లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 93


93వ ప్రకరణము

1833, మే 6న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు.

1–5, విశ్వాసులందరు ప్రభువును చూచెదరు; 6–18, తండ్రి మహిమను సంపూర్ణముగా పొందువరకు దేవుని కుమారుడు కృపయందు వర్ధిల్లుచుండెనని యోహాను సాక్ష్యమిచ్చెను; 19–20, కృపయందు వర్ధిల్లు విశ్వాసులైన మనుష్యులు కూడా ఆయన సంపూర్ణత్వమును పొందెదరు; 21–22, క్రీస్తు ద్వారా తిరిగి జన్మించినవారే జ్యేష్ఠుల సంఘమువారు; 23–28, క్రీస్తు సమస్త సత్యమును సంపూర్ణముగా పొందెను, నరుడు కూడా తన విధేయత వలన ఆవిధముగా చేయవచ్చును; 29–32, ఆదియందు నరుడు దేవునితోనుండెను; 33–35, మూలకములు నిత్యమైయున్నవి, నరుడు పునరుత్థానము నందు సంతోషమును సంపూర్ణముగా పొందవచ్చును; 36–37, మేధస్సు దేవుని మహిమయైయున్నది; 38–40, క్రీస్తు విమోచన వలన పిల్లలు దేవుని యెదుట నిరపరాధులైయున్నారు; 41–53, నాయకులైన సహోదరులు తమ కుటుంబములను చక్కబెట్టుకోవలెను.

1 నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: తన పాపములను విడిచిపెట్టి, నా నామమును బట్టి ప్రార్థన చేయుచు, నా మాటకు లోబడి, నా ఆజ్ఞలను గైకొని, నా యొద్దకు వచ్చు ప్రతి ఆత్మ నా ముఖమును చూచి, నేను ఉన్నవాడను అని తెలుసుకొనును;

2 ఈ లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించు నిజమైన వెలుగును నేనే;

3 తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నాము, నేనును తండ్రియు ఏకమైయున్నాము—

4 ఆయన తన పరిపూర్ణతను నాకు అనుగ్రహించెను గనుక తండ్రిని మరియు నేను లోకములో ఉండి, శరీరమును నా మందిరముగా చేసుకొని, మనుష్యకుమారుల మధ్య నివాసముంటిని గనుక కుమారుడనై యున్నాను.

5 నేను లోకములో ఉండి, నా తండ్రివలన చేర్చుకొనబడితిని, ఆయన కార్యములు స్పష్టముగా ప్రత్యక్షపరచబడెను.

6 యోహాను నా మహిమ యొక్క సంపూర్ణతను చూచి సాక్ష్యమిచ్చెను, యోహాను వృత్తాంతము యొక్క సంపూర్ణత ఇకముందు బయలుపరచబడవలసియున్నది.

7 అతడు—ఆయన మహిమను నేను చూచితిని, లోకము పుట్టక మునుపు ఆదియందు ఆయన ఉండెనని చెప్పి సాక్ష్యమిచ్చెను;

8 కాబట్టి, ఆదియందు వాక్యముండెను, ఏలయనగా ఆయనే వాక్యము అనగా రక్షణకు రాయబారి—

9 లోకమునకు వెలుగు, విమోచకుడు; లోకములోనికి వచ్చిన సత్యాత్మ, ఎందుకనగా లోకము ఆయన ద్వారా చేయబడెను, నరుని జీవము, నరుని వెలుగు ఆయనయందున్నవి.

10 లోకములు ఆయన వలన చేయబడినవి; నరులు ఆయన వలన చేయబడిరి; అన్నియు ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన చేత చేయబడినవి.

11 తండ్రి యొక్క అద్వితీయ కుమారుని మహిమవలె ఆయన మహిమను చూచియుంటినని యోహాను అను నేను సాక్ష్యమిచ్చుచున్నాను, ఆయన కృపాసత్యసంపూర్ణుడు అనగా సత్యస్వరూపియైన ఆత్మ, ఆయన శరీరమందు వచ్చి, మా మధ్య నివసించెను.

12 ఆయన మొదటే సంపూర్ణత్వమును పొందలేదు, కానీ కృప వెంబడి కృపను పొందుటను యోహాను అను నేను చూచియుంటిని;

13 ఆయన మొదటే సంపూర్ణత్వమును పొందలేదు, కానీ సంపూర్ణత్వమును పొందువరకు కృప వెంబడి కృపయందు కొనసాగెను;

14 అందువలన ఆయన దేవుని కుమారునిగా పిలువబడెను, ఎందుకనగా మొదటే ఆయన సంపూర్ణత్వమును పొందలేదు.

15 ఇదిగో ఆకాశము తెరువబడి, పరిశుద్ధాత్మ పావురమువలె ఆయన మీదకు దిగి, ఆయన మీద కూర్చుండెను, ఈయనే నా ప్రియ కుమారుడని చెప్పుచు ఒక స్వరము ఆకాశమునుండి వచ్చెనని యోహాను అను నేను సాక్ష్యమిచ్చుచున్నాను.

