లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 58


58వ ప్రకరణము

1831 ఆగష్టు 1న, మిస్సోరిలోని జాక్సన్ కౌంటీలోనున్న సీయోనులో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఇంతకుముందు ప్రవక్త మరియు అతని సహచరులు మిస్సోరిలోని జాక్సన్ కౌంటీకి వచ్చిన తరువాత, మొదటి విశ్రాంతిదినమున ఒక మతపరమైన సేవా కార్యక్రమము జరిగెను; బాప్తిస్మము ద్వారా ఇద్దరు సభ్యులు చేర్చబడిరి. ఆ వారములో థాంప్సన్ శాఖ నుండి కోల్స్‌విల్ పరిశుద్ధులలో కొందరు మరియు ఇతరులు వచ్చిరి (54వ ప్రకరణము చూడుము). ఆ క్రొత్త కూడిక స్థలములో, వారిని గూర్చి ప్రభువు చిత్తమేమిటో తెలుసుకోవలెనని అనేకులు ఆతృతపడిరి.

1–5, శ్రమలను సహించువారు మహిమ కిరీటమును పొందెదరు; 6–12, గొఱ్ఱెపిల్ల వివాహమునకు, ప్రభువు విందుకు పరిశుద్ధులు సిద్ధపడవలెను; 13–18, బిషప్పులు ఇశ్రాయేలులో తీర్పుతీర్చువారు; 19–23, పరిశుద్ధులు లోకము యొక్క చట్టములను పాటించవలెను; 24–29, మనుష్యులు మంచిని చేయుటకు వారి స్వేచ్ఛను ఉపయోగించుకొనవలెను; 30–33, ప్రభువు ఆజ్ఞాపించును మరియు రద్దుచేయును; 34–43, పశ్చాత్తాపపడవలెనన్న, మనుష్యులు తమ పాపములను ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టవలెను; 44–58, పరిశుద్ధులు వారి స్వాస్థ్యమును కొనుగోలు చేసి, మిస్సోరిలో సమకూడవలెను; 59–65, ప్రతి జీవికి సువార్త ప్రకటించబడవలెను.

1 నా సంఘ పెద్దలారా, వినుడి, నా మాటకు చెవి యొగ్గుడి, మిమ్ములను గూర్చి, నేను మిమ్ములను పంపిన ఈ ప్రదేశమును గూర్చి నా చిత్తమేమిటో నా నుండి నేర్చుకొనుడి.

2 జీవములోను, మరణములోను నా ఆజ్ఞలను పాటించువాడు ధన్యుడు; ఎవడైతే శ్రమలలో విశ్వాసముగానుండునో, పరలోకమందు అట్టివాని ప్రతిఫలము అధికమగునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

3 ఇకమీదట రాబోవు సంగతులను గూర్చి మీ దేవుని ప్రణాళికను, అనేక శ్రమల తరువాత కలుగు మహిమను మీ సహజ నేత్రాలతో ప్రస్తుతము మీరు చూడలేరు.

4 ఎందుకనగా అనేక శ్రమల తరువాత దీవెనలు వచ్చును. కాబట్టి, మీరు మిక్కిలి మహిమగల కిరీటము ధరించు దినము వచ్చును; ఆ గడియ ఇంకనూ రాలేదు, కానీ అది సమీపములో ఉన్నది.

5 మీ హృదయములందు భద్రపరచుకొని, రాబోవు వాటిని స్వీకరించులాగున గతములో నేను మీకు చెప్పిన సంగతులను జ్ఞాపకముంచుకొనుడి.

