లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 88


88వ ప్రకరణము

1832, డిసెంబరు 27 మరియు 28 తేదీలలో, మరియు 1833, జనవరి 3న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ప్రవక్త దీనిని “మనకు ప్రభువు ఇచ్చిన శాంతి సందేశము, పరదైసు అనబడే చెట్టునుండి తుంచబడిన … ఒలీవ ఆకు” అని అభివర్ణించెను. ఒక సమావేశములో ప్రధాన యాజకులు “సీయోను యొక్క నిర్మాణము గురించి ఆయన చిత్తాన్ని బయలుపరచాలని వేర్వేరుగా, కంఠధ్వనితో” ప్రార్థించగా ఈ బయల్పాటు ఇవ్వబడెను.

1–5, విశ్వాసులైన పరిశుద్ధులు నిత్యజీవపు వాగ్దానమైన ఆ పరిశుద్ధాత్మను పొందెదరు; 6–13, క్రీస్తు వెలుగుతో అన్ని విషయములు నియంత్రించబడి, నిర్వహించబడుచున్నవి; 14–16, విమోచన వలన పునరుత్థానము కలుగును; 17–31, సిలెస్టియల్, టెర్రెస్ట్రియల్, లేదా టిలెస్టియల్ ధర్మశాస్త్రములకు విధేయత ఆయా రాజ్యములకు, మహిమలకు మనుష్యులను సిద్ధపరచును; 32–35, పాపమునందు జీవించుటకు సమ్మతించువారు ఇంకను అపవిత్రులుగానుందురు; 36–41, అన్ని రాజ్యములు ధర్మశాస్త్రమువలన పరిపాలించబడును; 42–45, అన్ని విషయాలకు దేవుడు ఒక ధర్మశాస్త్రమును ఇచ్చెను; 46–50, నరుడు దేవుడిని కూడా తెలుసుకొనును; 51–61, పొలములోనికి తన సేవకులను పంపి, తరువాత వారిని దర్శించిన ఒక మనుష్యుని ఉపమానము; 62–73, ప్రభువు చెంతకు రండి, ఆయన ముఖమును మీరు చూచెదరు; 74–80, మిమ్ములను మీరు పవిత్రపరచుకొని, పరలోకరాజ్య సిద్ధాంతములను ఒకరికొకరు బోధించుకొనుడి; 81–85, హెచ్చరించబడిన ప్రతివాడును తన పొరుగువానిని హెచ్చరించవలెను; 86–94, సూచనలు, పంచ భూతములు లయమైపోవుట, దేవదూతలు ప్రభువు రాకడకు మార్గమును సిద్ధపరచును; 95–102, దూతల బూరలు మృతులను వారి క్రమము చొప్పున పిలుచును; 103–116, దూతల బూరలు సువార్త పునరుద్ధరణను, బబులోను పతనమును, మహోన్నతుడైన దేవుని యొక్క యుద్ధమును ప్రకటించును; 117–126, నేర్చుకొనుటకు ప్రయాసపడుడి, దేవుని మందిరము (దేవాలయము)ను స్థాపించుడి, దాతృత్వమను బంధముతో మిమ్ములను మీరు ధరించుకొనుడి; 127–141, పాదములు కడుగు విధితో పాటు ప్రవక్తల పాఠశాల యొక్క క్రమము ఏర్పరచబడినది.

1 మిమ్ములను గూర్చి ఆయన చిత్తమును పొందుటకు కూడివచ్చిన మీతో ప్రభువు నిశ్చయముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు:

2 ఇదిగో, మీ ప్రభువుకు ఇది సంతోషకరముగానుండెను, మిమ్ములను గూర్చి దేవదూతలు ఆనందించుచున్నారు; మీ ప్రార్థనార్పణలు సైన్యములకధిపతియగు ప్రభువు చెవులలోనికి వచ్చియున్నవి మరియు పరిశుద్ధపరచబడిన సిలెస్టియల్ లోకమునకు చెందిన వారి యొక్క నామముల గ్రంథమునందు అవి నమోదు చేయబడియున్నవి.

3 కాబట్టి, ఇప్పుడు నేను మరియొక ఆదరణకర్తను నా స్నేహితులైన మీ యొద్దకు పంపుచున్నాను, తద్వారా ఆయన మీ హృదయములలో నిలిచియుండును, అది పరిశుద్ధాత్మ వాగ్దానము; ఆ మరియొక ఆదరణకర్తయు, యోహాను సాక్ష్యమునందు లిఖించబడినట్లుగా నా శిష్యులకు నేను వాగ్దానము చేసినదియు ఒక్కటే.

4 ఈ ఆదరణకర్త నిత్య జీవమును గూర్చి నేను మీకు ఇచ్చిన వాగ్దానము, అనగా సిలెస్టియల్ రాజ్యము యొక్క మహిమయైయున్నది.

5 ఆ మహిమ జ్యేష్ఠుల సంఘము యొక్క మహిమను పోలియుండును, అనగా అందరికంటే పరిశుద్ధుడైన దేవుని మహిమను పోలియుండును, దానిని ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా పొందెదరు—

6 ఆయన అన్ని విషయములను గ్రహించుటకు, ఆయన అన్నిటిలోను, అన్నిటియందు ఉండుటకు, సత్యమునకు వెలుగైయుండుటకు ఆయన పైకి ఆరోహణమైనట్లుగానే అన్నిటికంటే క్రిందకు కూడా దిగెను;

7 ఆ సత్యము ప్రకాశించుచున్నది. ఇది క్రీస్తు వెలుగు. ఆవిధముగానే ఆయన ప్రభావము సూర్యునియందు, సూర్యుని వెలుగునందు, అది రూపించబడిన శక్తియందు కూడా ఉన్నది.

8 ఆవిధముగానే ఆయన ప్రభావము చంద్రునియందు, చంద్రుని వెలుగునందు, అది రూపించబడిన శక్తియందు కూడా ఉన్నది.

