లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 76


76వ ప్రకరణము

1832, ఫిబ్రవరి 16న హైరం, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, సిడ్నీ రిగ్డన్ లకివ్వబడిన ఒక దర్శనము. ఈ దర్శనము గూర్చిన వృత్తాంతమునకు ముందుమాటగా జోసెఫ్ స్మిత్ చరిత్ర ఇలా వివరించుచున్నది: “ఆమెర్స్ట్ సమావేశము నుండి తిరిగి వచ్చిన తరువాత, లేఖన అనువాదమును నేను పునఃప్రారంభించితిని. పొందబడిన వివిధ బయల్పాటుల నుండి నరుని రక్షణ గూర్చి తెలియజేయు అనేక ముఖ్యమైన అంశములు బైబిలు నుండి తీసివేయబడినవని లేదా అది సంపుటీకరించబడక మునుపు కోల్పోబడినవని ప్రస్ఫుటముగా కనబడుచున్నది. మిగిలిన సత్యముల నుండి స్పష్టమగుచున్నదేమనగా శరీరమందు చేయబడిన క్రియలను బట్టి దేవుడు ప్రతివానికి ప్రతిఫలము దయచేసిన యెడల, పరిశుద్ధుల నిత్య గృహము కొరకు ఉద్దేశింపబడిన ‘పరలోకము’ అను పదము ఒకటి కంటె ఎక్కువ రాజ్యములను కలిగియుండవలెను. దీనికి అనుగుణంగా, … పరిశుద్ధ యోహాను సువార్తను అనువదించుచుండగా నేను, పెద్దయైన రిగ్డన్ ఈ దర్శనమును చూచితిమి.” ఈ దర్శనము ఇవ్వబడినప్పుడు యోహాను 5:29ను ప్రవక్త అనువదించుచుండెను.

1–4, ప్రభువే దేవుడైయున్నాడు; 5–10, విశ్వాసులందరికి పరలోకరాజ్య మర్మములు బయలుపరచబడును; 11–17, సమస్త జనులు నీతిమంతుల లేదా అవినీతిమంతుల పునరుత్థానములో లేపబడుదురు; 18–24, అనేక ప్రపంచముల నివాసులు యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము ద్వారా దేవునికి కుమారులు, కుమార్తెలునై యున్నారు; 25–29, ఒక దేవదూత పతనమై అపవాది అయ్యెను; 30–49, నాశనపుత్రులు నిత్య నాశనమును భరించెదరు; ఇతరులంతా ఏదో ఒక విధమైన రక్షణను పొందెదరు; 50–70, సిలెస్టియల్ రాజ్యములో పైకెత్తబడువారి మహిమ, బహుమానము వివరించబడెను; 71–80, టెర్రెస్ట్రియల్ రాజ్యమును స్వాస్థ్యముగా పొందువారిని గూర్చి వివరించబడెను; 81–113, టిలెస్టియల్, టెర్రెస్ట్రియల్, సిలెస్టియల్ మహిమలలోనుండు వారి స్థితి వివరించబడెను; 114–119, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విశ్వాసులు దేవుని రాజ్యమర్మములను చూచి, గ్రహించెదరు.

1 ఓ పరలోకములారా వినుడి, ఓ భూలోకమా చెవియొగ్గుము, దాని నివాసులారా సంతోషించుడి, ఏలయనగా ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు.

2 ఆయన జ్ఞానము గొప్పది, ఆయన మార్గములు ఆశ్చర్యములు, ఆయన చేసిన వాటన్నిటిని ఎవరును కనుగొనలేరు.

3 ఆయన ఉద్దేశ్యములు విఫలము కావు, ఆయన చెయ్యి పట్టుకొని ఆపగలవాడెవడును లేడు.

4 నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఆయన ఏకరీతిగానున్నాడు మరియు ఆయన సంవత్సరములు తరుగవు.

5 కాబట్టి ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ప్రభువైన నేను నాకు భయపడువారి యెడల కరుణ, కృప కలిగియుండి, నీతితో, సత్యముతో అంతము వరకు నన్ను సేవించువారిని సత్కరించుటలో ఆనందించెదను.

6 వారి బహుమానము గొప్పది, వారి మహిమ నిత్యము నిలుచును.

