; 6–9, వేషధారులకు, సంఘము నుండి కొట్టివేయబడిన వారికి శ్రమ; 10–14, పెద్దలు ఆత్మచేత సువార్తను ప్రకటించవలెను; 15–22, ప్రకటించువారు, వినువారు ఇరువురును ఆత్మచేత వెలిగింపబడవలెను; 23–25, ఏదైతే ఆత్మీయాభివృద్ధిని కలుగజేయదో అది దేవుని నుండి కలిగినది కాదు; 26–28, విశ్వాసులు అన్నింటిని కలిగియుందురు; 29–36, పవిత్రుల ప్రార్థనలకు సమాధానమివ్వబడును; 37–46, క్రీస్తు మంచి కాపరియు, ఇశ్రాయేలునకు బండయునై యున్నాడు.

1 ఓ నా సంఘ పెద్దలారా, ఆలకించుడి, సజీవుడైన దేవుని స్వరమునకు చెవి యొగ్గుడి; మీరు సంఘమును గూర్చి మరియు లోకమంతా వ్యాపించియున్న ఆత్మలను గూర్చి నా నుండి కోరి, అంగీకరించిన ప్రకారము మీకు ఇవ్వబడు జ్ఞానవాక్యముల పట్ల ఆసక్తి కలిగియుండుడి.

2 ఇదిగో, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, అనేక అబద్ధ ఆత్మలు కలవు, అవి లోకమంతా వ్యాపించి, ప్రపంచమును మోసపుచ్చుచున్నవి.

3 మిమ్ములను జయించునట్లు సాతాను మిమ్ములను మోసగించుటకు వెదకుచున్నాడు.

4 ఇదిగో, ప్రభువైన నేను మిమ్ములను చూచియున్నాను మరియు నా నామమును ఆరోపించు సంఘములో హేయక్రియలను చూచియున్నాను.

5 కానీ జీవములోనైనను, మరణములోనైనను విశ్వాసముగానుండి, సహించువారు ధన్యులు, ఏలయనగా వారు నిత్యజీవమును స్వాస్థ్యముగా పొందెదరు.

6 కానీ మోసగాళ్ళకు, వేషధారులకు శ్రమ, ఏలయనగా నేను వారిని తీర్పులోనికి తెచ్చెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

7 ఇదిగో, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, కొందరిని మోసపుచ్చిన వేషధారులు మీ మధ్యనున్నారు, అది అపవాదికి శక్తినిచ్చెను; కానీ ఇదిగో అట్టివారిని సత్యమునకు తిరిగి తేవలెను;

8 కానీ నా చిత్త ప్రకారము జీవములోనైనను, మరణములోనైనను వేషధారులు కనిపెట్టబడి, కొట్టి వేయబడవలెను; నా సంఘమునుండి కొట్టివేయబడిన వారికి శ్రమ, ఏలయనగా అట్టివారు లోకముచేత జయింపబడియున్నారు.

9 కాబట్టి అసత్యమైనదానిని, అవినీతికరమైనదానిని నా యెదుట చేయకుండునట్లు ప్రతి మనుష్యుడు జాగ్రత్తపడవలెను.

10 ఇప్పుడు రమ్ము, మీరు గ్రహించునట్లు తర్కించెదమని ఆత్మద్వారా ప్రభువు సంఘ పెద్దలకు సెలవిచ్చుచున్నాడు;

11 మనుష్యుడు ఒకనితోనొకడు ముఖాముఖిగా తర్కించునట్లు మనము తర్కించెదము.

12 ఇప్పుడు, ఒక మనుష్యుడు తర్కించునప్పుడు అతడు మరియొక మనుష్యునివలన గ్రహించబడును, ఎందుకనగా అతడు ఒక మనుష్యునివలె తర్కించును; మీరు గ్రహించునట్లు ప్రభువైన నేను ఆవిధముగానే మీతో తర్కించెదను.

13 కాబట్టి, ప్రభువైన నేను మిమ్ములను ఈ ప్రశ్న అడుగుచున్నాను—మీరు దేనికొరకు నియమించబడిరి?

14 ఆత్మచేత అనగా సత్యమును బోధించుటకు పంపబడిన ఆదరణకర్త చేత నా సువార్తను ప్రకటించుటకే కదా.