9 ఆవిధముగానే నక్షత్రముల వెలుగునందు, అవి రూపించబడిన శక్తియందు కూడా ఉన్నది.

10 భూమి, అనగా మీరు నిలిచియున్న భూమి, దాని యొక్క వెలుగు కూడా ఆయనే.

11 మీకు వెలుగునిచ్చు ప్రకాశించుచున్న వెలుగు, మీ కన్నులను వెలుగుతో నింపు ఆయన ద్వారానే కలుగుచున్నది, ఆ వెలుగే మీ గ్రహింపును అధికము చేయుచుండెను;

12 ఆ వెలుగు అనంత విశ్వమును నింపుటకు దేవుని సన్నిధినుండి బయలువెళ్ళుచున్నది—

13 అన్నిటియందు ఉండి, అన్నిటికి జీవమునిచ్చుచున్నది, అది అన్నిటిని పరిపాలించు ధర్మశాస్త్రము అనగా తన సింహాసనముమీద ఆసీనుడైయున్న దేవుని శక్తియై యున్నది, ఆయన నిత్యత్వమను రొమ్మున ఆనుకొని, అన్నిటికి మధ్యనున్నాడు.

14 ఇప్పుడు, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మీ కొరకు చేయబడిన విమోచన ద్వారా మృతుల పునరుత్థానము కలుగజేయబడును.

15 ఆత్మ, శరీరము నరుని ప్రాణమైయున్నవి.

16 మృతుల పునరుత్థానమనగా ప్రాణము యొక్క విమోచన.

17 ప్రాణము యొక్క విమోచన సమస్తమునకు జీవమునిచ్చు ఆయన ద్వారా కలుగును, భూమిపై నివసించు బీదలు, సాత్వీకులు దానిని స్వాస్థ్యముగా పొందెదరని ఆయన రొమ్మునందు శాసనము వ్రాయబడియున్నది.

18 కాబట్టి, అది సిలెస్టియల్ మహిమకు సిద్ధపరచబడునట్లు సమస్త దుర్నీతి నుండి పరిశుద్ధపరచబడవలెను;

19 ఏలయనగా దాని సృష్టి ఉద్దేశ్యమును నెరవేర్చిన తరువాత, అది మహిమను, తండ్రియైన దేవుని సన్నిధిని కూడా కిరీటముగా పొందును;

20 తద్వారా సిలెస్టియల్ రాజ్యమునకు చెందిన శరీరులు దానిని యుగయుగములు పొందెదరు; ఈ ఉద్దేశ్యము కొరకే అది రూపించబడి, సృష్టించబడినది, ఈ ఉద్దేశ్యము కొరకే వారు పరిశుద్ధపరచబడిరి.

21 నేను మీకు ఇచ్చియున్న ధర్మశాస్త్రము, అనగా క్రీస్తు ధర్మశాస్త్రము వలన పరిశుద్ధపరచబడని వారు, మరియొక రాజ్యమును అనగా టెర్రెస్ట్రియల్ రాజ్యము వంటిది లేదా టిలెస్టియల్ రాజ్యము వంటి దానిని స్వాస్థ్యముగా పొందవలెను.

22 ఏలయనగా సిలెస్టియల్ రాజ్యపు ధర్మశాస్త్రమును గైకొనలేని వాడు సిలెస్టియల్ మహిమను సహింపలేడు.

23 టెర్రెస్ట్రియల్ రాజ్యపు ధర్మశాస్త్రమును గైకొనలేనివాడు టెర్రెస్ట్రియల్ మహిమను సహింపలేడు.

24 టిలెస్టియల్ రాజ్యపు ధర్మశాస్త్రమును గైకొనలేనివాడు టిలెస్టియల్ మహిమను సహింపలేడు; కాబట్టి అతడు ఏ మహిమ రాజ్యమునకు అర్హుడు కాడు. కాబట్టి మహిమ రాజ్యము కానీ ఒక రాజ్యమును అతడు సహింపవలెను.

25 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, సిలెస్టియల్ రాజ్యపు ధర్మశాస్త్రమును భూమి గైకొనుచుండెను, ఏలయనగా అది దాని సృష్టి ఉద్దేశ్యమును నెరవేర్చుచుచు, ధర్మశాస్త్రమును అతిక్రమించుట లేదు—

26 కాబట్టి, అది పరిశుద్ధపరచబడును; అది మరణించినను తిరిగి బ్రతికింపబడును, అది బ్రతికింపబడిన శక్తివలన తాళును, దానిని నీతిమంతులు స్వాస్థ్యముగా పొందుదురు.

27 ఏలయనగా వారు మరణించినను, ఆత్మీయ శరీరముతో వారు కూడా తిరిగి లేచెదరు.

28 సిలెస్టియల్ ఆత్మను కలిగియున్నవారు ప్రకృతి సంబధమైన శరీరమువంటి శరీరమునే పొందెదరు; ఆవిధముగానే మీరు మీ శరీరములను పొందెదరు, ఏ మహిమ వలన మీ శరీరములు బ్రతికింపబడునో ఆ మహిమనే మీరు పొందుదురు.

29 సిలెస్టియల్ మహిమలో కొంత భాగముతో బ్రతికింపబడిన మీరు దానినే సంపూర్ణముగా పొందెదరు.

30 టెర్రెస్ట్రియల్ మహిమలో కొంత భాగముతో బ్రతికింపబడినవారు దానినే సంపూర్ణముగా పొందెదరు.

31 టిలెస్టియల్ మహిమలో కొంత భాగముతో బ్రతికింపబడినవారు దానినే సంపూర్ణముగా పొందెదరు.

32 మిగిలినవారు కూడా బ్రతికింపబడుదురు; అయినప్పటికీ, వారు స్వీకరించుటకు సమ్మతించు దానిని ఆనందించుటకు తమ స్వస్థలమునకు తిరిగివెళ్ళుదురు, ఎందుకనగా వారు పొందగలిగే దానిని ఆనందించుటకు వారు సమ్మతించలేరు.

