లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 90


90వ ప్రకరణము

1833, మార్చి 8న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటు ప్రథమ అధ్యక్షత్వము ఏర్పాటులో కొనసాగింపు చర్య (81వ ప్రకరణ శీర్షిక చూడుము); దీనికి పర్యవసానముగా, ప్రస్తావించబడిన సలహాదారులు 1833, మార్చి 18న నియమించబడిరి.

1–5, దేవుని రాజ్యపు తాళపుచెవులు జోసెఫ్ స్మిత్‌కు, అతని ద్వారా సంఘమునకు ఇవ్వబడినవి; 6–7, సిడ్నీ రిగ్డన్, ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ ప్రథమ అధ్యక్షత్వములో సేవచేయవలెను; 8–11, ప్రతి మనుష్యుడు తన మాతృభాషలో వినుచుండగ సువార్త ఇశ్రాయేలు జనములకు, అన్యజనులకు, యూదులకు ప్రకటించబడవలెను; 12–18, జోసెఫ్ స్మిత్, అతని సలహాదారులు సంఘమును క్రమములో ఉంచవలెను; 19–37, యథార్థముగా నడుచుకొని, ఆయన రాజ్యములో సేవచేయుటకు వివిధ వ్యక్తులు ప్రభువుచేత ఉపదేశించబడిరి.

1 ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా కుమారుడా, నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నీ విన్నపమును బట్టి నీ పాపములు క్షమించబడియున్నవి, ఏలయనగా నీ ప్రార్థనలు, నీ సహోదరుల ప్రార్థనలు నా చెవులకు చేరియున్నవి.

2 కాబట్టి, నీకు ఇవ్వబడిన పరలోకరాజ్యపు తాళపుచెవులను మోయు నీవు ఇకమీదట ధన్యుడవు; ఆ రాజ్యము చివరిసారిగా వచ్చుచున్నది.

3 నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నీవు ఈ లోకములో ఉన్నను, లేదా రాబోవు లోకములోనున్నను ఈ పరలోకరాజ్యపు తాళపుచెవులు నీ యొద్దనుండి ఇక ఎన్నటికీ తీసివేయబడవు;

4 అయినప్పటికీ, నీ ద్వారా దేవోక్తులు మరొకనికి, అవును సంఘమునకు కూడా ఇవ్వబడును.

5 దేవుని దేవోక్తులను పొందువారందరు, వాటిని ఏవిధముగా యెంచుదురో దాని విషయమై వారు జాగ్రత్తపడవలెను, లేనియెడల వారు తేలికగా తీసుకొని, దానివలన వారు శిక్షింపబడుదురు, తుఫానులు వచ్చి, పెనుగాలులు వీచి, వానలు వచ్చి, వారి ఇంటిని కొట్టినప్పుడు వారు తొట్రిల్లి పడిపోవుదురు.

6 మరలా, నీ సహోదరులైన సిడ్నీ రిగ్డన్, ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్‌లకు నేను చెప్పునదేమనగా, వారి పాపములు కూడా క్షమించబడియున్నవి, ఈ చివరి రాజ్యపు తాళపుచెవులను కలిగియుండుటకు నీతోపాటు వారు కూడా సమానముగా యెంచబడుదురు;

7 అదేవిధముగా నేను ఏర్పాటుచేయమని ఆజ్ఞాపించియున్న ప్రవక్తల యొక్క పాఠశాల తాళపుచెవులు కూడా నీ నిర్వహణ ద్వారా కలిగియుండెదరు.

8 దాని వలన సీయోను యొక్క, ఇశ్రాయేలు జనముల యొక్క, అన్యజనుల యొక్కయు, నమ్మిన వారందరి యొక్క రక్షణ కొరకు వారు చేయు పరిచర్యయందు పరిపూర్ణులగుదురు;

9 నీ పరిచర్య ద్వారా వారు వాక్యమును పొందవచ్చును, వారి పరిచర్య ద్వారా వాక్యము భూదిగంతముల వరకు, మొదట అన్యజనుల యొద్దకు వెళ్ళును, తరువాత ఇదిగో వారు యూదుల యొద్దకు తిరిగెదరు.

