లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 65


65వ ప్రకరణము

1831 అక్టోబరు 30న, ఒహైయోలోని హైరంలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ప్రార్థన గురించి ఇవ్వబడిన బయల్పాటు.

1–2, దేవుని రాజ్యపు తాళపుచెవులు భూమిమీద మనుష్యునికి ఇవ్వబడినవి, సువార్త విప్లవము విజయమునొందును; 3–6, పరలోకము యొక్క వెయ్యేండ్ల రాజ్యము వచ్చి, భూమి మీదనున్న దేవుని రాజ్యముతో చేరును.

1 ఇదిగో, పైనుండి క్రిందికి పంపబడిన దానివలెనున్న వాని స్వరమును ఆలకించుడి, ఆయన బలవంతుడును, శక్తిగలవాడైయున్నాడు, ఆయన భూదిగంతముల వరకు సంచరించును, ఆయన స్వరము మనుష్యులకు బయలువెళ్ళును—ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడి.

2 దేవుని రాజ్యపు తాళపుచెవులు భూమి మీద మనుష్యునికి ఇవ్వబడినవి మరియు చేతి సహాయము లేకుండా పర్వతమునుండి తీయబడిన రాయి భూమియంతటిని నింపు వరకు బయలువెళ్ళునట్లు, అక్కడినుండి సువార్త భూదిగంతముల వరకు బయలువెళ్ళును.

3 అవును, ఒక స్వరము కేకవేయుచున్నది—ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, గొఱ్ఱెపిల్ల పెండ్లివిందును సిద్ధపరచుడి, పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడుడి.

4 ప్రభువును ప్రార్థించుడి, ఆయన పరిశుద్ధ నామమునకు మొరపెట్టుడి, ఆయన అద్భుత కార్యములను ప్రజలకు తెలియజేయుడి.

5 ఆయన రాజ్యము భూమియంతటికి వెళ్ళి, దాని నివాసులు దానిని స్వీకరించి, రాబోవు దినముల కొరకు సిద్ధపడియుండుటకు ప్రభువుకు మొరపెట్టుడి—ఆ దినములలో మనుష్యకుమారుడు ఆయన మహిమాతేజస్సును ధరించి, భూమిమీద ఏర్పరచబడిన దేవుని రాజ్యమును కలుసుకొనుటకు పరలోకము నుండి క్రిందకు దిగివచ్చును.

6 కాబట్టి, పరలోకరాజ్యము వచ్చునట్లు, ఓ దేవా, నీవు భూమి మీదను అదేవిధముగా పరలోకమందును మహిమపరచబడునట్లు, నీ శత్రువులు జయించబడునట్లు దేవుని రాజ్యము ముందుకు వెళ్ళు గాక; ఏలయనగా ఘనత, శక్తి, మహిమ నిరంతరము నీవైయున్నవి. ఆమేన్.