6 ఇదిగో, నేను మీకు నిశ్చయముగా చెప్పునదేమనగా, ఈ హేతువు చేత నేను మిమ్ములను పంపితిని—మీరు విధేయులుగా నుండి, రాబోవు సంగతులను గూర్చి సాక్ష్యము చెప్పులాగున మీ హృదయములు సిద్ధపడునట్లు;

7 పునాది వేయుటలో మీకు ఘనత కలుగునట్లు, దేవుని యొక్క సీయోను స్ధాపించబడు ప్రదేశమును గూర్చి సాక్ష్యము కలిగియుండునట్లు;

8 పేదలకు శ్రేష్ఠమైన ఒక విందును, అనగా శుద్ధి చేయబడిన మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో శ్రేష్ఠమైన ఒక విందును సిద్ధపరచునట్లు పంపితిని, తద్వారా ప్రవక్తల మాటలు వ్యర్థము కావని కూడా భూలోక నివాసులు తెలుసుకొందురు;

9 ప్రభువు యొక్క మందిరములో బాగా సిద్ధపరచిన విందుకు సమస్త రాజ్యములు ఆహ్వానించబడును.

10 మొదట ధనికులు, విద్యావంతులు, జ్ఞానులు, ఘనులు;

11 అటు తరువాత నా శక్తి ప్రత్యక్షపరచబడు దినము వచ్చును; అప్పుడు పేదవారు, కుంటివారు, గ్రుడ్డివారు, చెవిటివారు, గొఱ్ఱెపిల్ల వివాహమునకు వచ్చి, ఆ మహాదినము కొరకు సిద్ధపరచబడిన ప్రభువు యొక్క విందును ఆరగించెదరు.

12 ఇదిగో, ప్రభువైన నేను దీనిని చెప్పితిని.

13 దేవుని వారసత్వ పట్టణమైన సీయోను నుండి సాక్ష్యము బయలు వెళ్ళునట్లు—

14 ఈ హేతువు చేత మిమ్ములను ఇక్కడికి పంపితిని మరియు నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌ను ఎన్నుకొని, అతని నియమితకార్యమును అతనికి నియమించితిని.

15 అతడు తన పాపములైన అపనమ్మకము, హృదయ అంధత్వముల నిమిత్తము పశ్చాత్తాపపడని యెడల అతడు జాగ్రత్తపడవలెను, లేనియెడల అతడు పాపములో పడిపోవును.

16 ఇదిగో అతని నియమితకార్యము అతనికి ఇవ్వబడినది, మరియొకసారి అది ఇవ్వబడదు.

17 ఎవడైతే ఈ నియమితకార్యములో సఫలమగునో, వాడు ప్రాచీన దినములలో దేవుని స్వాస్థ్యమును ఆయన సంతానమునకు పంచిపెట్టుటకు నియమించబడిన విధముగా ఇశ్రాయేలులో తీర్పు తీర్చువానిగా నియమించబడును;

18 నీతిమంతుల సాక్ష్యమును బట్టి మరియు దేవుని ప్రవక్తల చేత ఇవ్వబడిన రాజ్యనియమములను బట్టి, ఆయన సలహాదారుల సహాయముతో ఆయన ప్రజలకు తీర్పుతీర్చును.

19 ఈ దేశములో నా ధర్మశాస్త్రము పాటించబడునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

20 ఏ మనుష్యుడు తాను అధికారినని అనుకొనకూడదు; కానీ తన చిత్తప్రకారము తీర్పుతీర్చుచు లేదా మరొకమాటలో న్యాయసింహాసనముపై ఆసీనుడగు లేదా తీర్పుతీర్చు దేవుడిని అతనిపై అధికారిగా ఉండనియ్యవలెను.

21 భూలోక చట్టాలను ఏ మనుష్యుడు అతిక్రమించకూడదు, ఏలయనగా దేవుని చట్టాలను పాటించువాడు లోకచట్టాలను అతిక్రమించనవసరము లేదు.

22 కాబట్టి, శత్రువులందరిని తన కాలిక్రింద అణగద్రొక్కి, పాలించే హక్కుగల ఆయన పరిపాలించేంతవరకు, ఇప్పుడున్న ప్రభుత్వాలకు లోబడియుండుడి.

