లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 64


64వ ప్రకరణము

1831 సెప్టెంబరు 11న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. బైబిలును అనువదించు కార్యమును నవీకరించుటకు ప్రవక్త ఒహైయోలోని హైరంకు తరలి వెళ్ళుటకు సిద్ధపడుచుండెను, అతడు మిస్సోరిలో ఉన్నప్పుడు అది ఆపబడెను. సీయోనుకు (మిస్సోరి) ప్రయాణము చేయవలెనని ఆజ్ఞాపించబడిన సహోదరుల సమూహము, అక్టోబరులో బయలుదేరుటకు సిద్ధపడుటలో ఆసక్తితో నిమగ్నమయ్యిరి. ఇటువంటి తీరికలేని సమయములో ఈ బయల్పాటు పొందబడెను.

1–11, పరిశుద్ధలు ఒకరినొకరు క్షమించవలెనని ఆజ్ఞాపించబడిరి, లేనియెడల వారియందు గొప్ప పాపము నిలిచియుండును; 12–22, పశ్చాత్తాపపడని వారు సంఘము యెదుటకు తేబడవలెను; 23–25, దశమభాగము చెల్లించినవాడు ప్రభువు రాకడయందు కాల్చబడడు; 26–32, అప్పు చేయుటను గూర్చి పరిశుద్ధులు హెచ్చరించబడిరి; 33–36, తిరుగుబాటుదారులు సీయోను నుండి కొట్టివేయబడుదురు; 37–40, జనములకు సంఘము తీర్పుతీర్చును; 41–43, సీయోను వర్ధిల్లును.

1 ఇదిగో, మీ దేవుడైన ప్రభువు మీకు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఓ నా సంఘ పెద్దలారా ఆలకించి, వినుడి, మిమ్ములను గూర్చి నా చిత్తమును పొందుడి.

2 ఏలయనగా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు లోకమును జయించవలెనని నేను కోరుచున్నాను; కాబట్టి, నేను మీ యెడల కనికరమును కలిగియుందును.

3 పాపము చేసినవారు మీ మధ్యనున్నారు; కానీ ఈ ఒక్కసారి మాత్రము, నా మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, నేను మీ పాపములను క్షమించియున్నానని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను.

4 నేను మీ యెడల కరుణ కలిగియుందును, ఏలయనగా పరలోకరాజ్యమును నేను మీకు ఇచ్చియున్నాను.

5 అతడు నా విధులను గైకొనిన యెడల, అతడు జీవించియుండగా నేను నియమించిన విధానము ద్వారా నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. యొద్ద నుండి పరలోకరాజ్య మర్మముల తాళపుచెవులు తీసుకొనబడవు.

6 ఏ కారణము లేకుండా అతడిని నిందించుటకు అవకాశము కొరకు చూచువారు కలరు;

7 అయినప్పటికీ, అతడు పాపము చేసెను; కానీ మరణమును కలిగించు పాపమును చేయక, తమ పాపములను నా యెదుట ఒప్పుకొని, క్షమాపణ అడిగిన యెడల, ప్రభువైన నేను వారి పాపములను క్షమించెదనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

8 ప్రాచీన దినములలో నా శిష్యులు ఒకరినొకరు నిందించుటకు అవకాశము కొరకు చూచి, తమ హృదయాలలో ఒకరినొకరు క్షమించుకొనలేదు; ఈ చెడుతనము కొరకు వారు శ్రమనొంది, కఠినముగా శిక్షించబడిరి.

9 కాబట్టి నేను చెప్పునదేమనగా, మీరు ఒకరినొకరు క్షమించుకొనవలెను; ఏలయనగా తన సహోదరుని అపరాధములను క్షమించని వాడు ప్రభువు యెదుట నిందించబడును; ఏలయనగా వానియందు అధిక పాపము నిలిచియుండును.

10 ప్రభువైన నేను, ఎవరిని క్షమించెదనో వారిని క్షమించెదను, కానీ మీరైతే మనుష్యులందరిని క్షమించవలసిన అవసరమున్నది.

11 మీరు మీ హృదయములందు ఈలాగు అనుకొనవలెను—దేవుడు నీకును, నాకును తీర్పుతీర్చి, నీ పనులను బట్టి నీకు ప్రతిఫలమిచ్చును గాక.

12 తన పాపములకు పశ్చాత్తాపపడి, వాటిని ఒప్పుకొనని వానిని మీరు సంఘము యెదుటకు తీసుకొనివచ్చి, ఆజ్ఞాపూర్వకముగా గాని, బయల్పాటువలన గాని లేఖనములు మీకు సెలవిచ్చిన ప్రకారము అతని పట్ల వ్యవహరించవలెను.