33 ఒక మనుష్యునిపై ఒక బహమానము ప్రోక్షించబడి, అతడు ఆ బహుమానము పొందనియెడల వానికేమి ప్రయోజనము? ఇదిగో, అతనికి ఇవ్వబడిన దానియందు గాని, ఆ బహుమానము ఇచ్చిన వానియందు గాని అతడు సంతోషించడు.

34 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ధర్మశాస్త్రము వలన పరిపాలించబడునది, ధర్మశాస్త్రము వలనే భద్రపరచబడును, దానివలనే పరిపూర్ణము చేయబడి, పరిశుద్ధపరచబడును.

35 ధర్మశాస్త్రమును మీరి, ధర్మశాస్త్రము వలన జీవింపక, దానంతట అదే ధర్మశాస్త్రముగా అగుటకు ప్రయత్నించుచు, పాపమందు ఉండుటకు ఇష్టపడి, పూర్తిగా పాపములో ఉండునది, ధర్మశాస్త్రము వలనైనను, కరుణ, న్యాయము, తీర్పువలననైనను పరిశుద్ధపరచబడలేదు. కాబట్టి వారు ఇంకను అపరిశుద్ధులుగానే ఉండవలెను.

36 అన్ని రాజ్యములకు ఒక ధర్మశాస్త్రము ఇవ్వబడెను;

37 మరియు అనేక రాజ్యములు కలవు; రాజ్యము లేని స్థలమేదియు లేదు; గొప్పదైనను, తక్కువదైనను స్థలము లేని రాజ్యమేదియు లేదు.

38 ప్రతి రాజ్యమునకు ధర్మశాస్త్రము ఇవ్వబడెను; ప్రతి ధర్మశాస్త్రమునకు కొన్ని నిర్దిష్టమైన పరిమితులు, షరతులు కలవు.

39 ఆ షరతులకు లోబడి జీవించని సర్వ శరీరులు నీతిమంతులుగా యెంచబడరు.

40 ఏలయనగా మేధస్సు మేధస్సును అంటిపెట్టుకొనియుండును; జ్ఞానము జ్ఞానమును స్వీకరించును; సత్యము సత్యమును హత్తుకొనియుండును; సద్గుణము సద్గుణమును ప్రేమించును; వెలుగు వెలుగును అంటిపెట్టికొనియుండును; కరుణ కరుణపై జాలి కలిగియుండును, ఆమె తనవారిపై హక్కును కలిగియుండును; న్యాయము తన మార్గములో కొనసాగును, అది తనవారిపై హక్కును కలిగియుండును; తన సింహాసనముపై కూర్చొని, అన్నిటిని పరిపాలించుచు, ఆచరణలో పెట్టుచుండిన ఆయన యెదుటకు తీర్పు వెళ్ళుచున్నది.

41 ఆయన అన్ని విషయములను గ్రహించును, అన్ని సంగతులు ఆయన యెదుటనున్నవి, అన్ని సంగతులు ఆయనకు సమీపములోనున్నవి; ఆయన అన్నిటికి పైన, అన్నిటిలోను, అన్నిటికి సమీపములో నున్నాడు, అన్ని సంగతులు యుగయుగముల వరకు దేవుడైన ఆయన వలన, ఆయన మూలముగా కలుగుచున్నవి.

42 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అన్నిటికి ఆయన ఒక ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, దాని వలన అవి తమతమ సమయములందు తమతమ కాలములయందు కదులుచున్నవి;

43 వాటి మార్గములు, అనగా భూమియు సమస్త గ్రహములను కలిపి పరలోకము, భూమి యొక్క మార్గములు స్థిరముగానున్నవి.

44 వాటి సమయములందు, వాటి కాలములందు, వాటి నిమిషములందు, వాటి గడియలందు, వాటి దినములందు, వాటి వారములందు, వాటి నెలలయందు, వాటి సంవత్సరములందు అవి ఒకదాని కొకటి వెలుగునిచ్చును—ఇవన్నియు దేవునికి ఒక సంవత్సరమువలె ఉన్నవి గాని మనుష్యునికి కాదు.

45 దేవుని శక్తి నడుమ భూమి తన రెక్కలపై దొర్లును, సూర్యుడు పగలు తన వెలుగునిచ్చును, చంద్రుడు రాత్రియందు తన వెలుగునిచ్చును, నక్షత్రములు వాటి మహిమయందు తమ రెక్కలపై దొర్లుచూ వాటి వెలుగునిచ్చును.

46 మీరు గ్రహించునట్లు ఈ రాజ్యములను వేటితో నేను పోల్చవలెను?

47 ఇదిగో ఇవన్నియు రాజ్యములైయున్నవి, వీటిలో దేనినైనా లేదా వీటిలో అల్పమైనదానిని చూచిన నరుడు దేవుడు తన మహత్యమునందును, ప్రభావమునందును సంచరించుటను చూచియుండెను.

48 అతడు ఆయనను చూచియుండెనని నేను చెప్పుచున్నాను; అయినప్పటికీ, తన స్వజనుల యొద్దకు వచ్చినవాడు తెలుసుకొనబడలేదు.

49 వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను; అయినప్పటికీ, ఒక దినము వచ్చును, ఆయన యందు ఆయన వలన బ్రతికింపబడిన మీరు అప్పుడు దేవుడిని కూడా చూచెదరు.

50 అప్పుడు మీరు నన్ను చూచిరని, నేను ఉన్నవాడనని, మీయందున్న నిజమైన వెలుగని, మీరు నా యందు ఉన్నారని మీరు తెలుసుకొందురు; లేనియెడల మీరు వర్థిల్లలేరు.