23 నా హస్తమునుండి మీరు పొందిన నియమములే సంఘ నియమములు మరియు ఈ విధముగా మీరు వాటిని పరిగణించవలెను. ఇదిగో, ఇందులో జ్ఞానము కలదు.

24 ఇప్పుడు, నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌ను గూర్చి నేను మాట్లాడిన విధముగా, ఈ ప్రదేశము అతనికి మరియు అతని సలహాదారులుగా అతడు నియమించుకున్న వారికి నివాసస్థలము; మరియు నా గిడ్డంగిని నిర్వహించుటకు నేను నియమించిన వానికి కూడా నివాసస్థలము;

25 కాబట్టి వారు తమలోతాము మరియు నాతో ఆలోచన చేసి, వారి కుటుంబాలను ఈ ప్రదేశమునకు తీసుకొనిరావలెను.

26 ఏలయనగా, అన్ని విషయములలో నేను ఆజ్ఞాపించుట యుక్తము కాదు; అన్ని విషయములలో బలవంతము చేయబడువాడు సోమరియే గాని, వివేకము గల సేవకుడు కాడు; కాబట్టి అతడు ఏ ప్రతిఫలమును పొందడు.

27 నేను నిశ్చయముగా చెప్పునదేమనగా, మనుష్యులు ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమై, వారి ఇష్టపూర్వకముగా అనేక కార్యములు చేసి, అధికమైన నీతిని నెరవేర్చవలెను;

28 వారిలో శక్తి ఉన్నది గనుక, వారు తమకుతామే ప్రతినిధులైయున్నారు. మనుష్యులు మంచి చేయునంత వరకు వారు తమ ప్రతిఫలమును కోల్పోరు.

29 కానీ ఎవడైతే ఆజ్ఞాపించబడేవరకు ఏమియు చేయక, ఆజ్ఞను సందేహపూరిత హృదయముతో స్వీకరించి, సోమరితనముతో దానిని పాటించునో, అట్టివాడు నిందించబడును.

30 మనుష్యుని సృష్టించిన నేను నా ఆజ్ఞలను పాటించని వానిని నిరపరాధిగా యెంచెదనా? అని ప్రభువు అడుగుచున్నాడు.

31 నేను వాగ్దానము చేసి, దానిని నెరవేర్చకయుందునా? అని ప్రభువు అడుగుచున్నాడు.

32 నేను ఆజ్ఞాపించగా మనుష్యులు విధేయత చూపరు; నా ఆజ్ఞను రద్దుచేయగా, వారు దీవెనను పొందరు.

33 ఆయన వాగ్దానములు నెరవేరుట లేదు గనుక, ఇది ప్రభువు కార్యము కాదు అని వారు తమ హృదయములందు అనుకొందురు. అట్టి వారికి శ్రమ, వారి ప్రతిఫలము నరకమందు వేచియున్నది, కానీ పరలోకమందు కాదు.

34 ఇప్పుడు ఈ దేశమును గూర్చి మరిన్ని నిర్దేశాలను ఇచ్చుచున్నాను.

35 నా సేవకుడైన మార్టిన్ హారిస్ సంఘమునకు మాదిరికరముగా ఉండుటకు అతని ఆస్థిని బిషప్పుకిచ్చుట నా యందు వివేకమైయున్నది.

36 ఈ దేశములో ఒక నివాసస్థలము పొందుటకు వచ్చు ప్రతి మనుష్యుడు చట్టము నిర్దేశించిన ప్రకారము వారి ఆస్థిని ఇవ్వవలెను.

37 గిడ్డంగి కొరకు మరియు ముద్రణాలయము కొరకు ఇండిపెండెన్స్‌లో భూములు కొనుగోలు చేయుట వివేకమైయున్నది.

38 మరియు తనకు ఏది యుక్తమని తోచునో ఆవిధముగా తన స్వాస్థ్యము పొందుటకు నా సేవకుడైన మార్టిన్ హారిస్‌కు ఇతర నిర్దేశములు ఆత్మ చేత ఇవ్వబడును;

39 అతడు తన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడవలెను, ఏలయనగా అతడు లోక ప్రశంసలను కోరుచున్నాడు.