7 వారికి నా మర్మములను, అనగా ప్రాచీన దినముల నుండి దాచబడిన మర్మములన్నిటిని తెలియజేసెదను, రాబోవు యుగములలో, నా రాజ్యమునకు సంబంధించిన అన్ని విషయములను గూర్చి నా చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున వారికి నేను తెలిపెదను.

8 నిత్యత్వపు ఆశ్చర్యకార్యములను వారు తెలుసుకొందురు, రాబోవు సంగతులను, అనేక తరముల సంగతులను నేను వారికి చూపెదను.

9 వారి జ్ఞానము గొప్పదగును, వారి గ్రహింపు పరలోకమును చేరును; వారి యెదుట జ్ఞానుల జ్ఞానము నశించును, వివేకుల వివేకము శూన్యమగును.

10 ఏలయనగా నా ఆత్మ ద్వారా వారిని నేను వెలిగించెదను, నా శక్తిచేత నా చిత్తము యొక్క మర్మములు—కంటికి కనబడని, చెవికి వినబడని, మనుష్య హృదయములో ప్రవేశించని సంగతులను వారికి నేను తెలిపెదను.

11 జోసెఫ్ స్మిత్ జూ., సిడ్నీ రిగ్డన్ అను మేము, ఫిబ్రవరి పదహారవ తేదీ, మన ప్రభువు సంవత్సరము పద్దెనిమిది వందల ముప్పై రెండున ఆత్మ వశులమై యుండగా—

12 ఆత్మ శక్తివలన మా కన్నులు తెరువబడినవి, దేవుని సంగతులను గ్రహించునట్లు మా మనోనేత్రములు వెలిగించబడినవి—

13 అనగా ఆరంభము నుండి ఉన్న ఆ సంగతులు లోకము రూపింపబడక మునుపు, ఆరంభము నుండి తండ్రి రొమ్మునున్న ఆయన అద్వితీయ కుమారుని ద్వారా తండ్రి చేత నియమించబడినవి;

14 ఆయనను గూర్చి మేము సాక్ష్యమిచ్చుచున్నాము; మేమిచ్చు సాక్ష్యము యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణత, కుమారుడైయున్న ఆయనను మేము చూచి, పరలోక దర్శనములో మేము ఆయనతో సంభాషించితిమి.

15 ఏలయనగా ప్రభువు మాకు అప్పగించిన అనువాద కార్యమును మేము చేయుచుండగా మేము యోహాను అయిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనమునకు వచ్చినప్పుడు, ఈ విధముగా మాకు ఇవ్వబడినది—

16 మృతుల పునరుత్థానమును గూర్చి మాట్లాడుచు, మనుష్య కుమారుని స్వరమును వినువారిని గూర్చి ఇలా చెప్పబడినది:

17 మంచిని చేసిన వారు నీతిమంతుల పునరుత్థానమునకును, చెడు చేసిన వారు అవినీతిమంతుల పునరుత్థానమునకు వచ్చెదరు.

18 ఇది మమ్ములను ఆశ్చర్యమునకు గురిచేసెను, ఏలయనగా అది మాకు ఆత్మవలన ఇవ్వబడెను.

19 ఈ సంగతులను మేము ధ్యానించుచుండగా ప్రభువు మా మనోనేత్రములను తాకగా, అవి తెరువబడి, ప్రభువు మహిమ మా చుట్టూ ప్రకాశించెను.

20 తండ్రి కుడిప్రక్కనున్న కుమారుని మహిమను మేము చూచి, ఆయన పరిపూర్ణతను పొందితిమి;

21 పరిశుద్ధ దేవదూతలను, ఆయన సింహాసనము యెదుట పవిత్రపరచబడిన వారు దేవుని ఆరాధించుటను, నిరంతరము ఆయనను ఆరాధించు గొఱ్ఱెపిల్లను చూచితిమి.

22 ఇప్పుడు, ఆయనను గూర్చి ఇవ్వబడిన అనేక సాక్ష్యముల తరువాత ఆయనను గూర్చి ఇచ్చు సాక్ష్యములన్నిటిలో ఇది చివరిది: అదేమనగా ఆయన సజీవుడు!

23 ఏలయనగా దేవుని కుడిచేతి వైపున ఆయనను మేము చూచితిమి; ఆయన తండ్రి యొక్క అద్వితీయుడని ఒక స్వరము సాక్ష్యము చెప్పుటను వింటిమి—

24 ఆయన చేత, ఆయన ద్వారా, ఆయన వలన ప్రపంచములు సృష్టించబడెను మరియు సృష్టించబడును, వాటి నివాసులు దేవునికి కుమారులు, కుమార్తెలునై యున్నారు.