13 దేవుడు మహిమపరచబడునట్లు దీనిని మీరు చేయవలెను గాని, మీరు క్షమించనందున లేదా కనికరము కలిగియుండనందున కాదు; మీరు ధర్మశాస్త్రము యొక్క కన్నులయెదుట నీతిమంతులుగా తీర్పుతీర్చబడుటకు, తద్వారా మీ శాసనకర్తను మీరు అభ్యంతరపరచకయుండునట్లు దీనిని చేయవలెను—

14 ఈ కారణము వలన మీరు వీటిని చేయవలెనని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను.

15 ఇదిగో, ప్రభువైన నేను నా సేవకుడైన ఎజ్రా బూత్ యెడల మరియు నా సేవకుడైన ఐజక్ మోర్లే యెడల కోపముతోనుంటిని, ఏలయనగా వారు ధర్మశాస్త్రమునైనను, ఆజ్ఞనైనను గైకొనలేదు;

16 వారు తమ హృదయములందు చెడును కోరినందున ప్రభువైన నేను, నా ఆత్మను ఉపసంహరించితిని. వారు మంచి దానిని చెడ్డదానిగా నిందమోపిరి; అయినప్పటికీ, నా సేవకుడైన ఐజక్ మోర్లేను నేను క్షమించియున్నాను.

17 ఇదిగో, నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ కూడా పాపము చేసెను మరియు సాతాను అతని ఆత్మను నాశనము చేయుటకు వెదకుచున్నాడు; కానీ ఈ సంగతులు వారికి తెలుపబడినప్పుడు, వారు చెడు నిమిత్తము పశ్చాత్తాపపడిన యెడల వారు క్షమించబడుదురు.

18 ఇప్పుడు, నా సేవకుడైన సిడ్నీ గిల్బర్ట్ కొన్ని వారముల తరువాత సీయోను ప్రదేశములో వర్తకము చేయుటకు అతని వ్యాపారసంస్థకు తిరిగి వెళ్ళుట నా యందు యుక్తమైయున్నది;

19 వారు నశింపకుండునట్లు అతడు కనినది, వినినది నా శిష్యులకు తెలియజేయవచ్చును. ఈ కారణము వలన నేను ఈ సంగతులను చెప్పితిని.

20 మరలా, నేను మీతో చెప్పునదేమనగా, నా సేవకుడైన ఐజక్ మోర్లీ తాను సహింపగలిగిన దానికంటె ఎక్కువ శోధింపబడకుండునట్లు, మీరు బాధపడునట్లు తప్పుగా ఉపదేశమివ్వకుండునట్లు, అతని పొలము అమ్మబడవలెనని నేను ఆజ్ఞాపించితిని.

21 ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ తన పొలమును అమ్మవలెనని నేను కోరుటలేదు, ఏలయనగా ప్రభువైన నేను, ఐదు సంవత్సరముల పాటు కర్ట్‌లాండ్ ప్రాంతమునందు బలము కలిగియుండుటకు కోరుచున్నాను, ఆ సమయములో నేను కొందరిని కాపాడుటకు దుష్టులను నాశనము చేయను.

22 ఆ దినము గడిచిన తరువాత ప్రభువైన నేను, గ్రహించు హృదయముతో సీయోను ప్రదేశమునకు వెళ్ళువారెవరిని అపరాధిగా యెంచను; ఏలయనగా ప్రభువైన నేను, నరుల సంతానము యొక్క హృదయాలను కోరుదును.

23 ఇదిగో, ఇది మనుష్య కుమారుని రాకడ దినము వరకు నేటిదినముగా పిలువబడుచున్నది, ఇది త్యాగదినము, నా ప్రజలు దశమభాగమును చెల్లించు దినము; ఏలయనగా దశమభాగమును చెల్లించువాడు ఆయన రాకడయందు దహించబడడు.

24 నేటిదినము తరువాత దహించబడుట జరుగును—ఇది ప్రభువు విధానముననుసరించి చెప్పుట—నేను నిశ్చయముగా చెప్పునదేమనగా, రేపు గర్విష్ఠులు, దుర్మార్గులందరు కొయ్యకాలువలె ఉందురు; వారిని నేను దహించివేయుదును, ఏలయనగా సైన్యములకు అధిపతియగు ప్రభువును నేను; బబులోనులో మిగిలిన వారిలో ఎవరిని నేను విడిచిపెట్టను.