51 ఇదిగో, పొలమును కలిగిన ఒక మనుష్యునితో ఈ రాజ్యములను నేను పోల్చెదను, పొలములో త్రవ్వుటకు అతడు తన పనివారిని పంపెను.

52 అతడు మొదటి వానితో ఇట్లనెను: నీవు వెళ్ళి పొలములో పనిచేయుము, మొదటి గడియలో నేను నీ యొద్దకు వచ్చెదను, నీవు నా ముఖములో సంతోషమును చూచెదవు.

53 అతడు రెండవ వానితో ఈలాగు చెప్పెను: నీవు కూడా పొలములోకి వెళ్ళుము, రెండవ గడియలో నా ముఖములో సంతోషముతో నేను నిన్ను దర్శించెదను.

54 అలాగే మూడవ వానితో చెప్పెను: నేను నిన్ను దర్శించెదను;

55 నాల్గవ వానితోను, పన్నెండవ వానివరకు అలాగే చెప్పెను.

56 ఆ పొలము యొక్క యజమాని మొదటి గడియలో మొదటి వాని యొద్దకు వెళ్లెను, ఆ గడియ అంతయు వానితోనుండెను, అతని యజమాని యొక్క ముఖకాంతితో అతడు సంతోషపరచబడెను.

57 తరువాత అతడు రెండవ వానిని, మూడవ వానిని, నాల్గవ వానిని ఆ విధముగా పన్నెండవ వానిని దర్శించుటకు మొదటి వాని యొద్ద నుండి బయలుదేరెను.

58 గనుక వారందరు వారి యజమాని ముఖకాంతిని పొందిరి, ప్రతి మనుష్యుడు తన గడియలో, తన సమయమందు తన కాలమందు—

59 మొదటి వానినుండి మొదలుకొని, ఆ విధముగా చివరివాని వరకు, చివరివానినుండి మొదలుకొని మొదటివాని వరకు, మొదటివాని నుండి మొదలుకొని చివరివాని వరకు;

60 వాని యందు తన యజమాని మహిమపరచబడుటకు తద్వారా అందరు మహిమపరచబడుటకు తన యజమాని వానికి ఆజ్ఞాపించిన ప్రకారము తన గడియ ముగియు వరకు ప్రతి మనుష్యుడు తన క్రమము చొప్పున పొందెను.

61 కాబట్టి, ఈ ఉపమానముతో ఈ రాజ్యములను, దాని నివాసులను పోల్చెదను—ప్రతి రాజ్యమును దాని గడియలో, దాని సమయములో, దాని కాలములో దేవుడు చేసిన శాసనము ప్రకారము పోల్చెదను.

62 నా స్నేహితులారా, మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నేను సమీపములోనుండగా మీరు నాకు ప్రార్థించాలని నేను మీకు ఇచ్చియున్న ఆజ్ఞతోపాటు మీ హృదయాలలో ధ్యానించుటకు ఈ మాటలను నేను మీకిచ్చుచున్నాను.

63 నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వచ్చెదను; శ్రద్ధతో నన్ను వెదకుడి, మీరు నన్ను కనుగొందురు; అడుగుడి, మీకు ఇవ్వబడును; తట్టుడి, మీకది తెరువబడును.

64 తండ్రిని నా నామమున మీరేమి అడిగినను, మీకు యుక్తమైనది మీకు ఇవ్వబడును;

65 మీకు యుక్తము కానిది మీరు అడిగిన యెడల, అది మీకు శిక్షావిధిగా మారును.

66 ఇదిగో, మీరు వినునది అరణ్యములో కేక వేయుచున్న ఒకని స్వరమువలెనున్నది—ఎందుకనగా అరణ్యములో వానిని మీరు చూడలేరు—నా స్వరము వినలేరు, ఎందుకనగా నా స్వరము ఆత్మయైయున్నది; నా ఆత్మ సత్యమైయున్నది; సత్యము నిలుచును మరియు దానికి అంతము లేదు; అది మీలోనుండిన యెడల అది వర్ధిల్లును.

67 నా మహిమ కొరకు మీ కన్ను తేటగానుండిన యెడల, మీ దేహములు అంతయు వెలుగుతో నింపబడును, మీలో చీకటి ఏదియు ఉండదు; వెలుగుతో నిండిన దేహము అన్ని సంగతులను గ్రహించును.

68 కాబట్టి, మీ మనస్సులు దేవునికి తేటగానుండునట్లు మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి, మీరు ఆయనను చూచు దినములు వచ్చును; ఏలయనగా ఆయన తన ముఖము యొక్క ముసుగును మీ యెదుట తొలగించును, అది ఆయన స్వకాలములో, ఆయన స్వమార్గములో, ఆయన చిత్తము చొప్పున జరుగును.

69 నేను మీకు చేసియున్న చివరిదైన గొప్ప వాగ్దానమును జ్ఞాపకము చేసుకొనుము; మీ వ్యర్థమైన ఆలోచనలను, మీ అధికమైన హాస్యమును మీ నుండి దూరముగా పారద్రోలుము.

70 ఇక్కడ ఉండుడి, ఈ ప్రదేశములో మీరు ఉండుడి, ఈ చివరి రాజ్యములో మొదటి పనివారితో ఒక వ్రతదినమును ఏర్పాటు చేయుడి.

71 వారి ప్రయాణములో వారిచే హెచ్చరించబడినవారు ప్రభువును వేడుకొనవలెను, వారు పొందిన హెచ్చరికను కొద్దికాలము వరకు వారి హృదయాలలో ధ్యానించవలెను.

72 ఇదిగో చూడుడి, మీ మందలను నేను సంరక్షించెదను, పెద్దలను సిద్ధపరచి వారి యొద్దకు పంపెదను.

73 ఇదిగో, తగిన కాలమందు నా కార్యమును నేను త్వరపెట్టుదును.