40 నా సేవకుడైన విలియం డబ్ల్యు. ఫెల్ప్స్ నేను నియమించిన స్థానములో ఉండి, దేశములో అతని స్వాస్థ్యమును పొందవలెను;

41 అతడు నా యెదుట తగినంత సాత్వీకునిగా ఉండక, హెచ్చించుకొనుటకు చూచుచున్నాడు గనుక ప్రభువైన నేను అతనియందు ఆనందించుట లేదు మరియు అతడు పశ్చాత్తాపపడవలసియున్నది.

42 ఎవడైతే తన పాపములకు పశ్చాత్తాపపడునో వాడు క్షమించబడును, ప్రభువైన నేను వాటిని ఇక జ్ఞాపకముంచుకొనను.

43 ఒక మనుష్యుడు తన పాపములను ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టుటను బట్టి అతడు పశ్చాత్తాపపడెనని మీరు తెలుసుకొందురు.

44 ఇప్పుడు మిగిలిన నా సంఘ పెద్దలను గూర్చి నేను చెప్పుదును, వారు విశ్వాస సహితమైన ప్రార్థనల ద్వారా కోరితే తప్ప ఈ దేశములో వారు తమ స్వాస్థ్యమును పొందుటకు సమయమింకను రాలేదు, కానీ అనేక సంవత్సరముల తరువాత ప్రభువు చేత వారికది నియమింపబడును.

45 వారు ప్రజలను భూదిగంతముల నుండి త్రోసివేయుదురు.

46 కాబట్టి, మీరంతా కలిసి సమకూడుడి; ఈ ప్రదేశములో నివశించుటకు నియమింపబడని వారు చుట్టుప్రక్కల ప్రాంతములలో సువార్తను ప్రకటించవలెను; అటు పిమ్మట వారు వారి గృహములకు తిరిగి రావలయును.

47 వారి మార్గము వెంబడి వారు సువార్తను ప్రకటించవలెను మరియు అన్ని ప్రదేశములందు సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పుచూ ధనికులు, ఘనులు, ఘనహీనులు, పేదలు పశ్చాత్తాపపడవలెని ప్రకటించవలెను.

48 భూలోక నివాసులు పశ్చాత్తాపపడినంత మట్టుకు, వారు సంఘములు నిర్మించవలెను.

49 సీయోనులో స్థలములు కొనుగోలు చేయుటకై ధనమును స్వీకరించుటకు ఒహైయోలో ఉన్న సంఘమందు ఒక ప్రతినిధి సంఘ స్వరముచేత నియమించబడవలెను.

50 మరియు నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్‌కు నేను ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నాను, అదేమనగా ఆత్మ ద్వారా అతనికి తెలియజేయబడునట్లుగా అతడు సీయోను దేశమును గూర్చి ఒక వర్ణనను, దేవుని చిత్తమును గూర్చి ఒక వాంగ్మూలమును వ్రాయవలెను;

51 దేవుని పిల్లల స్వాస్థ్యము కొరకు స్థలములు కొనుగోలు చేయు నిమిత్తము నిధులు పోగుచేయుటకు ఒక విరాళ సేకరణ పత్రము తయారు చేసి, దానిని సంఘ శాఖలన్నింటికి పంపవలెను మరియు ఆ నిధులను బిషప్పుకు లేదా అతనికి యుక్తమనిపించినట్లుగా లేదా అతడు నిర్దేశించినట్లుగా అతని ప్రతినిధికి అప్పగించవలెను.

52 శిష్యులు మరియు నరుల సంతానము సమయము అనుకూలించినంత త్వరగా ఈ దేశములో ఉన్న ప్రాంతమంతటిని కొనుటలో వారి ఔదార్యము చాటవలెనన్నది ప్రభువు చిత్తమని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను.