10 జనములను, అన్య జనములను, యోసేపు గృహమును, వారి రక్షణ సువార్త విషయమై ఒప్పించుటకు ప్రభువు బాహువు శక్తితో కనపరచబడు దినము అప్పుడు వచ్చును.

11 ఏలయనగా ఆ దినమందు జరుగునదేమనగా, ఈ అధికారమునకు నియమించబడిన వారి ద్వారా, యేసు క్రీస్తు యొక్క బయల్పాటు కొరకు వారిపై క్రుమ్మరించబడిన ఆదరణకర్త యొక్క పరిచర్య ద్వారా ప్రతి మనుష్యుడు సువార్త యొక్క సంపూర్ణతను తన మాతృభాషలో, తన స్వంత భాషలో వినును.

12 ఇప్పుడు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఈ పరిచర్యయందు, అధ్యక్షత్వమునందు కొనసాగవలెనని నేను మీకు ఒక ఆజ్ఞనిచ్చుచున్నాను.

13 మీరు ప్రవక్తల యొక్క అనువాదమును పూర్తిచేసిన తరువాత, అటుపిమ్మట మీరు సంఘము యొక్క మరియు పాఠశాల యొక్క వ్యవహారములపై అధ్యక్షత్వము వహించవలెను;

14 నిర్ణీత సమయాలలో ఆదరణకర్త వలన ప్రత్యక్షపరచబడినప్పుడు, పరలోకరాజ్య మర్మములను విప్పుటకు బయల్పాటులను పొందవలెను;

15 సంఘములను ఒక క్రమములో ఉంచి, అధ్యయనము చేసి, నేర్చుకొని, అన్ని మంచి పుస్తకములతో, భాషలతో, మాతృభాషలతో, జనులతో పరిచయము కలిగియుండవలెను.

16 సలహామండలిలో అధ్యక్షత్వము వహించుట, ఈ సంఘము, రాజ్యము యొక్క వ్యవహారములన్నిటిని సక్రమములో ఉంచుట అనునదియే మీ జీవితాలన్నిటిలో మీ పరిచర్య మరియు బాధ్యతయైయుండవలెను.

17 సిగ్గుపడక, విస్మయమొందక ఉండుడి; కానీ మీ గర్వము, అహంకారములన్నిటిలో గద్దింపబడుడి, ఏలయనగా అది మీ ఆత్మలపై వలపన్నును.

18 మీ గృహములను సక్రమముగా ఉంచుకొనుడి; సోమరితనమును, అపరిశుభ్రతను మీ నుండి దూరముగానుంచుడి.

19 ఇప్పుడు నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, వీలైనంత త్వరగా నీ సేవకుడు మరియు లేఖకుడైన ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ కుటుంబమునకు ఒక స్థలము ఏర్పాటు చేయబడవలెను.

20 నా వృద్ధ సేవకుడైన జోసెఫ్ స్మిత్ సీ. ప్రస్తుతము నివశించుచున్న ప్రదేశములోనే తన కుటుంబముతో కొనసాగవలెను; ప్రభువు నోటిద్వారా సెలవిచ్చువరకు దానిని అమ్మకూడదు.

21 నా సలహాదారుడైన సిడ్నీ రిగ్డన్ ప్రభువు నోటిద్వారా సెలవిచ్చువరకు ప్రస్తుతము ఎక్కడ నివశించుచుండెనో అక్కడే నిలిచియుండవలెను.

22 ఒక ప్రతినిధి కొరకు బిషప్పు శ్రద్ధగా వెదకవలెను, అతడు ఐశ్వర్యములు గలవాడై—దేవుని వాడును, గట్టి విశ్వాసము గలవాడైయుండవలెను—

23 అప్పుడు ప్రతి అప్పును అతడు తీర్చుగలుగుటకు శక్తిగలవాడైయుండును; తద్వారా ప్రభువు గిడ్డంగి జనుల కనుల యెదుట అవమానమునకు గురికాకుండాయుండును.