74 నేను చివరి రాజ్యములో మొదటి పనివారైన మీకు ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నాను, అదేమనగా మీకు మీరుగా కూడివచ్చి, మిమ్ములను మీరు ఏర్పరచుకొనుడి, మీకు మీరు సిద్ధపడుడి, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి; అవును, నేను మిమ్ములను పవిత్రులుగా చేయుటకు మీ హృదయములను శుద్ధిచేసికొనుడి, మీ చేతులను, మీ పాదములను కడుగుకొనుడి.

75 తద్వారా ఈ దుష్టతరము రక్తమునుండి మీరు పవిత్రులని మీ తండ్రికి, మీ దేవునికి, నా దేవునికి నేను సాక్ష్యమిచ్చెదను; తద్వారా నేను మీకు చేసియున్న చివరిదైన ఈ గొప్ప వాగ్దానమును నా చిత్తమైనప్పుడు నేను నెరవేర్చెదను.

76 ఈ సమయము నుండి మీరు ప్రార్థనలోను, ఉపవాసములోను కొనసాగాలని నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను.

77 పరలోకరాజ్యపు సిద్ధాంతమును మీరు ఒకరికొకరు బోధించాలని నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను.

78 శ్రద్ధగా బోధించుడి, నా కృప మీకు దొరుకును, తద్వారా మీరు సూత్రమందు, నియమమందు, సిద్ధాంతమందు, సువార్త నియమమందు, దేవుని రాజ్యమునకు సంబంధించి మీరు గ్రహించుటకు యుక్తమైన అన్ని విషయములందు;

79 పరలోకమందు, భూమియందు, పాతాళమందు ఉన్న సంగతులను గూర్చి; ఎప్పటినుండో ఉన్న సంగతులు, ప్రస్తుతమున్న సంగతులు, త్వరలో జరుగబోవు సంగతులు; స్వదేశములో, విదేశాలలో ఉన్న సంగతులు; యుద్ధములు, జనముల కలవరములు, దేశములో ఉన్న తీర్పులు; మరియు దేశముల గూర్చి, రాజ్యములను గూర్చిన జ్ఞానమందు మరింత పరిపూర్ణముగా మీరు ఉపదేశమును పొందుదురు—

80 తద్వారా నేను మిమ్ములను పిలిచిన పిలుపును, నేను మీకు అప్పగించిన పరిచర్యను ఘనపరచుటకు చేయుటకు నేను మరలా మిమ్ములను పంపునప్పుడు అన్ని విషయములందు మీరు సిద్ధపడియుందురు.

81 ఇదిగో సాక్ష్యమిచ్చుటకు, జనులను హెచ్చరించుటకు నేను మిమ్ములను బయటకు పంపుచున్నాను, హెచ్చరించబడిన ప్రతి మనుష్యుడు తన పొరుగువానిని హెచ్చరించుట అవసరము.

82 కాబట్టి, వారు క్షమాపణలేకయుందురు, వారి పాపములు వారి తలలపైన ఉన్నవి.

83 త్వరపడి నన్ను వెదకువాడు నన్ను కనుగొనును మరియు వాడు విడువబడడు.

84 కాబట్టి, ఇక్కడ ఉండి, శ్రద్ధతో పనిచేయుడి, తద్వారా చివరిసారి అన్యజనుల మధ్యకు వెళ్ళుటకు, ధర్మశాస్త్రమును కట్టుటకు, సాక్ష్యమును ముద్రించుటకు, రాబోవు తీర్పుగడియకు పరిశుద్ధులను సిద్ధపరచుటకు ఎంతమంది పేర్లను ప్రభువు నోరు పలుకునో వారందరికి మీరు చేయు పరిచర్యయందు మీరు పరిపూర్ణులగుదురు;

85 తద్వారా ఈ లోకమందును, రాబోవు లోకమందును దేవుని ఉగ్రతనుండి, దుష్టుల కొరకు వేచియున్న నాశనకరమగు హేయవస్తువు నుండి వారి ఆత్మలు తప్పించుకొనవచ్చును. ప్రభువు నోటితో మొదటి పెద్దలు కాని వారిని పిలిచేవరకు వారిని ద్రాక్షతోటలో పనిచేయనిమ్ము, ఏలయనగా వారి సమయము ఇంకను ఆసన్నము కాలేదు; ఈ తరము వారి రక్తము నుండి వారి వస్త్రములు పవిత్రముగా లేవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

86 మీరు స్వతంత్రులుగా చేయబడిన స్వాతంత్ర్యమునందు నిలిచియుండుడి; పాపమందు చిక్కుకొనకుడి, కానీ ప్రభువు వచ్చువరకు మీ చేతులు పవిత్రముగా ఉండనియ్యుడి.

87 ఏలయనగా భూమి త్రాగుబోతు వలే వణికి, అటు ఇటు తిరుగులాడుటకు ఎన్నో దినములు లేవు; సూర్యుడు తన ముఖమును మరుగుపరచుకొనును, వెలుగునిచ్చుటకు తిరస్కరించును; చంద్రుడు రక్తమునందు స్నానము చేయును; నక్షత్రములు మిక్కిలి కోపపడి, అంజూరపు చెట్టునుండి రాలిపడు అంజూరపు పండ్లవలె వాటికవి క్రిందపడును.

88 మీ సాక్ష్యము తరువాత, జనులపై ఉగ్రత మరియు శిక్ష వచ్చును.

89 ఏలయనగా మీ సాక్ష్యము తరువాత భూకంపముల సాక్ష్యము వచ్చును, అవి దాని మధ్యలో రోదనలను కలుగజేయును మరియు మనుష్యులు నేలపై పడి, నిలబడలేకయుందురు.

90 ఉరుముల స్వరము యొక్క సాక్ష్యము వచ్చును, మెరుపుల స్వరము యొక్కయు, తుఫానుల స్వరము యొక్కయు, వాటి హద్దులను దాటిన సముద్రపు తరంగముల స్వరము యొక్కయు సాక్ష్యము వచ్చును.