25 దీనిని కూడా మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము, అదేమనగా దేవుని సన్నిధిలో అధికారము కలిగియుండిన ఒక దేవదూత, తండ్రి ప్రేమించిన, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారునికి విరోధముగా పోరాడి, దేవుని మరియు కుమారుని సన్నిధినుండి త్రోసివేయబడెను,

26 అతడు నాశనకారునిగా పిలువబడెను, ఏలయనగా వానిని గూర్చి పరలోకములు దుఃఖించెను—అతడే లూసిఫర్, తేజోపుత్రుడు.

27 మేము చూడగా, ఇదిగో అతడు పతనమైపోయెను! తేజోపుత్రుడు పతనమైపోయెను!

28 మేము ఇంకను ఆత్మయందు ఉండగా, మేము దర్శనమును వ్రాయవలెనని ప్రభువు మమ్ములను ఆజ్ఞాపించెను; ఏలయనగా మేము సాతానును చూచితిమి, ఆ ప్రాచీన సర్పము అనగా దెయ్యము, దేవునికి విరోధముగా పోరాడి, మన దేవుని యొక్కయు, ఆయన క్రీస్తు యొక్కయు రాజ్యమును తీసుకొనవలెనని ప్రయత్నించెను—

29 కాబట్టి, అతడు దేవుని పరిశుద్ధులతో యుద్ధము చేసి, వారిని చుట్టుముట్టును.

30 అతడు ఎవరితోనైతే యుద్ధము చేసి జయించెనో, వారి బాధలను దర్శనములో మేము చూచితిమి, అప్పుడు ప్రభువు స్వరము మమ్ములను చేరెను:

31 నా శక్తిని యెరిగి, దానిలో పాలివారిగ చేయబడి, దెయ్యము యొక్క శక్తిద్వారా దానికి వశమగుటకు అనుమతించి, సత్యమును తిరస్కరించి, నా శక్తిని సవాలు చేయు వారందరిని గూర్చి ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—

32 నాశన పుత్రులు వారే, వారు జన్మించకయుండిన యెడల వారికి మేలని వారిని గూర్చి నేను చెప్పుచున్నాను;

33 ఏలయనగా వారు ఉగ్రతాపాత్రమైన ఘటములు, నిత్యత్వమందు అపవాది మరియు అతని దూతలతో దేవుని ఉగ్రతను సహించుటకు నియమించబడిరి;

34 ఈ లోకమందైనను, రాబోవు లోకములోనైనను క్షమాపణ లేదని వారిని గూర్చి నేను చెప్పితిని—

35 పరిశుద్ధాత్మను పొందిన తరువాత దానిని తిరస్కరించిన వారై, తండ్రి యొక్క అద్వితీయ కుమారుని తిరస్కరించి, ఆయనను సిలువ వేసి, బాహటముగా అవమానపరచిరి.

36 అపవాది, అతని దూతలతో పాటు అగ్ని గంధకములతో మండుచున్న గుండములోనికి వెళ్ళువారు వీరే—

37 రెండవ మరణము ఎట్టి ప్రభావమును కలిగియుండని వారు వీరే;

38 అవును, ఆయన ఉగ్రతను అనుభవించిన తరువాత ప్రభువు అనుకూల సమయములో విమోచింపబడని వారు నిశ్చయముగా వీరే.

39 మిగిలిన వారందరు లోకములు సృష్టింపబడక మునుపు తండ్రి రొమ్మున ఉండి, వధించబడిన గొఱ్ఱెపిల్ల యొక్క విజయము, మహిమ ద్వారా, మృతుల పునరుత్థానమువలన ముందుకు తేబడెదరు.

40 పరలోకము నుండి వచ్చిన స్వరము మాకు సాక్ష్యమిచ్చిన సంతోషకర వర్తమానములు, సువార్త ఇదియే—

41 అదేమనగా, ఆయన అనగా యేసు, లోకము కొరకు సిలువ వేయబడుటకు, లోక పాపములను మోసుకొనిపోవుటకు, లోకమును పవిత్రపరచుటకు, దానిని సమస్త అవినీతినుండి శుద్ధిచేయుటకు ఈ లోకమునకు వచ్చెను.