16 ఆయన తండ్రి మహిమను సంపూర్ణముగా పొందెనని యోహాను అను నేను సాక్ష్యమిచ్చుచున్నాను;

17 పరలోకమందు, భూలోకమందు ఆయన సమస్త అధికారమును పొందెను, తండ్రి మహిమ ఆయనతోనుండెను, ఏలయనగా ఆయన, ఆయనయందు నివసించెను.

18 మరియు మీరు విశ్వాసముగానుండిన యెడల, యోహాను గ్రంథమును సంపూర్ణముగా పొందెదరు.

19 ఏ విధముగా ఆరాధించవలెనో గ్రహించి తెలుసుకొనుటకు, దేనిని ఆరాధించవలెనో తెలుసుకొనుటకు ఈ మాటలను నేను మీకిచ్చుచున్నాను, తద్వారా నా నామములో మీరు తండ్రి యొద్దకు వచ్చి, తగిన కాలమందు ఆయన సంపూర్ణత్వమును పొందగలరు.

20 ఏలయనగా, మీరు నా ఆజ్ఞలను పాటించిన యెడల, మీరు ఆయన సంపూర్ణత్వమును పొందెదరు, నేను తండ్రి యందు ఉన్నవిధముగా నా యందు మహిమపరచబడుదురు; కాబట్టి నేను చెప్పునదేమనగా, మీరు కృప వెంబడి కృపను పొందెదరు.

21 ఆదియందు నేను తండ్రితో నున్నాను, నేనే జ్యేష్ఠుడనని ఇప్పుడు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;

22 నా ద్వారా జన్మించిన వారందరు ఆ మహిమలో పాలుపొందెదరు, వారే జ్యేష్ఠుల సంఘమైయున్నారు.

23 ఆత్మ అనగా సత్యస్వరూపియగు ఆత్మయైయున్న తండ్రితో ఆదియందు మీరు కూడా ఉన్నారు;

24 సత్యమనగా, ప్రస్తుతము ఉన్నవిధముగా, గతములో ఉన్నవిధముగా, భవిష్యత్తులో ఉండబోవు విధముగా ఉన్న సంగతులు యొక్క జ్ఞానము.

25 దీనికంటె ఎక్కువ లేదా తక్కువైనది ఏదైనను అది ఆది నుండి అబద్ధికునిగానున్న ఆ దుష్టాత్మనుండి వచ్చును.

26 సత్యస్వరూపియగు ఆత్మ దేవునిదైయున్నది. సత్యస్వరూపియైన ఆత్మను నేనే, నన్నుగూర్చి ఈలాగు చెప్పుచు యోహాను సాక్ష్యమిచ్చెను: సత్యము యొక్క సంపూర్ణతను ఆయన పొందెను, అవును సత్యమునంతటిని పొందెను;

27 ఆయన ఆజ్ఞలను పాటించనంతవరకు ఏ మనుష్యుడు సంపూర్ణముగా పొందలేడు.

28 ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, సత్యమునందు మహిమపరచబడి, అన్ని సంగతులను తెలుసుకొనువరకు సత్యమును, వెలుగును పొందును.

29 ఆదియందు మనుష్యుడు కూడా దేవునితో ఉండెను. మేధస్సు లేదా సత్యము యొక్క వెలుగు సృష్టించబడలేదు లేదా చేయబడదు, నిజముగా అది చేయబడలేదు.

30 మేధస్సు వలే దానికదే పనిచేయుటకు దేవుడు దానిని ఉంచిన ఆ గోళములో సత్యమంతయు స్వతంత్రముగానున్నది; లేనియెడల దానికి ఉనికి ఉండదు.

31 ఇదిగో, మనుష్యుని స్వతంత్రత దీనియందున్నది, మనుష్యుని శిక్షావిధి దీనియందున్నది; ఆదినుండి ఉన్నది వారికి స్పష్టముగా ప్రత్యక్షపరచబడెను, కానీ వారు వెలుగును పొందకయుండిరి.

32 వెలుగును పొందని ఆత్మగల ప్రతి మనుష్యుడు శిక్షావిధికి లోనగును.

33 ఏలయనగా నరుడు ఆత్మయైయున్నాడు. మూలకములు నిత్యమైయున్నవి, విడిపోకుండా కలుపబడిన ఆత్మ మరియు మూలకము సంపూర్ణానందమును పొందును;

34 విడిపోయినప్పుడు, నరుడు సంపూర్ణానందమును పొందలేడు.

35 మూలకములు దేవుని నివాసములైయున్నవి; మనుష్యుడు దేవుని నివాసముగా, ఆలయముగానున్నాడు; ఏ దేవాలయము పాడుచేయబడునో, ఆ దేవాలయమును దేవుడు నాశనము చేయును.

36 మేధస్సు దేవుని మహిమయైయున్నది, లేదా మరియొక మాటలో వెలుగు, సత్యమునైయున్నది.