91 అన్ని సంగతులు సంక్షోభములోనుండును; జనులపైకి భయము వచ్చును, గనుక మనుష్యులు ధైర్యము చెడి, కూలుదురు.

92 ఆకాశమండలము మధ్యన దేవదూతలు ఎగురుచు, దేవుని బూరను ఊదుచు, గొప్ప శబ్దముతో కేకవేయుచూ ఇలా చెప్పుదురు: మన దేవుని తీర్పునకు సమయము ఆసన్నమాయెను, గనుక ఓ భూలోక నివాసులారా, మీరు సిద్ధపడుడి, మీరు సిద్ధపడుడి. ఇదిగో చూడుడి, పెండ్లికుమారుడు వచ్చుచున్నాడు; ఆయనను కలుసుకొనుటకు బయలు వెళ్ళుడి.

93 వెంటనే ఆకాశమందు ఒక గొప్ప సూచకక్రియ కనబడును, జనులందరు కలిసి దానిని చూచెదరు.

94 మరియొక దేవదూత ఈలాగు చెప్పుచు తన బూరను ఊదును: ఆ గొప్ప సంఘము, హేయకార్యములకు తల్లి, అది సమస్త జనములను తన జారత్వమను ఉగ్రత యొక్క ద్రాక్షారసమును త్రాగునట్లు చేసెను, అది దేవుని పరిశుద్ధులను హింసించుచుండెను, అది వారి రక్తమును చిందించును—అది విస్తార జలములపైన, సముద్ర ద్వీపములపైన కూర్చునియుండును—ఇదిగో, ఆమె భూమిపైన ఉన్న గురుగులైయున్నది; ఆమె కట్టలు కట్టబడినది; ఆమె కట్లు బలముగా చేయబడెను, దానిని ఏ మనుష్యుడు విప్పలేడు; కాబట్టి కాల్చబడుటకు ఆమె సిద్ధముగానున్నది. అతడు తన బూరను దీర్ఘముగాను, బిగ్గరగాను ఊదును, సమస్త జనములు దానిని వినును.

95 పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగానుండును; చుట్టబడిన కాగితపు చుట్ట తెరువబడునట్లు పరలోకపు తెర తెరువబడును, ప్రభువు ముఖము కనపరచబడును;

96 భూమి మీద జీవించియున్న పరిశుద్ధులు, జవసత్వములు పొంది ఆయనను కలుసుకొనుటకు కొనిపోబడుదురు.

97 వారి సమాధులలో నిద్రించువారు బయటకు వచ్చుదురు, ఏలయనగా వారి సమాధులు తెరువబడును; ఆయనను ఆకాశ స్తంభము మధ్య కలుసుకొనుటకు వారు కూడా కొనిపోబడుదురు—

98 వారు క్రీస్తువారు, ప్రథమ ఫలములు, ఆయనతో మొదట అవరోహణమయ్యేవారు, వారు భూమిమీద నుండి, తమ సమాధులలో నుండి ఆయనను కలుసుకొనుటకు మొదట కొనిపోబడువారు; ఇదంతయు దేవదూత బూర ధ్వని వలన జరుగును.

99 దీని తరువాత మరియొక దూత ఊదును, అది రెండవ బూర; ఆయన రాకడ సమయములో క్రీస్తుకు చెందినవారికి అప్పుడు విమోచన కలుగును; వారు సువార్తను పొందుటకు, శరీరమును బట్టి మనుష్యులకు తీర్పుతీర్చబడుటకు వారి కొరకు సిద్ధపరచబడిన చెరసాలలో పాలుపొందిరి.

100 మరలా, మరియొక బూర ఊదబడును, అది మూడవ బూర; తీర్పు తీర్చబడవలసిన శిక్షావిధిలో ఉన్నట్లు కనుగొనబడు మనుష్యాత్మలు అప్పుడు వచ్చును;

101 మృతులలో మిగిలిన వారు వీరే; వెయ్యేండ్లు ముగియు వరకు వారు మరలా జీవించరు, భూమి అంతము వరకు కూడా మరలా జీవించరు.

102 ఇలా చెప్పుచు మరియొక బూర మ్రోగును, అది నాల్గవ బూర: ఆ గొప్ప అంత్యదినము వరకు అనగా అంతము వరకు ఉండవలసిన వారి మధ్య ఇంకను అపవిత్రులుగా ఉండువారు కనుగొనబడిరి.

103 మరియొక బూర మ్రోగును, అది ఐదవ బూర, అతడు ఆకాశము మధ్యన ఎగురుచు, సమస్త జనములు, వంశములు, భాషలు, ప్రజలకు నిత్య సువార్తను అప్పగించు అయిదవ దూత;

104 అతని బూరధ్వని పరలోకమందును, భూలోకమందును, పాతాళమందున్న సమస్త జనులకు ఈలాగు చెప్పుచుండెను—దేవునికి భయపడుడి, నిరంతరము సింహాసనముమీద ఆసీనుడైయుండు ఆయనను మహిమపరచుడి, ఏలయనగా తీర్పు గడియ వచ్చియున్నదని చెప్పుచుండు బూరధ్వని వారు వినునప్పుడు ప్రతి చెవియు దానిని వినును, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును.

105 మరలా, ఈలాగు చెప్పుచు మరియొక దూత తన బూరను ఊదును, అది ఆరవ దూత: సమస్త జనములు తన జారత్వపు ఉగ్రత యొక్క ద్రాక్షారసమును త్రాగునట్లు చేసిన ఆమె పడిపోయెను, ఆమె పడిపోయెను, పడిపోయెను!

106 మరలా, ఈలాగు చెప్పుచు మరియొక దూత తన బూరను ఊదును, అది ఏడవ దూత: అది ముగిసెను; అది ముగిసెను! దేవుని గొఱ్ఱెపిల్ల జయించి, ద్రాక్షాగానుగ అనగా సర్వశక్తిమంతుడగు దేవుని ఉగ్రత యొక్క తీవ్రకోపమను ద్రాక్షాగానుగ త్రొక్కివేసెను.