15 మరి మీరు గ్రహింపజాలని ఆత్మలను పొందితిరి, అవి దేవుని వలన కలిగినట్లుగా పొందితిరి; దీని విషయమై మీరు నీతిమంతులుగా తీర్పుతీర్చబడుదురా?

16 ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానము మీరే చెప్పవలెను; అయినప్పటికీ, నేను మీ యెడల కరుణ కలిగియుందును; మీలో బలహీనుడైనవాడు ఇకమీదట బలవంతునిగా చేయబడును.

17 నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఎవడైతే నా వలన నియమించబడి, సత్యవాక్యమును ఆదరణకర్తతో, సత్య స్వరూపియగు ఆత్మతో ప్రకటించుటకు పంపబడెనో, వాడు దానిని సత్య స్వరూపియగు ఆత్మతో ప్రకటించుచుండెనా లేదా మరో విధముగా ప్రకటించుచుండెనా?

18 అది మరో విధముగానైతే, అది దేవుని నుండి కలిగినది కాదు.

19 సత్యవాక్యమును పొందువాడు దానిని సత్య స్వరూపియగు ఆత్మతో పొందుచుండెనా లేదా మరో విధముగా పొందుచుండెనా?

20 అది మరో విధముగానైతే, అది దేవుని నుండి కలిగినది కాదు.

21 కాబట్టి, సత్య స్వరూపియగు ఆత్మతో వాక్యమును పొందువాడు, సత్య స్వరూపియగు ఆత్మతో బోధించునట్లుగానే దానిని పొందునని మీరెందుకు గ్రహించి, తెలుసుకొనలేకపోవుచున్నారు?

22 కాబట్టి, ప్రకటించువాడును, పొందువాడును ఒకరినొకరు అర్థము చేసుకొందురు మరియు ఇరువురు ఆత్మీయాభివృద్ధిని పొంది, కలిసి ఆనందించెదరు.

23 ఏదైతే ఆత్మీయాభివృద్ధిని కలుగజేయదో, అది దేవుని నుండి కలిగినది కాదు మరియు అది అంధకారమైయున్నది.

24 దేవుని నుండి కలిగినది వెలుగైయున్నది; వెలుగును పొందినవాడు దేవునియందు కొనసాగినయెడల, మరింత వెలుగును పొందును; పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు ఆ వెలుగు అంతకంతకు తేజరిల్లును.

25 మరలా, మీరు సత్యమును తెలుసుకొని, మీ మధ్యనుండి చీకటిని తరిమి వేయుటకే దీనిని నేను చెప్పుచున్నానని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;

26 దేవుని చేత నియమించబడి, పంపబడిన వాడు అల్పుడును, అందరికి సేవకుడైయున్నను, అట్టివాడు గొప్పవానిగానుండుటకు నియమించబడియున్నాడు.

27 కాబట్టి, అతడు అన్నింటిని కలిగియుండును; ఏలయనగా తండ్రి చిత్తానుసారముగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా పంపబడియున్న జీవమును, వెలుగును, ఆత్మయు, శక్తియు, పరలోకమందును, భూలోకమందును ఉన్నసమస్తము అతనికి లోబడియున్నవి.

28 కానీ సమస్త పాపమునుండి పవిత్రపరచబడి, కడిగివేయబడితే తప్ప ఏ మనుష్యుడును అన్నింటిని కలిగియుండలేడు.

29 మీరు సమస్త పాపమునుండి పవిత్రపరచబడి, కడిగివేయబడిన యెడల, మీరు యేసు నామములో ఏమి అడిగినను అది జరుగును.

30 కానీ దీనిని తెలుసుకొనుడి, మీరు దేనిని అడుగుదురో అది మీకు అనుగ్రహించబడును; మీరు ఆధిపత్యమునకు నియమించబడిరి గనుక, ఆత్మలు మీకు లోబడియుండును.