42 తండ్రి ఆయన శక్తికి లోబరచిన, ఆయన వలన చేయబడిన వారందరు ఆయన ద్వారా రక్షింపబడుదురు;

43 తండ్రిని మహిమపరచిన కుమారుడిని, తండ్రి బయలుపరచిన తరువాత ఆయనను తిరస్కరించిన నాశనపుత్రులను తప్ప, తన హస్తకృత్యములన్నింటిని ఆయన రక్షించును.

44 కాబట్టి, వారిని తప్ప ఆయన అందరిని రక్షించును—వారి బాధ యేమనగా నిత్యత్వములో అపవాది, అతని దూతలతో పాలించుటకు వారు శాశ్వత శిక్షకు వెళ్ళుదురు, అది అంతములేని శిక్ష, నిత్య శిక్ష, అక్కడ వారి పురుగు చావదు, అగ్ని ఆరదు—

45 దాని అంతము, దాని స్థలము, వారి బాధ ఏ మనష్యుడును యెరుగడు;

46 దానిలో పాలుపంచుకొనునట్లు చేయబడిన వారు తప్ప మనుష్యునికి అది బయలుపరచబడలేదు, బయలుపరచబడుట లేదు, బయలుపరచబడదు;

47 అయినప్పటికీ, ప్రభువైన నేను, దర్శనము ద్వారా అనేకులకు దానిని చూపెదను, కానీ వెంటనే మరలా దానిని మూసివేయుదును;

48 కాబట్టి దాని అంతము, నిడివి, ఎత్తు, లోతు, దుర్దశను వారుగాని ఈ శిక్షకు నియమించబడిన వారు తప్ప మరే మనుష్యుడు గాని గ్రహింపరు.

49 ఈ విధముగా చెప్పుచున్న స్వరమును మేము వింటిమి: దర్శనమును వ్రాయుము, ఏలయనగా ఇదిగో, భక్తిహీనుల హింసల దర్శనము యొక్క ముగింపు ఇదియే.

50 మరలా మేము సాక్ష్యమిచ్చితిమి—ఏలయనగా మేము కని, వింటిమి మరియు నీతిమంతుల పునరుత్థానములో ముందుకు వచ్చువారిని గూర్చిన క్రీస్తు సువార్త యొక్క సాక్ష్యము ఇదియే—

51 వారెవరనగా యేసును గూర్చి సాక్ష్యమును పొందిన వారు, ఆయన నామమందు విశ్వసించి, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆయన సమాధి చేయబడిన విధముగా బాప్తిస్మము పొంది, ఆయన నామమందు నీటిలో సమాధి చేయబడిన వారు—

52 తద్వారా ఆజ్ఞలను పాటించుట ద్వారా వారు కడగబడి, వారి పాపములన్నిటి నుండి శుద్ధిచేయబడి, ఈ అధికారమునకు నియమించబడి, ముద్రించబడిన వాని హస్తనిక్షేపణము ద్వారా పరిశుద్ధాత్మను పొందెదరు;

53 వారు విశ్వాసము ద్వారా జయించి, న్యాయవంతులు, సత్యవంతులపై తండ్రి క్రుమ్మరించు పరిశుద్ధాత్మ వాగ్దానము ద్వారా ముద్రించబడినవారు.

54 వారెవరనగా జ్యేష్ఠుల సంఘపు వారు.

55 వారెవరనగా వారి చేతులకు తండ్రి అన్ని సంగతులను అప్పగించిన వారు—

56 వారెవరనగా ఆయన సంపూర్ణత్వమును, ఆయన మహిమను పొందిన యాజకులు, రాజులు;

57 మరియు వారు మెల్కీసెదెకు క్రమము ప్రకారము అనగా హనోకు క్రమము, అద్వితీయ కుమారుని క్రమము ప్రకారమైయున్న మహోన్నతుని యాజకులు.

58 కాబట్టి, వ్రాయబడియున్నట్లుగా వారు దేవుళ్ళు, అనగా దేవుని కుమారులు—

59 కావున, అన్ని సంగతులు—జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమున్న సంగతులు లేదా రాబోవు సంగతులు వారివే, అన్నీ వారివే, వారు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు.

60 వారు అన్ని విషయములను జయించెదరు.

61 కాబట్టి, ఏ మనుష్యుడును మనుష్యునియందు అతిశయించకూడదు, కానీ దేవుని యందు అతిశయించవలెను, ఆయన శత్రువులందరిని తన పాదముల క్రింద అణచివేయును.