107 అప్పుడు ఆయన శక్తి యొక్క మహిమతో దేవదూతలు కిరీటము ధరింపజేయబడుదురు, పరిశుద్ధులు ఆయన మహిమతో నింపబడుదురు, వారి స్వాస్థ్యమును పొంది, ఆయనతో సమానముగా చేయబడుదురు.

108 అప్పుడు మొదటి దూత జీవించియున్న అందరి చెవులలో తన బూరను ఊది, మొదటి వెయ్యేండ్లలో మనుష్యుల రహస్యక్రియలను, దేవుని మహాగొప్ప కార్యములను బయలుపరచును.

109 తరువాత రెండవ దూత తన బూరను ఊది, మనుష్యుని రహస్యక్రియలను, వారి హృదయపు ఆలోచనలు, ఉద్దేశ్యములను, రెండవ వెయ్యేండ్లలో దేవుని యొక్క మహాగొప్ప కార్యములను బయలుపరచును—

110 ఆ విధముగా ఏడవ దూత తన బూరను ఊదువరకు జరుగును; అతడు నేలమీద, సముద్రముపైన నిలబడి ఇక సమయము ఉండదని, సాతాను బంధింపబడునని, అపవాదిగా పిలువబడు ఆ ఘటసర్పము వెయ్యేండ్ల వరకు విడిపింపబడడని సింహాసనాసీనుడైయున్న ఆయన నామములో ప్రమాణము చేయును.

111 అప్పుడు తన సైన్యములను పోగుచేసుకొనుటకు అతడు కొద్దికాలముపాటు విడిచిపెట్టబడును.

112 ఏడవ దూతయు ప్రధాన దూతయుయైన మిఖాయేలు తన సైన్యములను అనగా పరలోక సైన్యములను పోగుచేయును.

113 అపవాది తన సైన్యములను అనగా నరకపు సైన్యములను పోగుచేసుకొని మిఖాయేలు, అతని సైన్యములకు విరోధముగా యుద్ధము చేయుటకు పైకిలేచును.

114 అప్పుడు మహాగొప్ప దేవుని యొక్క యుద్ధము జరుగును; అపవాది, వాని సైన్యములు ఇక పరిశుద్ధులపై శక్తి లేకుండునట్లు తమతమ స్థలములకు త్రోసివేయబడుదురు.

115 ఏలయనగా మిఖాయేలు వారి యుద్ధములను పోరాడును, సింహాసనముపైన కూర్చొనియున్న ఆయన అనగా దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క సింహాసనమును ఆపేక్షించు వానిని జయించును.

116 ఇది దేవుని యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు మహిమయైయున్నది; వారు ఇక మరణమును చూడరు.

117 కాబట్టి నా స్నేహితులారా, నేను మీకు ఆజ్ఞాపించిన విధముగా మీ వ్రతదినమును ఏర్పాటుచేయుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

118 అందరికి విశ్వాసము లేకుండెను, గనుక శ్రద్ధతో వెదకి, ఒకరికొకరు జ్ఞానపు మాటలను బోధించుకొనుడి; శ్రేష్ఠమైన గ్రంథములనుండి జ్ఞానముగల మాటలను వెదకుడి; అధ్యయనము ద్వారా, విశ్వాసము ద్వారా కూడా నేర్చుకొనుటకు ప్రయత్నించుడి.

119 మిమ్ములను మీరు ఏర్పాటుచేసుకొనుడి; అవసరమైన ప్రతిదానిని సిద్ధపరచుకొనుడి; ఒక మందిరమును అనగా ఒక ప్రార్థనామందిరమును, ఒక ఉపవాసమందిరమును, ఒక విశ్వాసమందిరమును, ఒక అభ్యాసమందిరమును, ఒక మహిమామందిరమును, ఒక క్రమమైన మందిరమును, ఒక దేవుని మందిరమును స్థాపించుడి;

120 తద్వారా మీ ఆగమనములు ప్రభువు నామములోనుండును; మీ నిర్గమములు ప్రభువు నామములోనుండును; మహోన్నతునికి చేతులెత్తుచు మీ వందన వచనములన్నియు ప్రభువు నామములోనుండును.

121 కాబట్టి, మీ పనికిమాలిన సంభాషణలను, సమస్త అపహాస్యమును, మీ సమస్త కామవాంఛలను, మీ గర్వమునంతటిని, తేలికపాటి మనస్తత్వమును, మీ సమస్త దుష్టక్రియలను మానివేయుడి.

122 మీ మధ్య ఒక బోధకుడిని నియమించుడి, అందరు ఒకేసారి మాట్లాడువారిగా ఉండకుడి; కానీ ఒకసారి ఒకడు మాత్రమే మాట్లాడవలెను, అతని మాటలను అందరు వినవలెను, తద్వారా అందరు మాట్లాడినప్పుడు, అందరి వలన అందరు ఆత్మీయాభివృద్ధిని పొందవచ్చును మరియు ప్రతి ఒక్కరు సమానమైన విశేషాధికారమును కలిగియుండవచ్చును.

123 మీరు ఒకరినొకరు ప్రేమించుకొనులాగున చూడుడి; మీ పొరుగువానివి ఆశించుటను మానుడి; సువార్త కోరువిధముగా ఒకరికొకరు ఇచ్చుటను నేర్చుకొనుడి.

124 సోమరితనమును విడిచిపెట్టుడి; అపరిశుభ్రముగా ఉండుటను మానుడి; ఒకరియందు మరొకరు లోపములను వెదకుటను మానుడి; అవసరమైన దానికంటె ఎక్కువ నిద్రించుటను మానుడి; మీరు అలిసిపోకుండునట్లు త్వరగా నిద్రించుడి; మీ శరీరములకు, మనస్సులకు సత్తువ కలుగునట్లు వేకువనే మేల్కొనుడి.