25 కాబట్టి, మీరు నన్ను నమ్మినయెడల, నేటిదినముగా పిలువబడు దినమున మీరు పనిచేయుదురు.

26 నా సేవకులైన న్యూయెల్ కె. విట్నీ, సిడ్నీ గిల్బర్ట్‌లు ఇక్కడ ఉన్న తమ అంగడిని, ఆస్తులను అమ్ముట తగదు; ఏలయనగా ఈ ప్రదేశములో ఉన్న సంఘములో మిగిలిన వారందరు సీయోను ప్రదేశమునకు వెళ్ళువరకు దీనిని చేయుట వివేకము కాదు.

27 ఇదిగో, మీ శత్రువులకు అప్పు ఇచ్చియుండకూడదని నా శాసనములలో చెప్పబడినది లేదా నిషేధించబడినది;

28 కానీ ఇదిగో, ఆయనకు నచ్చినప్పుడు ప్రభువు తీసుకొని, ఆయన దృష్టికి అనుకూలమైనట్లుగా చెల్లించకూడదని ఎన్నడూ చెప్పబడలేదు.

29 కాబట్టి, మీరు ప్రతినిధులు గనుక మీరు ప్రభువు పనిలోనున్నారు; ప్రభువు చిత్తప్రకారము మీరేమి చేసినను అది ప్రభువు కార్యమగును.

30 వారు సీయోను ప్రదేశములో ఒక స్వాస్థ్యమును పొందునట్లు, తన పరిశుద్ధులకు ఈ అంత్యదినములలో సమకూర్చుటకు ఆయన మిమ్ములను నియమించెను.

31 ఇదిగో, వారు దానిని పొందుదురని ప్రభువైన నేను మీకు ప్రకటించుచున్నాను మరియు నా మాటలు ఖచ్చితమైనవి, అవి విఫలము కావు.

32 కానీ అన్ని విషయములు సరైన సమయములో వచ్చును.

33 కాబట్టి, మంచి చేయుట యందు విసుగులేకయుండుడి, ఏలయనగా మీరు ఒక గొప్ప కార్యమునకు పునాది వేయుచున్నారు. చిన్నవిషయముల నుండి గొప్ప సంగతులు సంభవించును.

34 ఇదిగో హృదయమును, సిద్ధమైన మనస్సును ప్రభువు కోరును; సమ్మతించువారును, విధేయులును ఈ అంత్యదినములలో భూమి యొక్క సారమును తిందురు.

35 తిరుగుబాటుదారులు సీయోను ప్రదేశమునుండి కొట్టివేయబడి, పంపివేయబడుదురు మరియు ఆ ప్రదేశమును స్వాస్థ్యముగా పొందరు.

36 ఏలయనగా, తిరుగుబాటుదారులు ఎఫ్రాయీము రక్తసంబంధులు కారు గనుక, వారు పెరికివేయబడుదురు.

37 ఇదిగో, జనములకు తీర్పుతీర్చుటకు ప్రభువైన నేను కొండమీద లేదా ఎత్తైన స్థలములో కూర్చొనియున్న న్యాయాధిపతివలె ఈ అంత్యదినములలో నా సంఘమును చేసియున్నాను.

38 అది జరుగునప్పుడు సీయోనుకు సంబంధించిన అన్ని సంగతులకు సీయోను నివాసులు తీర్పుతీర్చుదురు.

39 అబద్ధికులు, వేషధారులు వారి చేత నిరూపించబడుదురు మరియు అపొస్తలులు, ప్రవక్తలు కాని వారు తెలుపబడుదురు.

40 న్యాయాధిపతియైన బిషప్పు, అతని సలహాదారులు తమ గృహనిర్వాహకత్వములలో నమ్మకముగా నుండని యెడల వారు శిక్షించబడుదురు మరియు వారికి బదులుగా వేరొకరు నియమించబడుదురు.

41 ఏలయనగా ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, సీయోను వర్ధిల్లును, ప్రభువు మహిమ దానిపై నుండును;

42 ఆమె జనులకు ఒక ధ్వజముగా నుండును; పరలోకము క్రిందనున్న ప్రతి జనాంగము నుండి ఆమె యొద్దకు వచ్చెదరు.

43 భూజనాంగములు ఆమె వలన వణికి, దానిలో నివశించు భయంకరుల వలన భయపడు దినము వచ్చును. ప్రభువు దీనిని సెలవిచ్చెను. ఆమేన్.