37 వెలుగు, సత్యము అపవాదిని విడిచిపెట్టును.

38 ప్రతి మనుష్యుని ఆత్మ ఆదియందు నిరపరాధిగానుండెను, దేవుడు పతనము నుండి నరుని విమోచించుట వలన, నరులు మరలా తమ పసితనములో దేవుని యెదుట నిరపరాధులైరి.

39 ఆ దుష్టుడు వచ్చి, అవిధేయత ద్వారా వారి పితరుల ఆచారముల వలన మనుష్యకుమారుల యొద్దనుండి వెలుగును, సత్యమును తీసుకొనిపోవును.

40 కానీ మీ పిల్లలను వెలుగునందు, సత్యమునందు పెంచమని నేను ఆజ్ఞాపించియున్నాను.

41 కానీ నా సేవకుడవైన ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్, ఈ శిక్షావిధికి లోబడి నీవు కొనసాగితివని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;

42 ఆజ్ఞల ప్రకారము వెలుగును, సత్యమును గూర్చి నీవు నీ పిల్లలకు బోధించలేదు; ఆ దుష్టుడు నీపై ఇంకను శక్తి కలిగియున్నాడు, ఇదియే నీ శ్రమకు కారణము.

43 మరలా నేను నీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను—నీవు విడుదల కోరినయెడల నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోవలెను, ఏలయనగా నీ ఇంటిలో అనేక సంగతులు సరిగాలేవు.

44 నా సేవకుడవైన సిడ్నీ రిగ్డన్ నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నీ పిల్లలను గూర్చి కొన్ని విషయములలో నీవు ఆజ్ఞలను పాటించలేదు; కాబట్టి, మొదట నీ ఇంటిని చక్కబెట్టుకొనుము.

45 నా సేవకుడవైన జోసెఫ్ స్మిత్ జూ. నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, లేదా మరియొక మాటలో స్నేహితులని నేను మిమ్ములను పిలిచెదను, ఏలయనగా మీరు నా స్నేహితులు, నాతోకూడా మీరు స్వాస్థ్యమును పొందెదరు—

46 లోకము నిమిత్తము నేను మిమ్ములను సేవకులని పిలిచితిని, నా నిమిత్తము మీరు వారి సేవకులైయున్నారు—

47 ఇప్పుడు జోసెఫ్ స్మిత్ జూ. నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను—నీవు ఆజ్ఞలను పాటించలేదు గనుక ప్రభువు యెదుట గద్దింపబడవలెను;

48 నీ కుటుంబము తప్పక పశ్చాత్తాపపడి, కొన్ని సంగతులను విడిచిపెట్టవలెను, మరింత ఆసక్తితో నీ మాటలకు చెవియొగ్గవలెను, లేని యెడల వారి స్థానమునుండి తొలగించబడుదురు.

49 నేను ఒకనితో చెప్పునది అందరితోను చెప్పుచున్నాను; ఎల్లప్పుడు ప్రార్థించుడి, లేనియెడల ఆ దుష్టుడు మీయందు శక్తి కలిగియుండి, మీ స్థానము నుండి మిమ్ములను తొలగించును.

50 నా సంఘ బిషప్పు, నా సేవకుడైన న్యూయెల్ కె. విట్నీ కూడా గద్దింపబడవలెను, తన ఇంటిని చక్కబెట్టుకోవలెను, వారు మరింత శ్రద్ధకలిగి, ఇంటిపనులలో నిమగ్నమైయుండి, ఎల్లప్పుడు ప్రార్థించవలెను లేదా వారు తమ స్థానములలో నుండి తొలగించబడుదురు.

51 ఇప్పుడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, నా సేవకుడు సిడ్నీ రిగ్డన్ త్వరపడి ప్రయాణమై వెళ్ళవలెను, నేను అతనికి వాక్‌శక్తిని అనుగ్రహించిన కొలది ప్రభువు హితవత్సరమును, రక్షణ సువార్తను ప్రకటించవలెను; విశ్వాససహితమైన ప్రార్థన ద్వారా మీరు ఏకీభవించిన యెడల నేను అతడిని బలపరచెదను.

52 నా సేవకులు జోసెఫ్ స్మిత్ జూ., ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ కూడా త్వరపడవలెను, విశ్వాససహితమైన ప్రార్థన వలన వారికది ఇవ్వబడును; నా మాటలను గైకొనినంతవరకు ఈ లోకములోనైనను, రాబోవు లోకములోనైనను మీరు భంగపరచబడరు.

53 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నా లేఖనములను అనువదించుటకు త్వరపడుట, చరిత్ర యొక్కయు, దేశముల యొక్కయు, రాజ్యముల యొక్కయు, దేవుని మరియు మనుష్యుల చట్టముల యొక్కయు జ్ఞానమును పొందుట నా చిత్తమైయున్నది, ఇదంతయు సీయోను రక్షణ కొరకు చేయవలెను. ఆమేన్.