24 శ్రద్ధగా వెదకుడి; ఎల్లప్పుడు ప్రార్థించుడి, నమ్మికగలవారిగా ఉండుడి, యథార్థముగా నడుచుకొని, మీరు ఒకరితోనొకరు చేసుకొనియున్న నిబంధనను జ్ఞాపకము చేసుకొనిన యెడల, మీ మేలుకొరకు సమస్తము సమకూడి జరుగును.

25 మీ కుటుంబములకు చెందని వారికి సంబంధించినంతవరకు మీ కుటుంబములు, ప్రత్యేకించి నా వృద్ధ సేవకుడైన జోసెఫ్ స్మిత్ సీ. కుటుంబము చిన్నదిగా ఉండవలెను.

26 ఆ విధముగా నా కార్యమును నెరవేర్చుటకు మీ కొరకు ఇవ్వబడినవి మీ నుండి తీసివేయబడవు మరియు అయోగ్యులకు ఇవ్వబడవు—

27 అట్లుకానీ యెడల, నేను మీకాజ్ఞాపించిన సంగతులను నెరవేర్చుటలో మీరు ఆటంకపరచబడుదురు.

28 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా దాసియైన వియెన్నా జాక్వెస్ తన ఖర్చుల నిమిత్తము మరియు సీయోను ప్రదేశమునకు వెళ్ళుటకు ధనమును పొందుట నా చిత్తమైయున్నది;

29 మిగిలిన ధనము నాకు సమర్పించబడవలెను మరియు నా యుక్తకాలములో ఆమె ప్రతిఫలము పొందును.

30 ఆమె సీయోను ప్రదేశమునకు వెళ్ళి, బిషప్పు చేతినుండి ఒక స్వాస్థ్యమును పొందుట నా కన్నులకు అనుకూలముగా ఉన్నదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;

31 తద్వారా ఇక మీదట ఆమె దినములందు సోమరిగానుండక, ఆమె విశ్వాసముగానుండిన యెడల సమాధానముతో ఆమె స్థిరపడవచ్చును.

32 ఇదిగో నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మీరు ఈ ఆజ్ఞను వ్రాయవలెను, నా యుక్తకాలములో సీయోనుపై అధ్యక్షత్వము వహించుటకు కూడా నేను మిమ్ములను పిలిచియున్నానని సీయోనులోనున్న మీ సహోదరులకు ప్రేమపూర్వక అభివందనముతో చెప్పవలెను.

33 కాబట్టి, ఈ విషయమును గూర్చి నన్ను ఇబ్బంది పెట్టుటను వారు మానవలెను.

34 ఇదిగో నేను చెప్పునదేమనగా, సీయోనులోనున్న మీ సహోదరులు పశ్చాత్తాపపడుట మొదలుపెట్టిరి, వారిని గూర్చి దేవదూతలు సంతోషించుచుండిరి.

35 అయినప్పటికీ, అనేక విషయముల యెడల నేను సంతోషించుట లేదు; నా సేవకుడు విలియం ఈ. మెక్ లెలిన్, నా సేవకుడు సిడ్నీ గిల్బర్ట్ యెడల నేను సంతోషించుట లేదు; బిషప్పు మరియు ఇతరులు కూడా అనేక సంగతులను గూర్చి పశ్చాత్తాపపడవలెను.

36 కానీ నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ప్రభువైన నేను సీయోనుతో వ్యాజ్యమాడెదను, తన బలవంతులను బ్రతిమాలెదను, ఆమె జయించి, నా యెదుట పరిశుద్ధముగా ఉండువరకు ఆమెను గద్దించెదను.

37 ఏలయనగా ఆమె ఉన్న ప్రదేశమునుండి ఆమె తొలగించబడదు. ప్రభువైన నేను దీనిని సెలవిచ్చితిని. ఆమేన్.