62 వీరు దేవుని సన్నిధిలో, ఆయన యొక్క క్రీస్తుని సన్నిధిలో నిరంతరము నివసించెదరు.

63 భూమి మీద ఆయన ప్రజలను పరిపాలించుటకు పరలోకమునుండి మేఘములపైన వచ్చునప్పుడు ఆయన తనతో తీసుకొనివచ్చు వారు వీరే.

64 మొదటి పునరుత్థానములో పాలుపొందువారు వీరే.

65 నీతిమంతుల పునరుత్థానములో ముందుకు వచ్చువారు వీరే.

66 సీయోను పర్వతమునకు, సజీవుడగు దేవుని పట్టణమునకు, అన్నిటికంటె పరిశుద్ధమైన పరలోక ప్రదేశమునకు వచ్చువారు వీరే.

67 అసంఖ్యాకులైన దేవదూతల సమూహమునకు, సాధారణ సమాజమునకు, హనోకు మరియు జ్యేష్ఠుల సంఘమునకు వచ్చినవారు వీరే.

68 పరలోకములో పేర్లు వ్రాయబడిన వారు వీరే, అక్కడ దేవుడు మరియు క్రీస్తు అందరికి తీర్పుతీర్చును.

69 క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు ద్వారా పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులు వీరే, ఆయన తన రక్తమును చిందించుట ద్వారా ఈ పరిపూర్ణ ప్రాయశ్చిత్తము చేసెను.

70 సిలెస్టియల్ మహిమ శరీరములు కలవారు వీరే, వారి మహిమ సూర్యుని పోలియుండును, అది దేవుని మహిమ, అన్నిటికంటె ఉన్నతమైనది, ఆయన మహిమ లేఖనములలో వ్రాయబడినట్లుగా ఆకాశమందున్న సూర్యుని ప్రకాశమును పోలియున్నది.

71 మరలా, మేము టెర్రెస్ట్రియల్ లోకమును చూచితిమి, ఇదిగో, టెర్రెస్ట్రియల్ కు చెందిన వారు వీరే, వారి మహిమ ఆకాశమందు సూర్యుని కాంతి కంటె చంద్రుని కాంతి భిన్నముగానున్నట్లు, తండ్రి సంపూర్ణత్వమును పొందిన జ్యేష్ఠుల సంఘపు మహిమకంటే భిన్నముగానుండును.

72 ఇదిగో, ధర్మశాస్త్రము లేకుండా మరణించిన వారు వీరే;

73 చెరలో ఉంచబడిన మనుష్యుల ఆత్మలు వీరే, వారిని కుమారుడు దర్శించి, శరీరమందు మనుష్యులను బట్టి తీర్పు తీర్చబడుటకు వారికి సువార్తను ప్రకటించెను;

74 వారు యేసు యొక్క సాక్ష్యమును శరీరమందు పొందలేదు కానీ, తరువాత దానిని పొందిరి.

75 భూమిపైనున్న గౌరవనీయులైన మనుష్యులు వీరే, వారు మనుష్యుల కపటము చేత గ్రుడ్డివారిగా చేయబడిరి.

76 వీరు ఆయన మహిమను పొందుదురు గాని సంపూర్ణముగా కాదు.

77 వీరు కుమారుని సన్నిధిని పొందుదురు గాని తండ్రి యొక్క సంపూర్ణత్వమును కాదు.

78 కాబట్టి, వారు టెర్రెస్ట్రియల్ శరీరులు గాని, సిలెస్టియల్ శరీరులు కారు, చంద్రుడు సూర్యుని నుండి భిన్నముగా ఉన్నవిధముగా వీరు మహిమలో భిన్నముగా నుందురు.

79 యేసు సాక్ష్యమందు శూరులుగా ఉండనివారు వీరే; కాబట్టి, వారు మన దేవుని రాజ్యములో కిరీటమును పొందరు.

80 ఇప్పుడు టెర్రెస్ట్రియల్ గురించి మేము చూచిన దర్శనమునకు ముగింపు ఇదియే, మేము ఇంకను ఆత్మయందుండగా దానిని వ్రాయమని ప్రభువు మమ్మును ఆజ్ఞాపించెను.