31 గ్రహింపశక్యము కాని ఒక ఆత్మ ప్రత్యక్షతను మీరు చూచినయెడల మరియు మీరు ఆ ఆత్మను పొందియుండని యెడల, యేసు నామములో మీరు తండ్రిని అడుగవలెను; ఆ ఆత్మను తండ్రి మీకు అనుగ్రహించని యెడల, అది దేవుని నుండి కలిగినది కాదని అప్పుడు మీరు తెలుసుకొందురు.

32 ఆ ఆత్మమీద మీకు శక్తి అనుగ్రహింపబడును; అది దేవునినుండి వచ్చినది కాదని బిగ్గరగా ఆ ఆత్మకు విరోధముగా మీరు చాటవలెను—

33 మీరు జయింపబడకుండునట్లు దూషణతో కూడిన నిందతోనైనను, లేదా దానివలన మీరు బంధింపబడకుండునట్లు డాంబికముతోనైనను, సంతోషముతోనైనను చాటకూడదు.

34 అతడు దేవుని నుండి పొందినదానిని, దేవుని నుండి పొందినట్లుగానే యెంచవలెను; పొందుటకు అతడు దేవునిచేత యోగ్యునిగా యెంచబడెను గనుక, అతడు సంతోషించవలెను.

35 మీరు పొందియున్న మరియు ఇకముందు మీరు పొందబోవు ఈ సంగతులకు చెవియొగ్గి, వాటిని చేయుట ద్వారా—తండ్రిచేత పరలోకరాజ్యము, ఆయన చేత నియమించబడని సమస్త విషయములను జయించుటకు శక్తి మీకివ్వబడియున్నది.

36 ఇదిగో నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుని నోటిద్వారా నా ఈ మాటలను వినుచున్న మీరు ధన్యులు, ఏలయనగా మీ పాపములు క్షమించబడియున్నవి.

37 ఎవరియందైతే నేను మిక్కిలి ఆనందించుచున్నానో, ఆ నా సేవకుడైన జోసెఫ్ వేక్‌ఫీల్డ్, నా సేవకుడైన పార్లీ పి. ప్రాట్ సంఘముల మధ్యకు వెళ్ళి హెచ్చరిక వాక్యము చేత వారిని బలపరచవలెను;

38 నా సేవకుడైన జాన్ కొరిల్, లేదా ఈ స్థానమునకు నియమించబడిన నా సేవకులందరు కూడా నా ద్రాక్షతోటలో పనిచేయవలెను; వారికి నేను నియమించియున్న దానిని చేయుటలో ఏ మనుష్యుడును వారిని ఆటంకపరచకూడదు—

39 కాబట్టి, ఈ విషయములో నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ నీతిమంతునిగా యెంచబడడు; అయినప్పటికీ అతడు పశ్చాత్తాపపడవలెను, అప్పుడు అతడు క్షమించబడును.

40 ఇదిగో, మీరు చిన్న పిల్లలు, మీరు అన్ని సంగతులను ఇప్పుడు సహింపలేరు; మీరు కృపయందును, సత్యము యొక్క జ్ఞానమందును వృద్ధి చెందవలెను.

41 చిన్న పిల్లలారా, భయపడకుడి, ఏలయనగా మీరు నావారైయున్నారు, నేను లోకమును జయించియున్నాను మరియు నా తండ్రి నాకు అనుగ్రహించియున్న వారిలో మీరు భాగస్థులైయున్నారు.

42 తండ్రి నాకు అనుగ్రహించియున్న వారెవరునూ నశించరు.

43 తండ్రి, నేను ఏకమైయున్నాము. నేను తండ్రియందును, తండ్రి నా యందును ఉన్నాము; మీరు నన్ను చేర్చుకొనిన యెడల, మీరు నా యందును, నేను మీ యందును ఉందుము.

44 కాబట్టి, నేను మీ మధ్యనున్నాను మరియు నేను మంచి కాపరియు, ఇశ్రాయేలుకు బండనైయున్నాను. ఈ బండమీద కట్టబడువాడు ఎప్పటికీ పడిపోడు.

45 మీరు నా స్వరమును విని, నన్ను చూచి, నేను ఉన్నానని తెలుసుకొను దినము వచ్చును.

46 కాబట్టి మీరు సిద్ధముగానుండునట్లు కనిపెట్టుకొనియుండుడి. అలాగే జరుగును గాక. ఆమేన్.