53 ఇదిగో, ఇందులో జ్ఞానము కలదు. వారు దీనిని చేయవలెను, లేనియెడల రక్తము చిందించుట ద్వారా తప్ప వారు ఏ స్వాస్థ్యమును పొందలేరు.

54 మరలా, స్థలమును సంపాదించిన వెంటనే దేవుని పరిశుద్ధుల కొరకు పనిచేయుటకు సకలవిధముల పనివారిని అక్కడకు పంపవలెను.

55 ఈ సంగతులన్నీ సక్రమముగా జరుగవలెను; స్థలముల విశేషాధికారములను గూర్చి అప్పుడప్పుడు బిషప్పు ద్వారా లేదా సంఘ ప్రతినిధి ద్వారా తెలుపబడవలెను.

56 సమకూర్చే కార్యము తొందరపాటుతో లేదా త్వరితగతిన చేయబడరాదు; కానీ, అప్పుడప్పుడు వారు పొందు సమాచారమును బట్టి సమావేశాలలో సంఘ పెద్దల చేత ఉపదేశించబడిన ప్రకారము అది జరుగవలెను.

57 నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్ ఈ ప్రదేశమును మరియు దేవాలయము కొరకు స్థలమును ప్రభువుకు సమర్పించి, అంకితమియ్యవలెను.

58 మరియు ఒక సమావేశ కూడిక ఏర్పాటు చేయబడవలెను; తరువాత నా సేవకులైన సిడ్నీ రిగ్డన్, జోసెఫ్ స్మిత్ జూ.లు వారి స్వంత ఊరిలో నేను వారికి నియమించిన పని యొక్క శేషమును పూర్తి చేయుటకు తిరిగి వెళ్ళవలెను మరియు ఇతర సమావేశముల చేత నిర్దేశింపబడిన పని యొక్క శేషమును కూడా పూర్చి చేయవలెను; ఆలీవర్ కౌడరీ కూడా వారితో వెళ్ళవలెను.

59 తాను ఎరిగిన వాటిని మరియు రూఢీగా నమ్మేవాటిని గూర్చి మార్గము వెంబడి తెలియజేయుటకు తప్ప, మరిదేనికీ ఈ ప్రదేశము నుండి ఏ మనుష్యుడు వెనుదిరగరాదు.

60 జీబా పీటర్సన్‌కు అనుగ్రహించిన దానిని అతని నుండి తీసుకొనుడి; సంఘములో అతడు ఒక సభ్యునివలే ఉండి, తన పాపములన్నింటికి తగినంతగా గద్దింపబడు వరకు, సహోదరులతో కలసి అతని స్వహస్తములతో పనిచేయవలెను; ఏలయనగా, అతడు తన పాపములను ఒప్పుకొనక, వాటిని మరుగుపరచుటకు ఆలోచన చేయుచుండెను.

61 ఈ ప్రదేశమునకు వచ్చుచున్న సంఘ పెద్దల శేషము ఇక్కడ ఒక సమావేశమును ఏర్పాటు చేయవలెను, వారిలో కొందరు మిక్కిలి విశేషముగా దీవించబడిరి.

62 వారిచే నిర్వహించబడు సమావేశమును నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ నడిపించవలెను.

63 వారు మార్గము వెంబడి సువార్తను ప్రకటించుచు, వారికి బయలుపరచబడిన సంగతులను గూర్చి సాక్ష్యము చెప్పుచూ తిరిగి వెళ్ళవలెను.

64 నిశ్చయముగా ఈ ధ్వని ఈ ప్రదేశము నుండి లోకములోనికి, భూదిగంతముల వరకు చేరవలెను—నమ్మువారికి కలుగబోవు సూచక క్రియలతో పాటు, సువార్త ప్రతి జీవికి ప్రకటించబడవలెను.

65 ఇదిగో మనుష్యకుమారుడు వచ్చుచున్నాడు. ఆమేన్.