81 మరలా, మేము టిలెస్టియల్ మహిమను చూచితిమి, దాని మహిమ ఆకాశమందు నక్షత్రముల మహిమ, చంద్రుని మహిమకంటె భిన్నముగానున్న విధముగా తక్కువ మహిమను పోలియున్నది.

82 క్రీస్తు సువార్తనైనను, సాక్ష్యమునైనను పొందని వారు వీరే.

83 పరిశుద్ధాత్మను తిరస్కరించని వారు వీరే.

84 నరకమునకు పడద్రోయబడువారు వీరే.

85 చివరి పునరుత్థానము వరకు ప్రభువు అనగా గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు, తన కార్యమును ముగించువరకు అపవాది నుండి విమోచింపబడని వారు వీరే.

86 నిత్య లోకములో ఆయన సంపూర్ణత్వమును పొందలేదు, కానీ టెర్రెస్ట్రియల్ పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత్వమును పొందిన వారు వీరే.

87 సిలెస్టియల్ పరిచర్య ద్వారా టెర్రెస్ట్రియల్ దానిని పొందును.

88 వారికి పరిచర్య చేయుటకు నియమించబడిన దేవదూతల పరిచర్య ద్వారా, లేదా దాని కొరకు పరిచర్య చేయు ఆత్మలుగా నియమించబడిన వారి ద్వారా దానిని టిలెస్టియల్ రాజ్యము పొందును; ఆ విధముగా వారు రక్షణకు వారసులగుదురు.

89 ఆలాగున సమస్త జ్ఞానమును మించిన టిలెస్టియల్ మహిమను పరలోక దర్శనమందు మేము చూచితిమి;

90 దేవుడు బయలుపరచిన వారు తప్ప దానిని ఏ మనుష్యుడును యెరుగడు.

91 కాబట్టి అన్ని విషయములలో అనగా మహిమయందు, శక్తియందు, బలమందు, ఏలుటయందు టిలెస్టియల్ మహిమను మించిన టెర్రెస్ట్రియల్ మహిమను మేము చూచితిమి.

92 సిలెస్టియల్ మహిమను కూడా మేము చూచితిమి, అది అన్ని విషయములలో అతిశయించును—అక్కడ తండ్రియైన దేవుడు తన సింహాసనము మీద నిరంతరము పరిపాలించును;

93 ఆయన సింహాసనము యెదుట అన్ని విషయములు భయభక్తులతో సాగిలపడి, ఆయనకు నిరంతరము మహిమను ఇచ్చును.

94 ఆయన సన్నిధిలో జీవించువారు జ్యేష్ఠుల సంఘము వారు; ఆయన సంపూర్ణత్వమును, ఆయన మహిమను పొందినవారై అవి చూడబడిన విధముగా వారు చూచెదరు, అవి తెలియబడిన విధముగా వారు తెలుసుకొందురు;

95 ఆయన వారిని అధికారమందును, బలమందును, ఏలుటయందును సమానముగా చేయును.

96 సూర్యుని మహిమ వేరుగా ఉన్నవిధముగా సిలెస్టియల్ మహిమ వేరుగానున్నది.

97 చంద్రుని మహిమ వేరుగా ఉన్నవిధముగా, టెర్రెస్ట్రియల్ మహిమ వేరుగానున్నది.

98 నక్షత్రముల మహిమ వేరుగా ఉన్నవిధముగా టిలెస్టియల్ మహిమ వేరుగానున్నది; ఏలయనగా మహిమయందు ఒక నక్షత్రమునకు ఇంకొక నక్షత్రమునకు బేధమున్నట్లుగానే, టిలెస్టియల్ లోకములో ఒకని నుండి మరొకనికి మహిమలో బేధముండును;

99 ఏలయనగా వీరు పౌలు వారును, అపొల్లో వారును, కేఫా వారునైయున్నారు.

100 కొందరు ఒకని వారని, కొందరు మరొకని వారని—కొందరు క్రీస్తువారని, కొందరు యోహాను వారని, కొందరు మోషేవారని, కొందరు ఏలీయా వారని, కొందరు యెషయా వారని, కొందరు హనోకు వారని చెప్పుకొను వారు వీరే;

101 కానీ సువార్తనైనను, యేసు సాక్ష్యమునైనను, ప్రవక్తల సాక్ష్యమునైనను, నిత్య నిబంధననైనను స్వీకరించలేదు.