125 అన్నిటికంటే ముఖ్యముగా, దాతృత్వమను బంధమును దుప్పటివలె మీరు కప్పుకొనుడి, అది పరిపూర్ణత, శాంతి యొక్క బంధము.

126 నేను వచ్చువరకు మీరు అలిసిపోకుండునట్లు ఎల్లప్పుడు ప్రార్థించుడి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నా యొద్దకు మిమ్ములను చేర్చుకొందును. ఆమేన్.

127 మరలా, ప్రవక్తల యొక్క పాఠశాల అధ్యక్షత్వము కొరకు సిద్ధపరచబడిన మందిరము యొక్క క్రమము, ఈ పాఠశాల వారికి యుక్తమైన అన్నివిషయములందు వారి ఉపదేశము కొరకు, సంఘాధికారులందరి కొరకు లేదా మరియొక మాటలో ప్రధాన యాజకుల నుండి మొదలుకొని పరిచారకుల వరకు సంఘములో పరిచర్యకు పిలువబడిన వారి కొరకు స్థాపించబడినది—

128 పాఠశాల అధ్యక్షత్వపు మందిరము యొక్క క్రమము ఈవిధముగానుండును: అధ్యక్షునిగా లేదా బోధకునిగా నియమించబడిన వాడు, అతని కొరకు సిద్ధపరచబడు మందిరములో తన స్థానమందు నిలిచియుండవలెను.

129 కాబట్టి, మందిరములోని ఒక ప్రదేశములోనున్న సమూహము అతని మాటలను బిగ్గరగా చెప్పు ప్రసంగమువలె కాక జాగ్రత్తగా, స్పష్టముగా వినుటకు అతడు దేవుని మందిరములోనికి ముందుగా రావలెను.

130 దేవుని మందిరములోనికి అతడు వచ్చునప్పుడు, మందిరములో అతడు మొదటవచ్చువానిగా ఉండవలెను—ఇదిగో, అతడు మాదిరికరముగానుండుట మనోహరముగా ఉండును—

131 దేవుని యెదుట తన మోకాళ్లపై తనంతట తాను నిత్య నిబంధన యొక్క జ్ఞాపకార్థముగా లేదా గురుతుగా ప్రార్థనయందు సమర్పించుకొననియ్యుము.

132 అతని తరువాత వచ్చిన యెడల, బోధకుడు లేచి, నిదానముగా ఆకాశము వైపునకు చేతులెత్తి, తన సహోదరునికి లేదా సహోదరులకు ఈ మాటలతో వందనము చేయవలెను:

133 సహోదరుడా లేదా సహోదరులారా! నిత్య నిబంధనకు జ్ఞాపకార్థముగా లేదా గురుతుగా ప్రభువైన యేసు క్రీస్తు నామములో నేను మీకు వందనము చేయుచున్నాను, ప్రేమ బంధముతో దేవుని కరుణ ద్వారా మీ స్నేహితునిగా, సహోదరునిగానుండుటకు స్థిరమైన, కదలని, మార్పుచెందని కృతనిశ్చయముతో, దేవుని ఆజ్ఞలన్నింటిలో నిందారహితునిగా నడుచుకొనుటకు, నిరంతరము కృతజ్ఞత చెల్లించుచూ ఆ నిబంధనయందు సహవాసమునకు నేను మిమ్ములను చేర్చుకొందును. ఆమేన్.

134 ఈ వందన వచనమునకు అయోగ్యునిగా కనుగొనబడువానికి మీ మధ్య స్థానముండకూడదు; ఏలయనగా అతని వలన నా మందిరము కలుషితమగునట్లు మీరు చెయ్యకూడదు.

135 లోపలకు వచ్చి, నా యెదుట విశ్వాసముగానుండువాడు, సహోదరుడై యున్నాడు లేదా వారు సహోదరులుగా ఉండగోరిన యెడల, వారు ఆకాశమునకు చెయ్యి ఎత్తి, అటువంటి ప్రార్థన నిబంధన ద్వారా లేదా అటువంటి దానికి గురుతుగా ఆమేన్ అని చెప్పుట ద్వారా అధ్యక్షునికి లేదా బోధకునికి వందనము చేయవలెను.

136 ఇదిగో నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, దేవుని మందిరములో, ప్రవక్తల పాఠశాలలో ఒకరికొకరు చేసుకొను వందన వచనమునకు ఇది మీకొక మాదిరిగా ఉండును.

137 ఇది ఒక పరిశుద్ధ స్థలముగా, మీ ఆత్మీయాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మ మందిరముగా అగుటకు ప్రభువు యొక్క మందిరములో, ప్రవక్తల పాఠశాలలో ప్రార్థన మరియు కృతజ్ఞత చేత దీనిని చేయుటకు మీరు పిలువబడిరి.

138 ఈ తరము యొక్క రక్తమునుండి అతడు పవిత్రముగా ఉంటేనే తప్ప, మీలోనుండి ఎవనిని ఈ పాఠశాలలోనికి చేర్చుకొనకూడదు.

139 పాదములను కడుగు విధిద్వారా అతడు చేర్చుకొనబడును, దీనికొరకే పాదములను కడుగు విధి ఏర్పరచబడెను.

140 మరలా, పాదములను కడిగే విధి అధ్యక్షుడు లేదా సంఘమునకు అధ్యక్షత్వము వహించు పెద్దచేత నిర్వహించబడవలెను.

141 అది ప్రార్థనతో ఆరంభము కావలెను; రొట్టెను, ద్రాక్షారసమును పుచ్చుకొనిన తరువాత, నన్ను గూర్చి యోహాను సాక్ష్యము యొక్క పదమూడవ అధ్యాయములో ఇవ్వబడిన విధానము ప్రకారము అతడు దట్టీ కట్టుకొనవలెను. ఆమేన్.