102 అన్నిటికంటే చివరగా, జ్యేష్ఠుల సంఘము యొద్దకు కొనిపోబడి, మేఘములలోనికి స్వీకరించబడుటకు పరిశుద్ధులతో కలుసుకొనని వారు వీరే.

103 అబద్ధికులు, సోదెగాండ్రు, వ్యభిచారులు, వేశ్యాసాంగత్యమును కోరువారు, అబద్ధమును ప్రేమించి దానిని సృష్టించువారు వీరే.

104 భూమి మీద దేవుని ఉగ్రతను అనుభవించునది వీరే.

105 నిత్యాగ్నియను ప్రతీకారముతో బాధపడునది వీరే.

106 వారు నరకమునకు పడద్రోయబడి, కాలముల పరిపూర్ణత వరకు సర్వశక్తిమంతడైన దేవుని ఉగ్రతతో బాధపడుదురు, అప్పుడు క్రీస్తు శత్రువులందరిని తన పాదముల క్రింద అణచివేయును, ఆయన కార్యమును పరిపూర్ణము చేయును;

107 అప్పుడు ఆయన రాజ్యమును మచ్చలేనిదిగా తండ్రికి అప్పగించుచు చెప్పును: నేను జయించితిని, ఒంటరిగా ద్రాక్షగానుగను అనగా సర్వశక్తిమంతుని కోపోగ్రతయను ద్రాక్షగానుగను త్రొక్కితిని.

108 అప్పుడు ఆయన తన శక్తిగల సింహాసనముపైన కూర్చొని, నిరంతరము పరిపాలించుటకు మహిమకిరీటమును ధరించును.

109 కానీ ఇదిగో, టిలెస్టియల్ లోకపు నివాసులను, మహిమను మేము చూచితిమి, వారు ఆకాశమందలి నక్షత్రములు లేదా సముద్రతీరమున ఇసుకరేణువులంత విస్తారముగాయుండిరి;

110 వీరందరు మోకాళ్ళపై వంగెదరు, నిరంతరము సింహాసనముపై కూర్చొను ఆయనను ప్రతి నాలుక ఒప్పుకొనును అని చెప్పుచున్న ప్రభువు స్వరమును వింటిమి;

111 ఏలయనగా వారి కార్యములను బట్టి వారు తీర్పుతీర్చబడుదురు, ప్రతి మనుష్యుడు తాను చేయు పనులను బట్టి, సిద్ధపరచబడిన నివాసములలో తన ఆధిపత్యమును పొందును;

112 మహోన్నతునికి వారు దాసులుగానుందురు; కానీ ఎక్కడ దేవుడు, క్రీస్తు నివశించునో అక్కడకి వారు అంతములేని లోకముల కాలపరిమితి వరకు రాలేరు.

113 మేము చూచిన దర్శనము యొక్క అంతము ఇదియే, మేమింకను ఆత్మయందుండగా దానిని వ్రాయమని మేము ఆజ్ఞాపించబడితిమి.

114 కానీ ప్రభువు కార్యములు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, ఆయన మాకు చూపిన తన రాజ్య మర్మములు, మహిమయందు, బలమునందు, ఆధిక్యమందు సమస్త జ్ఞానమును మించును;

115 మేమింకను ఆత్మయందుండగా వాటిని వ్రాయవద్దని ఆయన మమ్మును ఆజ్ఞాపించెను, వాటిని పలుకుటకు మనుష్యుడు తగడు;

116 వాటిని తెలియజేయుటకు మనుష్యుడు సమర్థుడు కాడు, ఏలయనగా అవి కేవలము పరిశుద్ధాత్మ శక్తి వలననే చూచి, గ్రహింపవలెను; ఆయనను ప్రేమించి, ఆయన యెదుట తమనుతాము పరిశుద్ధపరచుకొనువారిపై దేవుడు వాటిని క్రుమ్మరించును;

117 వారికి తమకుతాముగా చూచుటకు, తెలుసుకొనుటకు ఆయన విశేషాధికారమును అనుగ్రహించును;

118 శరీరమందున్నప్పుడు ఆత్మ యొక్క శక్తి మరియు ప్రత్యక్షతల ద్వారా మహిమ లోకములో ఆయన సన్నిధిని వారు సహింపగలరు.

119 దేవునికి, గొఱ్ఱెపిల్లకు మహిమ, ఘనత, ప్రభావము నిరంతరము కలుగును గాక. ఆమేన్.